Kamareddy News : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో కొన్ని రోజులుగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు చూస్తూ అధికారులు అప్రమత్తమయ్యారు.
గత రెండు మూడేళ్లుగా గడగడలాడించిన కరోనా మహమ్మారితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని నెలలుగా కరోనా సైలెంట్ అవ్వటంతో ఊపిరి పీల్చుకుంటున్న జనాలు ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు వస్తున్నాయని అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.
కామారెడ్డి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఇటీవల నిజాంసాగర్ మండలంలో ఓ వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అంతేకాకుండా కామారెడ్డి పట్టణంలోనూ పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో, ల్యాబ్‌లలో పరీక్షలు చేసుకోగా మరో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఇలా జిల్లాలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైద్యఆరోగ్యశాఖ సైతం అప్రమత్తమవుతోంది. అధికారుల ఆదేశాల మేరకు ఇంటింటా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
వైద్యశాఖ కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్ వేయిస్తున్నారు. అందు కోసం హర్‌గర్, దస్తక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈనెల మొదటి వారంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ప్రతీ ఇంటికి వెళ్లి కరోనా టీకాలు వేస్తున్నారు. జిల్లాలో 531 మందికి మొదటి డోసు, 2100 మందికి రెండో డోసు, 259మందికి బుస్టర్‌డోసు వేశారు. దీంతోపాటు ప్రతి పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా కేంద్రాసుపత్రిలోను కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 16,13, 850 మంది వ్యాక్సిన్ వేయించుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ రికార్డులు చెబుతున్నాయి. మొదటి డోసు తీసుకున్న వారు 8,06,920 మంది ఉండగా రెండో డోసు తీసుకున్నవా రు 7,90,411 మంది ఉన్నారు. బూ స్టర్ డోస్ తీసుకున్నవారు 16,519 మంది ఉన్నారు.
మాస్క్ మరుస్తున్న ప్రజలు
కరోనా వైరస్ బెడద లేకపోవడంతో జనాలు మాస్క్ ధరించడం మరిచిపోయారు. కరోనా వైరస్ పూర్తిగా పోలేదని అక్కడక్కడ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడంతోనే వైరస్‌ను అరికట్టవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. కానీ జనాలు మాస్క్ ధరించడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడంలాంటి నిబంధనలు పాటించకపోవడంతోనే కేసులు నమోదవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించటం లేదు.
థియేటర్లలో ఒక్కరూ కూడా మాస్క్ లు పెట్టుకోవటం లేదు. దీంతో కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు. కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బయటకు వెళ్తే మాస్క్ లు తప్పని సరిగా ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇటు నిజామాబాద్ జిల్లాలో ఆదివారం ఒక్కరోజే 10 పాజిటివ్ కేసులు నమోదుకావటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. పలు పీహెచ్సీ సెంటర్లలో వ్యాక్సినేషన్ వేగవంతం చేశారు.