Mlc Kavitha Letter : ఓ ఉత్తమ వైద్యురాలిని కోల్పోయాం, ప్రీతి తల్లిదండ్రులకు ఎమ్మెల్సీ కవిత లేఖ
Mlc Kavitha Letter : వైద్య విద్యార్థిని ప్రీతి తల్లిదండ్రులకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ప్రీతి మరణ వార్త విని ఎంతో దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు.
Mlc Kavitha Letter : వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి తల్లిదండ్రులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. తన సోదరి డాక్టర్ ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు. ఈ విషయం తెలియగానే ఒక తల్లిగా నేను ఎంతో వేదనకు గురయ్యానని కవిత లేఖలో తెలిపారు. ప్రీతి కోలుకోవాలని మూడు రోజులుగా కోరుకున్న కోట్లాది మందిలో నేనూ ఒకరిని అని లేఖలో పేర్కొన్నారు. ఎన్నో కష్టాలు భరించి పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రీతికి ఇలా జరగడం జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. చదువుకుని సమాజానికి సేవ చేయాలన్న తపన, పట్టుదల ఉన్న ప్రీతికి ఇలా జరగడం దురదృష్టకరం అన్నారు. ఒక ఉత్తమ వైద్యురాలిని సమాజం కోల్పోయిందని లేఖలో రాశారు. అందుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నానని కవిత తెలిపారు. కన్న బిడ్డ మరణంతో కడుపుకోత అనుభవిస్తున్న మీకు ఎంత ఓదార్పు ఇవ్వాలని ప్రయత్నం చేసినా అది చాలా తక్కువే అవుతుందన్నారు. ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడని పరిస్థితి ఇదన్నారు.
డాక్టర్ ప్రీతి తల్లితండ్రులకు నా లేఖ pic.twitter.com/SsIQimvQdP
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 28, 2023
ప్రభుత్వం అండగా ఉంటుంది-కవిత
"మీ కుటుంబానికి బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నేతలు అండగా ఉంటారు. మీ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రీతి మరణానికి కారణమైన దోషులను రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టబోదు అని మీకు హామీ ఇస్తున్నాను. ఇలాంటి సంఘటనలు ఇకపై పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. యావత్తు రాష్ట్ర ప్రజలు మీ వెంట ఉన్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో భగవంతుడు మీకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను" అని లేఖలో పేర్కొన్నారు కవిత.
సైఫ్ , సంజయ్ ఎవరైనా విడిచిపెట్టం- కేటీఆర్
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న పీజీ స్టూడెంట్ డాక్టర్ ప్రీతి అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ విషయాన్ని రాజకీయం చేయడం తగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను ఉద్దేశించి అన్నారు. హన్మకొండ జిల్లాలో సోమవారం పర్యటించిన ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడారు. వివిధ అంశాల గురించి మాట్లాడుతూ.. ప్రీతి ప్రస్తావన కూడా తెచ్చారు. ఆమె చనిపోవడం చాలా బాధాకరమని, కుటుంబానికి ప్రభుత్వం తరపున, బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నిందితులు ఎంతటివారైనా వదిలేదని లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఘటనకు కారణం సైఫ్ అయినా, సంజయ్ అయినా వదిలేదని లేదని హెచ్చరించారు. కాలేజీలో జరిగిన ర్యాగింగ్ వల్ల డాక్టర్ ప్రీతి మృత్యువాత పడటం చాలా బాధాకరమని అన్నారు.
ప్రీతి తండ్రి ఆరోపణలు
ప్రీతి మరణం పట్ల ఆమె తండ్రి తీవ్రమైన ఆవేదన చెందారు. తన కుమార్తె ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్యేనని, తండ్రి నరేందర్ ఆరోపించారు. ప్రీతి తనకు తానుగా ఇంజెక్షన్ చేసుకోలేదని, ఎవరో ఇంజెక్షన్ ఇచ్చారని అన్నారు. సైఫ్ అనే వ్యక్తే ప్రీతికి ఇంజెక్షన్ ఇచ్చి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ఆ కోణంలో పోలీసులు విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రీతి మృతి చెందడానికి గల కారణాలను పోలీసులు విచారణలో కనుగొనాలని పిలుపునిచ్చారు. కాకతీయ మెడికల్ కాలేజీ అనస్థీషియా డిపార్డ్ మెంట్ హెచ్‌వోడీని సస్పెండ్ చేయాలని, ఆ తర్వాత ఈ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేస్తేనే ప్రీతి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు, నిజానిజాలు బయటకు వస్తాయని చెప్పారు.