Ramreddy Damodar Reddy: తుంగతుర్తి టైగర్ అస్తమయం: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి జీవిత ప్రస్థానం
Ramreddy Damodar Reddy: రాంరెడ్డి దామోదర్‌రెడ్డి లేని లోటు కాంగ్రెస్‌లో ఎవరూ తీర్చలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయడ్డారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

Ramreddy Damodar Reddy: ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ చరిత్రలో సుదీర్ఘ అనుభవం, అపారమైన ప్రజాదరణ కలిగిన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. 'టైగర్ దామన్న'గా,'జనహృదయ నేత'గా పేరుపొందిన ఆయన మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ వర్గాలు, నాయకులు కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ఆయన వేసిన పునాది బలమైనదని నాయకులు కొనియాడారు.
వ్యక్తిగత నేపథ్యం- కుటుంబ రాజకీయ వారసత్వం
రాంరెడ్డి దామోదర్‌రెడ్డి 1952 సెప్టెంబర్ 14న ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాత లింగాల గ్రామంలో రాంరెడ్డి నారాయణరెడ్డి, కమలాదేవి దంపతులకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలలో మూడో కుమారుడిగా జన్మించారు. ఆయన కుటుంబానికి రాజకీయ వారసత్వం ఉంది; ఆయన పెద్ద సోదరుడు వెంకట్‌రెడ్డి కూడా సుజాత నగర్, పాలేరు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా పని చేశారు.
దామోదర్‌రెడ్డి ప్రాథమిక విద్యను స్వగ్రామంలోనే చదువుకున్నా, ఆ తరువాత హైస్కూల్ విద్యను హైదరాబాద్‌లో పూర్తి చేశారు. డిగ్రీని వరంగల్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదివారు. విద్యాభ్యాసం పూర్తి చేసిన అనంతరం, తుంగతుర్తికి చెందిన దేశ్‌ముఖ్ కుటుంబం ఉప్పునూతల సర్వోత్తంరెడ్డి, కౌసల్యాదేవిల రెండో కుమార్తె వరూధినీ దేవితో వివాహం చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. వారికి సర్వోత్తం రెడ్డి అనే కుమారుడు ఉన్నారు. ఖమ్మం జిల్లాలో జన్మించినప్పటికీ, తుంగతుర్తికి అల్లుడిగా వచ్చిన ఆయన ఇక్కడే రాజకీయంగా ఎదిగి స్థిరపడటం విశేషం.
కమ్యూనిస్టుల కంచుకోటను ఛేదించిన ధీశాలి
వివాహం జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలకు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మొదట్లో, వారి పూర్వీకులు తుంగతుర్తిలో నిర్మించిన పట్టాభి రామచంద్రస్వామి ఆలయానికి ఛైర్మన్‌గా వ్యవహరించారు. జనాకర్షణ నేతగా ఎదిగిన ఆయన తుంగతుర్తిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
రాంరెడ్డి దామోదర్‌రెడ్డి రాజకీయ జీవితంలో అత్యంత విశిష్టమైన అంశం, కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గంలో, కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడం. కమ్యూనిస్టు యోధులు భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం గెలుపొందిన తుంగతుర్తి నుంచి ఆయన నాలుగుసార్లు గెలుపొందడం విశేషం. 1985లో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయనే. 1989లో నల్లగొండ జిల్లాలో గెలిచిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో దామన్న ఒకరు.
ఐదు సార్లు శాసనసభ్యునిగా ఎన్నిక: 1985, 1989, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తుంగతుర్తి నుంచి గెలుపొందారు. 1994లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన తరువాత, 2009 ఎన్నికల్లో సూర్యాపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
రెండుసార్లు మంత్రిగా సేవలు
దామోదర్‌రెడ్డి రెండు సార్లు రాష్ట్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన 1992లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత, 2009లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో ఐటీ శాఖ మంత్రిగా సేవలు అందించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలోనే సూర్యాపేటలో బహిరంగ సభలు, ఖమ్మం జిల్లాలో సదస్సులు పెట్టి పార్టీలో టైగర్ దామన్న’గా గుర్తింపు పొందారు.
రైతుల కోసం గోదావరి జలాల కృషి
రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ప్రజాసేవలో అత్యంత కీలకమైన అంశం గోదావరి జలాల సాధన. తుంగతుర్తి నియోజకవర్గ రైతులకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను అందించాలనే లక్ష్యంతో ఆయన అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆయన కృషి ఫలితంగానే గోదావరి జలాలను ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీసుకువచ్చారు. 2009లో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డితో కలిసి వెలిశాల వద్ద గోదావరి జలాలకు పూజలు చేయడం ఆయన చిరస్మరణీయ కృషికి నిదర్శనం.
రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తన చివరి ఎన్నికల్లో (2014, 2018, 2023) వరుసగా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా స్వల్ప తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి చేతిలో ఓటమి పాలైన తర్వాత అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యారు.
ఆయన మరణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. భౌతికకాయాన్ని సందర్శించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ సంతాపం ప్రకటించారు. దామన్న లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, ఆయన సేవలు ప్రజలకు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.





















