Nizamabad News : కొడుకు మోసం చేశాడని కలెక్టరేట్ లో వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం
Nizamabad News : నిజామాబాద్ కలెక్టరేట్ లో ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. తనకు తెలియకుండా కొడుకు ఇళ్లు రాయించుకున్నాడని, కూతురికి అన్యాయం జరుగుతోందని ఆ తల్లి ఆవేదన చెందుతోంది.
Nizamabad News : నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్లో ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఎల్లమ్మ గుట్ట ప్రాంతానికి చెందిన ఒడ్డేపు రుకుంభాయ్ తన కొడుకు సాగర్ నిత్యం వేధిస్తున్నాడని తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసింది. రుకుంభాయి కొడుకు సాగర్, కూతురితో కలిసి నివాసం ఉంటుంది. తనకు తెలియకుండా కొడుకు సాగర్ ఎల్లమ్మగుట్టలో నివాసం ఉంటున్న ఇంటిని తన పేరు మీద మార్చుకున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. కలెక్టరేట్ లోని ప్రజావాణిలో కొడుకుపై ఫిర్యాదు చేసేందుకు రుకుంభాయ్ వచ్చింది. అక్కడ తనకు న్యాయం జరగదని భావించి కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న చెట్టుకు తాడు కట్టి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడే ఉన్న పోలీసులు అది గమనించి రుకుంభాయిని అడ్డుకున్నారు.
మున్సిపల్ సిబ్బంది కూడా
మున్సిపల్ సిబ్బంది తన కొడుకు ఒడ్డెపు సాగర్ కు సహకరించి ఇంటిని అతడి పేరు మీదకు మార్చారని బాధితురాలు వాపోతుంది. తన కూతురికి అన్యాయం జరుగుతోందని ఇంట్లో సగభాగం తన కూతురికి ఇవ్వాల్సిందిగా ఏడాది నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగటం లేదని వాపోయింది. కూతురికి పెళ్లికాలేదని తనను ఆదుకోవాలని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన సంతకం లేకుండానే మున్సిపల్ సిబ్బంది సాగర్ వద్ద డబ్బులు తీసుకుని ఇళ్లు అతడి పేరు మీద మార్చారని ఆరోపించింది రుకుంభాయ్. పోలీసులు ఆమెను కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. కలెక్టర్ కు రుకుంభాయ్ తన గోడును వెళ్లబోసుకుంది. ఇంట్లో సగభాగం కూతురి పేరు మీద రాసివ్వాలని కలెక్టర్ ను కోరింది. ఆమె పట్ల సానుకూలంగా స్పందించిన కలెక్టర్ నారాయణ రెడ్డి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
కలెక్టరేట్ లో ఆత్మహత్యాయత్నం
అయితే కలెక్టరేట్ కి వస్తున్న బాధితులు సమస్య పరిష్కారం కాకపోతే కలెక్టరేట్ ప్రాంగణంలో అత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే కలెక్టరేట్ ప్రాంగణంలో ఈ ఏడాది ఇప్పటి వరకు నలుగురు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. కొందరు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. బాధితులు సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి కానీ ఇలా అత్మహత్యాయత్నాలకు పాల్పడటం సరైంది కాదంటున్నారు కొందరు.
Also Read : Nizamabad Crime : నిజామాబాద్ జిల్లాలో సుపారీ హత్యకు ప్లాన్, సర్పంచ్ భర్త కుట్రను భగ్నం చేసిన పోలీసులు
Also Read : Vikarabad News : 48 గంటల అల్టిమేటం పెట్టిన బీఎస్పీ నేత ఆచూకీ లభ్యం, ఎక్కడున్నారంటే?