మళ్లీ తెరపైకి పసుపు బోర్డు ఏర్పాటు, 17న పార్లమెంట్ లో బిల్లు!
ఎన్నికలు వచ్చినా ప్రతిసారి నిజామాబాద్‌లో పసుపు బోర్డు తెరపైకి రావడం కామన్‌గా మారిపోయింది. తాజాగా మరోసారి పసుపు బోర్డు ఏర్పాటుపై జోరుగా చర్చ సాగుతోంది.
ఎన్నికలు వచ్చినా ప్రతిసారి నిజామాబాద్‌లో పసుపు బోర్డు తెరపైకి రావడం కామన్ గా మారిపోయింది. తాజాగా మరోసారి పసుపు బోర్డు ఏర్పాటుపై మళ్లీ జోరుగా చర్చ సాగుతోంది. సుగంధ ద్రవ్యాల బోర్డు పరిధిలోకే వచ్చే పసుపు పంటకు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. నిజామాబాద్ లో పసుపు బోర్డు కోసం ప్రజలు ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. వివిధ రకాల్లో నిరసనలు, ఆందోళనలు నిర్వహించినా ప్రజల డిమాండ్ మాత్రం నెరవేరలేదు. గత ఎన్నికల్లో బీజేపీ బోర్డు ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ కూడా ఇచ్చింది.
తాజాగా పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 17న ప్రకటన చేయటంతోపాటు ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లేదంటే హోం శాఖ మంత్రి అమిత్ షా నిజామాబాద్ లో పర్యటించి...అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు సమాచారం. గతంలో రాష్ట్ర ఎంపీలు లోక్ సభలో ప్రస్తావించినా...తెలంగాణలో పసుపు బోర్డు ప్రతిపాదనేదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇపుడు స్పైస్‌బోర్డు ఎక్స్‌టెన్షన్ సెంటర్ ఏర్పాటుతో పసుపు రైతులకు సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు కాషాయ పార్టీ నేతలు చెబుతున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా నిలిచిన ధర్మపురి అరవింద్.. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బాండ్ పేపర్‌లో సంతకం చేసి హామీ ఇచ్చారు. నాలుగేళ్లు గడిచిన ఆ దిశగా అడుగులు పడలేదు. నిజామాబాద్ ప్రాంతంలో స్పైస్‌బోర్డు ప్రాంతీయ కార్యాలయం, ఎక్స్‌టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టుగా కేంద్రం గతంలోనే తెలిపింది. హామీని నెరవేర్చకపోవడంతో నిజామాబాద్ రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నిరసనలు తెలిపారు. అరవింద్ చేతిలో ఓటమి పాలయిన కల్వకుంట్ల కవిత.. ఎప్పటికప్పుడూ దీనిపై ప్రశ్నిస్తూనే ఉన్నారు. 2023 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదనలు లేవని కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. తాజాగా పసుపు బోర్డు ఏర్పాటు అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు వస్తుండటంతోనే...పసుపు బోర్డు అంశాన్ని తెరపైకి తెచ్చారన్న విమర్శలు మొదలయ్యాయ్.