Adilabad Latest News: కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో గిరిజనుల ఉద్యమ బాట- జీవో నెంబర్ 49కు వ్యతిరేకంగా 21న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్
Adilabad Latest News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 49జీవోను రద్దు చేయాలని గిరిజనులు ఉద్యమించారు. టైగర్ కన్జర్వేషన్ రిజర్వు జోన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 21న జిల్లా బంద్‌కు పలుపునిచ్చారు.

Adilabad Latest News: టైగర్ కన్జర్వేషన్ రిజర్వు జోన్ జీవో 49ను రద్దు చేయాలంటూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. గత కొద్దిరోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జీవో 49 రద్దు చేయాలని ఆందోళనలు నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో గురువారం ఆదివాసీ సంఘాల అధ్వర్యంలో ధర్నా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 49ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బెజ్జూర్‌లో మెయిన్ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. జీవో నెంబర్ 49 పత్రాలు దహనం చేశారు.
అనంతరం బెజ్జూర్ మండల తహసీల్దార్‌కి వినతి పత్రం అందజేశారు. జీఓ 49 ను రద్దు చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపాలన్నారు. ఈ సందర్భంగా ఆదివాసి నాయకులు మాట్లాడుతూ... "జీవో నెంబర్ 49 పేరుతో ఆదివాసీల మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 339 గ్రామాలను అడవి నుంచి వెళ్లగొట్టే కుట్ర జరుగుతుంది. కావున ఈ జీవో నెంబర్ 49 వల్ల సామాజికంగా, ఆర్థికంగా, సంస్కృతిపరంగా తీవ్ర అన్యాయం జరుగుతుంది."

సమస్యలపై ఆదివాసీలు నిరంతరం ఉద్యమాలు చేస్తూ, పోరాటాలు చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని గిరిజనులు మండిపడ్డారు. ప్రభుత్వాల పంతం ఆదివాసుల అంతం దిశగా వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అడవులనే నమ్ముకుని అడవుల్లో జీవిస్తున్న ఆదివాసులను అడవుల నుంచి వెళ్లగొట్టడం కుట్రలో భాగమనీ అనుమానం వ్యక్తం చేశారు. జీవో49 రద్దు అయ్యేంతవరకు పొరాడుతామని అన్నారు.

రానున్న రోజుల్లో ఉద్యమాలు తీవ్రతరం చేస్తామన్నారు గిరిజనులు. ఇప్పటికైన వెంటనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని జీవో నెంబర్ 49ని రద్దు చేసి ఆదివాసులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల గౌరవ అధ్యక్షులు సిడం సక్కారం, నాయకులు కొడప పుల్లయ్య, నైతం సత్తయ్య, మడప శ్రీనివాస్, గవుడే గంగారాం, ఆదివాసీ కొలవార్ సంక్షేమ సంఘం మండల ఉపాధ్యక్షులు మేకల శ్యామ్ రావు, ఎడ్ల మహేష్, ఆదివాసీ కొలవార్ సంక్షేమ సంఘం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా యువజన అధ్యక్షులు మెడి సతీష్, ఆదివాసీ కొలవార్ సంక్షేమ సంఘం కుమ్రం భీం జిల్లా సహాయక కార్యదర్శి పోల్క వెంకటేష్, సత్యవాన్ తదితరులు పాల్గొన్నారు.






















