Nizamabad Nikhat Zareen : నిఖత్ జరీన్ కు నిరాజనాలు పలికిన నిజామాబాద్, భారీగా విజయోత్సవ ర్యాలీ
Nizamabad Nikhat Zareen : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కు నిజామాబాద్ లో ఘన స్వాగతం పలికారు. ఆమె రాక సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
Nizamabad Nikhat Zareen : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్ సొంత ఊరు నిజామాబాద్ కు వచ్చారు. ప్రపంచ ఛాంపియన్ అయ్యాక సొంతగడ్డ నిజామాబాద్ లో అడుగుపెట్టిన అంతర్జాతీయ బాక్సర్ నిఖత్ జరీన్ కు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అధికారులు ఆమెను ఘనంగా సన్మానించారు. నగరంలోని ఫులాంగ్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ మీదుగా ఖలీల్ వాడిలోని న్యూ అంబేడ్కర్ భవన్ వరకు విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. నిఖత్ జరీన్ టాప్ లెస్ జీపులో తాను సాధించిన ప్రపంచ ఛాంపియన్ షిప్ పతాకాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. వివిధ క్రీడా, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, యువతీ యువకులు, విద్యార్థులు, క్రీడాభిమానులు జాతీయ జెండాలు పట్టుకుని బైక్ లపై నినాదాలు చేస్తూ ర్యాలీని చేశారు. నిఖత్ జరీన్ రాకతో నగరంలో సందడి వాతావరణం నెలకొంది.
నిఖత్ జరీన్ కు ఘన స్వాగతం
నిజామాబాద్ లోని న్యూ అంబేడ్కర్ భవన్ వద్ద మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జెడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్రావు, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, షకీల్ ఆమీర్, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కెఆర్.నాగరాజు నిఖత్ జరీన్ కు ఘనస్వాగతం పలికారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిఖత్ జరీన్ ను ఘనంగా సన్మానించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి నిఖత్ కు లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకం, ఆమె తొలి గురువు కోచ్ సంసాముద్దీన్ కు యాభై వేల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల కూడా నిఖత్ కు లక్ష రూపాయల నగదు పారితోషికం అందించారు. ఈ సన్మాన సభలో మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ క్రీడాపటంలో దేశం పేరును లిఖించిన నిఖత్ జరీన్ ప్రపంచ ఛాంపియన్ అవ్వడం అద్భుతమైన ఘట్టమని కొనియాడారు. నిఖత్ పట్టుదలతో కొనసాగించిన కృషికి ఆమె తల్లితండ్రుల ప్రోత్సాహం, కోచ్ ల అత్యుత్తమ శిక్షణతోనే వరల్డ్ ఛాంపియన్ అయ్యిందన్నారు.
క్రీడాకారులకు ప్రోత్సాహం
తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ క్రీడారంగానికి ఎంతో తోడ్పాటును అందిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. క్రీడల్లో రాణిస్తున్న సైనా నెహ్వాల్, సానియా మీర్జా, పీవీ.సింధు, మాలావత్ పూర్ణ, యెండల సౌందర్యలకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు అందించారని మంత్రి గుర్తుచేశారు. ప్రపంచ బాక్సర్ నిఖత్ కు కూడా 2014-15 లో జూనియర్ విభాగంలో బంగారు పతాకం సాధించిన సందర్భంగా రూ. యాభై లక్షల పారితోషికాన్ని అందించారన్నారు. ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్ షిప్ సాధించిన నేపథ్యంలో నిఖత్ కు సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున రెండు కోట్ల రూపాయల నగదు, 600 గజాల ఇంటి స్థలంతో పాటు, పోలీసు శాఖలో సబ్ డివిజనల్ పోలీసు అధికారిగా ఉద్యోగం ప్రకటించారన్నారు.
సీఎం కేసీఆర్ ప్రోత్సాహం మరువలేనిది : నిఖత్
ప్రపంచ ఛాంపియన్ షిప్ సాధించి నిజామాబాద్ కు వచ్చిన తనకు ఎంతో ఘనంగా స్వాగతం పలకడం ఆనందంగా ఉందని నిఖత్ జరీన్ అన్నారు. నిజామాబాద్ లోని నిర్మల్ హృదయ్ కాన్వెంట్ లో పాఠశాల స్థాయి విద్యను అభ్యసించిన తాను 2009లో కోచ్ సంసాముద్దీన్ వద్ద బాక్సింగ్ లో శిక్షణను ప్రారంభించానన్నారు. అప్పటిలో ఇతర బాలికలెవరూ లేకపోవడంతో తాను బాలురతో పోటీ పడాల్సి వచ్చేదన్నారు. శిక్షణ సందర్భంగా తన ముఖంపై గాయమైతే తన తల్లి అది చూసి కంటతడి పెట్టిందని, అమ్మాయిగా ఉన్న నాకు ముఖంపై గాయాల తాలూకు గుర్తులు ఏర్పడితే వివాహం కాదేమోనని భయపడేదన్నారు. అయితే తాను బాక్సింగ్ లో రాణిస్తే తనను పెళ్లి చేసుకునేందుకు అనేక మంది వరుస కడుతారని తాను చెప్పేదానినని నిఖత్ అన్నారు. పట్టుదలతో ఇవాళ ప్రపంచ ఛాంపియన్ గా ఎదిగానన్నారు. సీఎం కేసీఆర్ అందించిన ప్రోత్సాహం మరువలేనిదన్నారు.