Vikarabad News : 48 గంటల అల్టిమేటం పెట్టిన బీఎస్పీ నేత ఆచూకీ లభ్యం, ఎక్కడున్నారంటే?
Vikarabad News : 48 గంటల్లో భార్య ఆచూకీ కనిపెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అజ్ఞాతంలోకి వెళ్లిన సత్యమూర్తి ఆచూకీ లభ్యమైంది. సత్యమూర్తి కుమార్తెలతో సహా కాశీకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
Vikarabad News : వికారాబాద్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు సత్యమూర్తి ఆచూకీని పోలీసులు గుర్తించారు. తన భార్యను 48 గంటల్లో కనిపెట్టాలని అల్టిమేటం పెట్టిన సత్యమూర్తి ఇద్దరు కుమార్తెలతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 48 గంటల్లో తన భార్య ఆచూకీ లభించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సత్యమూర్తి కోసం గాలింపు మొదలుపెట్టారు. ఎట్టకేలకు అతని ఆచూకీ గుర్తించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసిలో కుమార్తెలతో సహా సత్యమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు క్షేమంగా ఉన్నట్లు తాండూరు పోలీసులు పేర్కొన్నారు. అయితే తన భార్య ఆచూకీ కనిపించడం లేదంటూ మూడు నెలల క్రితం సత్యమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగింది?
వికారాబాద్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు దొరిశెట్టి సత్యమూర్తి తాండూరు శివాజీ చౌరస్తా ప్రాంతంలో భార్యా పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. సత్యమూర్తి భార్య అన్నపూర్ణ(36) ఇంట్లోనే ఉండేవారు. అయితే ఈ ఏడాది మార్చి 6వ తేదీ నుంచి ఆమె అదృశ్యమయ్యారు. సత్యమూర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి భార్య ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. రెండు రోజుల తరువాత తాండూరు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికి మూడు నెలలు అవుతున్నా పోలీసులు ఆమె ఆచూకీ కనుక్కోలేదు. కుటుంబ సభ్యులు అన్నపూర్ణ తెలిస్తే తమను సంప్రదించాలని, ఆమె గురించి తెలిపిన వారికి రూ.5 లక్షల నగదు బహుమతి ఇస్తామని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ విషయం తాండూరులో చర్చనీయాంశం అయింది.
సూసైడ్ లెటర్
ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడు అన్నపూర్ణ ఒక నోట్ రాశారు. అందులో తన భర్త దేవుడు. పిల్లలు జాగ్రత్త అని ఉంది. ఫిర్యాదు అందుకున్న కొన్ని రోజుల వరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఆ తర్వాత వదిలిపెట్టారు. సత్యమూర్తి భార్య మిస్సింగ్ పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేశారు. సీసీ ఫుటేజీలు ఫోన్ రికార్డులను సేకరించి పోలీసులకు అందజేశారు సత్యమూర్తి. అయినా పోలీసులు తన భార్య ఆచూకీ విషయంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇక చేసేదేంలేక 48 గంటల్లో తన భార్యను కనిపెట్టాలని లేకపోతే పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ ఓ సూసైడ్ లెటర్ కూడా పోస్ట్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సత్యమూర్తి స్నేహితులు, బంధువులు ఆయన ఇంటికి వెళ్లి ఆరా తీయగా ఇంటికి తాళం వేసి ఉంది. సత్యమూర్తి ఫోన్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ విషయంపై బంధువులు పోలీసులను ఆశ్రయించారు. సత్యమూర్తి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు మొదలు పెట్టారు. సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. దీంతో సత్యమూర్తి కుమార్తెలతో సహా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అలాగే ఆయన కారును పార్కింగ్ లో గుర్తించారు. ముందు ముంబయి వెళ్లినట్లు పోలీసులు భావించినా అతడు కాశీలో ఉన్నట్లు గుర్తించారు.