Adilabad News: కన్నులపండువగా ఇంద్రాదేవికి ఆదివాసీల కలశ పూజ, పల్లకితో ఊరేగిస్తూ సాంప్రదాయ నృత్యాలు
Adilabad News: ఆదివాసీల ఆరాధ్య దైవం ఇంద్రాదేవికి గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా కళశ పూజ చేసి అంతా కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.
Adilabad News: ఆదివాసీల ఆరాధ్య దైవమైన ఇంద్రాదేవికి ఆదివాసీలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంద్రాదేవి ఆలయం ఇటివలే పూర్తవగా.. కలశం ఎర్పాటుకు ప్రత్యేక పూజలు చేశారు. కలశంతో ఊరేగింపు ఇంద్రవెల్లిలో కన్నులపండువగా కొనసాగింది. ఉదయం 5 గంటల నుంచి భక్తులు ఆలయంలో ఇంద్రాదేవికి ప్రత్యేక పూజలు జరిపించారు. కలశ ఊరేగింపు ఇంద్రవెల్లిలో ప్రధాన రహదారి గుండా కొనసాగింది. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలు వాయిస్తూ.. ఊరేగింపు నిర్వహించారు. మహిళలు డోలు వాయిద్యాలు మధ్య ఇంద్రాదేవి పల్లకితో ఊరేగిస్తూ సాంప్రదాయ నృత్యాలు చేశారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఇంద్రాదేవికి ఆదివాసీలు ప్రత్యేక పూజల నడుమ నైవేద్యం సమర్పించి కళశం పూజ నిర్వహించారు. పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం ప్రకారం ఆదివాసీలు తమ తాత ముత్తాతల కాలంగా ఇంద్రాదేవిని కొలుస్తున్నారు. అయితే నూతన ఆలయం ఇటివలే పూర్తవగా.. కళశ పూజ కోసం ప్రత్యేకంగా పూజలు జరిపించారు. శని, ఆది వారాల్లో రెండు రోజులపాటు ఇంద్రాదేవికి పగలు రాత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఇంద్రాదేవిని పల్లకిలో ఊరేగించారు. ఆదివాసీలతో పాటు ఇంద్రవెల్లిలో ఉన్న ఆదివాసేతరులు పూజల్లో పాల్గొన్నారు. ఈ ఊరేగింపులో ఇంద్రవెల్లి సర్పంచ్ కోరేంగా గాంధారి, జడ్పీటీసీ అర్క పుష్పలత, ఎంపీటీసీ జాధవ్ స్వర్ణలత పాల్గొని అమ్మవారి పల్లకిని ఊరేగించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు కలశ స్థాపన చేపట్టారు. ఇంద్రాదేవి ఆలయ కమిటీ చైర్మన్ చాహకటి నాగోరావు, ఆలయ పూజారి చాహకటి సూర్యరావ్ ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ కార్యక్రమానికి ఆదివాసీ భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు చేశారు.
ఆదివాసీల్లో కొందరు దంపతులు హోమం చేశారు. దీంతో ఇంద్రాదేవి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఇంద్రాదేవికి మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, జడ్పీటీసీ అర్క పుష్పలత, సర్పంచ్ కోరెంగా గాంధారి, ఎంపీటీసీ జాదవ్ స్వర్ణలత, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేడ్మ భోజ్జు పటేల్, పీఎసీయస్ చైర్మన్ మారుతి దంపతులు, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం గణేష్, ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావు, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక, ప్రధాన కార్యదర్శి పెందుర్ పుష్పరాణి అర్జున్, మండల అధ్యక్షుడు భారత్, విద్యార్థి సంఘం మండల అధ్యక్షుడు పుర్క చిత్రు, ఈ ఉత్సవాలలో పాల్గొని ఇంద్రాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. అనంతరం ప్రజలు, వివిధ పార్టీల, సంఘాల నాయకులు సహపంక్తి భోజనాలు చేశారు.