తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో BRSతో కలిసి పోటీచేస్తాం: తమ్మినేని
తెలంగాణలో వచ్చేఎన్నికల్లో BRSతో కలిసి పోటీచేస్తామన్నారు CPM రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని. జనచైతన్య యాత్ర నల్లగొండకు చేరుకున్న నేపథ్యంలో తమ్మినేని ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో వచ్చేఎన్నికల్లో BRSతో కలిసి పోటీచేస్తామన్నారు CPM రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని. జనచైతన్య యాత్ర నల్లగొండకు చేరుకున్న సందర్శంగా తమ్మినేని ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. BRSకు మద్దతిస్తూ సీఎం కేసీఆర్ సూచనలతో కలిసి ముందుకు సాగుతామన్నారు. భవిష్యత్తులో బీజేపీని వ్యతిరేకించే పార్టీలను కలుపుకొని బలమైన పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాసంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతోందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ సీపీఎం తిప్పికొడుతోందని, ఆ దిశగా బీజేపీని ఓడించడమే లక్ష్యంగా తమపార్టీ ముందుకు సాగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.
బీజేపీ మతోన్మాద, కార్పొరేట్ శక్తులను వ్యతిరేకిద్దాం, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం కోసం పోరాడుదాం అనే సంకల్పంతో సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన జనచైతన్య యాత్ర సోమవారం నల్గొండకు చేరుకుంది. ఇందులో భాగంగా కలెక్టరేట్ నుంచి సభ నిర్వహించే అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీతో వచ్చారు. గడియారం సెంటర్, రామగిరి , పానగల్ మీదుగా చిన్నసూరారం, నకిరేకల్ వైపుగా జనచైతన్య యాత్ర సాగింది.
బీజేపీకి వ్యతిరేకంగా ఆ పార్టీని ఓడించేందుకే తమపార్టీ బీఆర్ఎస్‌కు మద్దతిచ్చిందన్నారు తమ్మినేని వీరభద్రం. మోదీని గద్దె దించడమే లక్ష్యంగా కమ్యూనిస్టు పార్టీలు పనిచేస్తాయని తెలిపారు. వ్యవసాయాన్ని నాశనం చేసేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు శోచనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ నల్లచట్టాలే అందుకు నిదర్శనమన్నారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న బ్రిటిష్ పాలన కళ్లజూస్తున్నామని, దేశానికి ఇదెంతో ప్రమాదకరమని అన్నారు. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని తమ్మినేని స్పష్టం చేశారు. ప్రజలను ఐక్యం చేసి, మోదీ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలను తెలియజేసేందుకే జనచైతన్య యాత్రలు చేపట్టామని ఆయన స్పష్టం చేశారు.
సీపీఎం చేపట్టిన జనచైతన్య యాత్రకు BRS నేతలు సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఈ ర్యాలీకి హాజరయ్యారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ సంస్థలను నీరుగారుస్తున్నారని కంచర్ల విమర్శించారు. దేశంలో ఇప్పటివరకు 14 మంది ప్రధాన మంత్రులు పరిపాలన సాగించినా, రూ 52 లక్షల కోట్ల అప్పు మాత్రమే అయిందని, మోదీ హయాంలో రూ.100 లక్షల కోట్ల అప్పులయ్యానని విమర్శించారు. పేదవాడి కడుపుకొట్టి, నేతలను ఈడీ, సీబీఐలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనచేతన యాత్రను స్వాగతిస్తున్నామని అన్నారు. సీపీఎంతో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాలు సాగిస్తామని కంచర్ల భూపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీపీఎం మహిళా నాయకురాలు మల్లు లక్ష్మి, తదితర సీపీఎం, సీపీఐ, బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.