Singareni Jobs: సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ట్రాన్స్‌ఫర్, మెడికల్ బోర్డులో అవినీతే కారణమా ?
ఇటీవల సింగరేణిలో ప్రధాన వైద్యాధికారిని బదిలీ చేయడం, ఆయనను సింగరేణి డైరెక్టర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు చేయడంలో ఇందుకు కారణం మెడికల్ బోర్డులో జరిగిన అవినీతి ఆరోపణలే అని తెలుస్తోంది.
తెలంగాణలో ప్రముఖ సంస్థ సింగరేణిలో అవినీతి ఆరోపణలకు కీలకంగా మారిన కారుణ్య నియామకాల విషయంపై ప్రస్తుతం ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇటీవల సింగరేణి సంస్థకు సంబంధించిన ప్రధాన వైద్యాధికారిని బదిలీ చేయడం, ఆయనను సింగరేణి డైరెక్టర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు చేయడంలో ఇందుకు కారణం మెడికల్ బోర్డులో జరిగిన అవినీతి ఆరోపణలే అని తెలుస్తోంది.
సింగరేణిలో గతంలో వారసత్వ ఉద్యోగాలు ఉండేవి. 1999లో వారసత్వ ఉద్యోగాలను రద్దు చేస్తూ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రధేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే సంస్థలో మాత్రం డీజీఎంఎస్ నియమ నిబంధనలను అనుసరించి రెండేళ్ల కాలం సర్వీస్ ఉన్న కార్మికుడు అనారోగ్యానికి గురై అతనిని అన్‌ఫిట్ చేస్తే వారి వారసులకు ఉద్యోగం కల్పిస్తున్నారు. 20014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మెడికల్ బోర్డు వ్యవహారాన్ని కాస్తా కారుణ్య నియామకాలుగా మార్చి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇవి 2018 నుంచి అమలులోకి వచ్చాయి.
అవినీతికి నిలయంగా కారుణ్య నియామకాలు..
కారుణ్య నియామకాల ఉత్తర్వులు రావడంతో తమ వారసలకు తిరిగి ఉద్యోగం వస్తుందనే ఆశతో కార్మికులు ఎలాగైనా మెడికల్ అన్‌ఫిట్ కావాలనే ఉద్దేశ్యంతో పైరవీకారులను ఆశ్రయించడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల పాటు సజావుగా సాగిన ఈ ప్రక్రియలో యూనియన్ నాయకులు, సింగరేణి ఉన్నతాధికారుల జోక్యం పెరగడంతో ఈ ప్రక్రియలో అవినీతి తారాస్థాయికి చేరుకుంది. ఇదంతా బహిరంగ రహస్యంగా మారడంతో సింగరేణి సొంత విచారణ సంస్థ అయిన విజిలెన్స్‌కు అనేక మంది రెడ్ హ్యాండెడ్‌గానే పట్టుబట్టారు. ఇటీవల కాలంలో అది కాస్తా తారాస్థాయికి చేరుకుంది.
విచ్చలవిడిగా పైరవీలు..
సింగరేణి విజిలెన్స్ శాఖలో మెడికల్ బోర్డు అవినీతిపై అనేక కేసులు నమోదయ్యాయి. కార్మిక సంఘానికి చెందిన ఓ నాయకుడు కార్మికుడు వద్ద నుంచి సొమ్ములు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. దీంతోపాటు కొందరు వైద్యులు ఈ దందాలో కీలకంగా మారినట్లు ఆరోపణలున్నాయి. మెడికల్ ఇన్‌వ్యాలిడేషన్ కోసం ఒక్కొ కార్మికుడి నుంచి రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే ఓ వైపు విజిలెన్స్ శాఖ వద్ద అనేక పిర్యాదులు ఉండటం, కార్మిక సంఘం నాయకులు, ఉన్నతాధికారులపై ఆరోపణలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఈ దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతుంది.
నిబంధనలను విరుద్దంగా ఇన్‌వ్యాలిడేషన్..
మెడికల్ బోర్డు నిబంధనలమేరకు ఒక్కసారి మెడికల్ బోర్డుకు హాజరై ఫిట్ అయిన కార్మికుడు తిరిగి మెడికల్ బోర్డుకు వచ్చేందుకు అర్హత కోల్పోతాడు. మెడికల్ బోర్డుకు హాజరైన కార్మికుడి రిటైర్‌మెంట్ సమయం మూడేళ్ల వరకు ఉంటే అప్పుడు మాత్రమే మరోసారి అవకాశం కలుగుతుంది. అయితే ఇటీవల కాలంలో సర్వీస్‌లేకుండా, ఒక్కసారి మెడికల్ బోర్డుకు హాజరైన వారిని తిరిగి బోర్డుకు పిలిచి మెడికల్ ఇన్‌వాలిడేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల కమ్యూనికేషన్ సెల్‌లో పనిచేసే ఓ కార్మికుడికి ఇలానే ఇన్‌వాలిడేషన్ ఇవ్వడంతో ఈ విషయంపై సింగరేణిలో పెద్ద చర్చానీయాంశంగా మారింది.
ఉన్నతాధికారుల ప్రమేయం ఉనప్పటికీ ఎవరో ఒక్కరిని బాద్యులను చేయాలనే ఉద్దేశ్యంతో సింగరేణి ప్రధాన వైద్యాధికారిని బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కార్మికుల వారసులకు ఉద్యోగం వస్తుందనే ఆశను ఇలా అవినీతి దందాలో సింగరేణి అధికారులు కనుమరుగు చేయడంతో కార్మికుల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. మెడికల్ బోర్డుకు హాజరైన ప్రతి ఒక్కరికి ఇన్‌వాలిడేషన్ ఇస్తేనే కార్మికులకు న్యాయం చేసినవారు అవుతారని కార్మికులు కోరుతున్నారు.
Also Read: USPC Protest: జీవో 317పై తగ్గేదే లే, నేడు ఇందిరాపార్క్ వద్ద యూఎస్‌పీసీ మహాధర్నా, వారి డిమాండ్లు ఇవే
Also Read: High Court: తుది తీర్పునకు లోబడే ఉపాధ్యాయుల కేటాయింపులు.. పిటిషనర్ల అభ్యంతరాలపై వివరణ ఇవ్వండి