Bandi Sanjay: ఆలోపే హామీలు అమలు చేయాలి, లేకపోతే BRSకు పట్టిన గతే కాంగ్రెస్ కు!: బండి సంజయ్
6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. 70 రోజుల గడువు ముగిసిందని, మరో 15 రోజుల్లో అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్.
నిర్మల్: ఎన్నికల షెడ్యూల్ కు గడువు మరో 30 రోజులే ఉందని, అందుకే 15 రోజుల్లోనే హామీలను అమలు చేసి కాంగ్రెస్ పార్టీ తన చిత్తుశుద్దిని నిరూపించుకోవాలని ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఎన్నికల కోడ్ సాకు చూపి హామీలు అమలు చేయకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని చూస్తుంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేలా కనిపిస్తోందన్నారు.
70 రోజుల గడువు ముగిసింది
బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. 70 రోజుల గడువు ముగిసింది. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశముంది. ఆలోపే ఇచ్చిన హామీలను అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. జీతాలకే డబ్బుల్లేవు. 2 నెలల్లోనే రూ.10 వేల కోట్ల అప్పు తీసుకొచ్చి జీతభత్యాలు చెల్లిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎట్లా అమలు చేస్తుందో ప్రజలకు చెప్పాలి. రాష్ట్రంలో 17కు 17 ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపిస్తే కేంద్రం వద్దకు వెళ్లి తెలంగాణకు అధిక నిధులు తీసుకొచ్చేందుకు అవకాశం ఉంది. రాముడు, మోదీ బీజేపీ వైపు ఉన్నారు. ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని’ అన్నారు.
కొమరం భీం విజయ సంకల్పయాత్రలో భాగంగా బుధవారం మధ్యాహ్నం నిర్మల్ జిల్లాకు వచ్చారు. అనంతరం బండి సంజయ్ కుమార్ స్థానిక ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్ లతో కలిసి నిర్మల్ లోని వెయ్యి ఊడల మర్రిని సందర్శించారు. రాంజీగోండు స్మారక కేంద్రం వద్ద ఒక వర్గానికి చెందిన వ్యక్తి సమాధి ఉండటంతో స్థానికులంతా బండి సంజయ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. మహేశ్వర్ రెడ్డితో కలిసి అక్కడికి వెళ్లి రాంజీగోండు స్మృతీ కేంద్రం ఏర్పాటుకు భూమి పూజ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘‘ఒక వర్గం ఓట్ల కోసం ఆదివాసీల చరిత్రను తెరమరుగు చేసే కుట్ర చేస్తారా?
అక్కడి నుండి బీజేపీ నేతలతో కలిసి బోథ్ నియోజకవర్గం వెళ్లిన బండి సంజయ్ విజయ సంకల్ప యాత్రలో పాల్గొని ప్రసంగించారు. ‘నిజాం, బ్రిటీషర్లను ఉరికించిన పోరాట యోధుడు రాంజీగోండు. అలాంటి యోధుడితోపాటు వెయ్యి మందిని చెట్టుకు ఉరేసిన పాలకులు నిజాం రాజులు. ఆ ప్రాంతాన్ని స్ర్ముతి వనాన్ని ఏర్పాటు చేయాల్సిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు దానిని వేరే చోటుకు తరలించాలనుకోవడం దుర్మార్గం. వచ్చే ఏడాదిలోపు అదే స్థలంలోనే రాంజీగోండు స్ర్ముతి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమై భూమి పూజ చేసి వచ్చినం.
గతంలో కేసీఆర్ ఇట్లనే ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడి రాంజీగోండుసహా వెయ్యి మంది పోరాట యోధుల చరిత్రను కనుమరుగు చేయాలనుకున్నరు. చివరకు బీఆర్ఎస్ పార్టీ చరిత్రను ప్రజలు తెరమరుగు చేశారు. కాంగ్రెస్ కూడా ఇట్లనే చేస్తే ఆ పార్టీని బొంద పెట్టేందుకు సిద్ధం. నిర్మల్ లో ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. వెయ్యి ఉరుల మర్రి కంటే ఒక వర్గం వాళ్ల సమాధి ముఖ్యమా? కాంగ్రెస్ నేతలు తేల్చుకోవాలి. బీజేపీ నిర్మించే రాంజీగోండు స్మృతీ కేంద్రం నిర్మాణానికి సహకరించాలని’ కోరారు. ఆర్దిక ప్రగతిలో 10వ స్థానంలో ఉన్న భారత్ ను 5వ స్థానానికి చేర్చిన ఘనత మోదీదే. ఈ దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. కోట్లాది గ్యాస్ కనెక్షన్లు, టాయిలెట్లు నిర్మించిన నేత మోదీ అన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ కు పనీపాట లేదని.. కొత్త స్కాచ్ బాటిల్ టేస్ట్ చూడటానికే ఢిల్లీ వెళుతున్నారని సెటైర్లు వేశారు. ఆయనతో చర్చలు జరపాల్సిన ఖర్మ బీజేపీకి లేదని, అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ తో పొత్తు పెట్టుకోలేదు. ప్రజలు ఛీత్కరించిన పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ మాకెందుకు? అన్నారు. మోదీ వచ్చాక కనీస మద్దతు ధరను రెట్టింపు చేసి రైతులకు మేలు చేశారు. అట్లాగే యూరియా, డీఏపి వంటి ఎరువుల సబ్సిడీ పేరిట వరి పంటవేసే రైతులకు ఎకరాకు దాదాపు రూ 24 వేలు, పత్తి పంటకు రూ.16 వేలకుపైగా సబ్సిడీ ఇస్తున్నారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని మాట తప్పుతోందన్నారు. జీతాలకే డబ్బుల్లేని పరిస్తితి ఉంటే... ఇచ్చిన హామీలను ఎట్లా అమలు చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.