Ramesh Rathod Driving: గేర్లు మార్చడంలో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్‌ఫ్యూజ్ - వెంటనే డ్రైవర్ సీట్లోకి ఎమ్మెల్యే
Adilabad News: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉండటంతో సభ ఏర్పాట్ల పరిశీలనలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ డ్రైవింగ్ చేయడానికి గేర్లు మార్చడంలో కన్‌ఫ్యూజ్ అయ్యారు.

Ramesh Rathod confused while driving vehicle: ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పర్యటన ఉండటంతో సభ ఏర్పాట్ల పరిశీలనలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రధాని మోదీ సభ సన్నాహక సమావేశం ముగించుకుని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఏర్పాట్లు పరిశీలించేందుకు వెళ్లారు. ఎంపీ సోయం బాపురావ్ వాహనంలో ముందు కూర్చొని ఉండగా డ్రైవర్ ను కిందకు దించి మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ (BJP Ex MP Ramesh Rathod ) డ్రైవింగ్ చేయబోయారు. అయితే డ్రైవింగ్ చేసే క్రమంలో మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ గేర్లు వేసే సమయంలో కాస్త తికమకకు గురయ్యారు.
మాజీ ఎంపీని దించి.. డ్రైవింగ్ సీట్లోకి బీజేపీ ఎమ్మెల్యే
ముందుకు వెళ్లాల్సిన వాహనం కాస్త వెనక్కు వెళ్లడంతో అందులో కూర్చున్న నేతలు కొంచెం కంగారు పడ్డారు. లేటెస్ట్ టెక్నాలజీ ఫార్చునర్ వాహనం కావడంతో గేర్లు మార్చడంలో రాథోడ్ రమేష్ తడబడ్డారని స్థానికులు చెబుతున్నారు. ఒక్కసారిగా వెనుక కూర్చున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ బండి దిగి.. మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ను దిగాలని కోరారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్వయంగా డ్రైవింగ్ చేశారు. అయితే అక్కడున్న స్థానికులు కాసేపు వీరిని ఆసక్తికరంగా చూసి సరదాగా నవ్వుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ ముగ్గురు ఒకే వాహనంలో ప్రయాణించి ప్రధాని మోదీ సభ ఏర్పాట్లను పరిశీలించడం పార్టీ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు తెరతీసింది. గతంలో ఎంపీ సోయం, పాయల్, రాథోడ్ రమేష్ లపై వివాదాస్పద వాఖ్యలు చేయడం పార్టీలో దుమారాన్ని రేపింది. మారిన రాజకీయ పరిస్థితులతో వారంతా ఏకతాటిపైకి రావడం బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. ఇప్పుడూ సోషల్ మీడియాలోను ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.





















