Crime News: ఇన్‌స్టాగ్రామ్ లవర్ కోసం కొడుకును వదిలి వెళ్లిపోయిన మహిళ, నల్గొండలో అమానవీయ ఘటన
Extramarital affairs In Telangana | ప్రియుడి కోసం కన్నపేగును మరిచిపోవాలని నెలల బాలుడ్ని బస్టాండులో వదిలేసి పోయింది ఓ వివాహిత. నల్గొండ బస్టాండులో ఆదివారం ఈ ఘటన జరిగింది.

నల్గొండ: బిడ్డకు చిన్న గాయమైనా, ఏ బాధ కలిగినా తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. కానీ తన లవర్ తో వెళ్లిపోవాలని ఓ వివాహిత సభ్య సమాజం అసహ్యించుకునే పని చేసింది. ఇన్‌స్ట్రాగ్రామ్ లవర్ కోసం ఓ వివాహిత తన ఏడాదిన్నర కుమారుడిని బస్టాండులో వదిలేసి వెళ్ళిపోయింది. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నల్గొండలో ఆదివారం జరిగిన ఘటన ఇలా ఉన్నాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో వివాహితకు యువకుడు పరిచయం..
హైదరాబాద్ లోని బోడుప్పల్ ఏరియా కు చెందిన ఓ వివాహితకు నల్గొండ జిల్లా ఆలియా కు చెందిన నరేష్ అనే యువకుడితో ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఆమెకు అదివరకే వివాహమై 18 నెలల కొడుకు కూడా ఉన్నాడు. కానీ ఇన్‌స్టాగ్రామ్ లవర్ కోసం హైదరాబాద్ నుంచి నల్గొండకు వచ్చింది. తన లవర్ రాగానే కొడుకును నల్గొండ బస్టాండ్ లో ఒంటరిగా వదిలేసి నరేష్ తో కలిసి బైక్ మీద వెళ్లిపోయింది.
తల్లి తన వద్ద లేకపోవడంతో ఏడుస్తున్న బాలుడిని గుర్తించిన ఆర్టీసీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. నల్గొండ టూ టౌన్ పోలీసులు బస్టాండులో సీసీ కెమెరాలు చెక్ చేశారు. బాలుడ్ని బస్టాండులో వదిలేసి వివాహిత ఓ యువకుడి బైక్ ఎక్కి వెళుతున్నట్లు గుర్తించారు. బైక్ నెంబర్ ఆధారంగా, ఫోన్ నెంబర్ గుర్తించి ట్రేస్ చేసి వారిద్దరూ నల్గొండ వన్ టౌన్ ఏరియాలో ఉన్నట్లు తెలుసుకున్నారు.

నల్గొండ టూ టౌన్ పోలీసుల చొరవ
వన్ టౌన్ ఏరియాకి వెళ్లిన పోలీసులు వివాహితను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం భార్యాభర్తలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాలుడ్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి వారికి అప్పగించినట్లు ఎస్సై సైదులు గౌడ్ తెలిపారు. మరోసారి ఇలాంటి పనులు చేయవద్దని బాలుడి తల్లికి సూచించారు. ఆ మహిళ తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ప్రాణాలు తీస్తున్న వివాహేతర సంబంధాలు..
వివాహేతర సంబంధాలు వారి జీవితాలనే కాదు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. కొన్ని సందర్భాలలో ఆత్మహత్యలకు దారితీస్తుండగా, కొందరు హత్యలు చేసి జైలుకు వెళ్లి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా లవర్ కోసం భర్తను మోసం చేయడం, వీలైతే లవర్ తో కలిసి భర్తలను చంపుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. కొందరైతే ఒక్కమాట ఎదురు చెప్పకుండా ప్రియుడితో వెళ్లిపోయేందుకు విడాకులు సైతం ఇచ్చి హమ్మయ్య ప్రాణాలు కాపాడుకున్నానంటూ సంబరాలు చేసుకున్న ఘటనలు ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో ఇటీవల జరిగాయంటే పరిస్థితి ఎలా మారిపోయిందో అర్థమవుతోంది.






















