Bandh In Basara: సరస్వతి దేవిపై రేంజర్ల రాజేష్ అనుచిత వ్యాఖ్యలు- బాసర బంద్!
Bandh In Basara: మొన్న అయ్యప్పస్వామిపై భైరి నరేష్ చేసిన వ్యాఖ్యల వివాదం ఇంకా కొనసాగుతుండగా.. సరస్వతిదేవిపై రేంజర్ల రాజేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో గ్రామస్థులు బాసర బంద్ కు పిలుపునిచ్చారు.
Bandh In Basara: బాసర అమ్మవారి పై రేంజర్ల రాజేష్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బాసర ఆలయం వద్ద గ్రామస్థుల నిరసన చేపట్టారు. నిర్మల్ జిల్లా బాసరలో బంద్ కొనసాగుతోంది. రాజేష్ పై పీడీ యాక్ట్ అమలు చేసి, అరెస్ట్ చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. బాసర అమ్మవారి ఆలయంలో విధులు నిర్వహించే అర్చక సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన ద్వారం వద్ద అర్చకులు నిరసన చేపట్టారు. బాసర శివాజీ చౌక్ వద్ద స్థానికుల ధర్నా చేపట్టారు. రేంజర్ల రాజేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు షాపులు బంద్ చేసి రోడ్డు పై నిరసన తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి రేంజర్ల రాజేష్ పై పిర్యాదు చేశారు.
బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. ఈ క్రమంలోనే బాసర పోలీస్ స్టేషన్ లో రేంజర్ల రాజేశ్ పై ఫిర్యాదు చేశారు. అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయ్యప్ప స్వామిని కించపరిచిన బైరి నరేష్ అరెస్ట్..!
మొన్నటికి మొన్న హిందూ దేవుళ్ళపై అయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరీ నరేష్‌ను వరంగల్‌లో అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అయ్యప్ప స్వాములు తమ ఆందోళనలు విరమించాలని విజ్ఞప్తి చేశారు. అరెస్టు చేసిన నరేష్‌ను కాసేపట్లో కొడంగల్ తరలించనున్నారు. అయ్యప్ప స్వామిపై భైరి నరేష్ అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలతో తెలంగాణ వ్యాప్తంగా మాల ధారణ చేసుకున్న భక్తులు ఆగ్రహానికి గురయ్యారు. రెండు రోజుల క్రితం అయ్యప్ప స్వామిపై భైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. మాలధారులు అతడికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. నరేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
భైరీ నరేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మత విద్వేషాలను ఉపేక్షించేది లేదని.. వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ప్రకటించారు. అయ్యప్ప స్వామిపై అనుచిత వాఖ్యలు సబబు కాదు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడినా, ఇతరుల మనోభావాలకు ఇబ్బంది కలిగే విధంగా మాట్లాడిన లేదా ప్రవర్తించినా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భైరీ నరేష్‌కు చట్ట ప్రకారం శిక్ష పడేటట్లు చూస్తామమని ఎస్పీ ప్రకటించారు FIR No. 185/2022 U/s 153-A, 295-A, 298, 505(2) IPC of PS Kodangal సెక్షన్ల కింద కేసులు పెట్టామన్నారు. ఎక్కడైనా మీటింగ్ లు నిర్వహించేటప్పుడు మీటింగ్ నిర్వాహకులు ఇలాంటి వారిని ప్రోత్సహించకూడదని ఎస్పీ పిలుపునిచ్చారు. అలాంటి వారిని ప్రోత్సహించి శాంతికి విఘతం కలుగ చేసిన నిర్వాహకులపైన కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
14 రోజుల రిమాండ్..
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాస్తిక సంఘం అధ్యక్షుడు బైరి నరేష్ కు కొండగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నరేష్ ను పరిగి సబ్ జైలుకు తరలించారు. సబ్ జైలుకు తరలించే క్రమంలో అయ్యప్ప స్వాములు పోలీస్ వాహనాలకు అడ్డుకున్నారు. దీంతో పగిరి సబ్ జైలు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయ్యప్ప భక్తులకు పెద్ద సంఖ్యలో జైలు వద్దకు రావడంతో నరేష్ జైలు లోపలకు పరుగులు తీశారు.