Heavy Rains In Telangana: ఎగువ రాష్ట్రంలో వర్షం వచ్చినా ఆ ఊరికి వణుకే, ఎందుకో తెలుసా ?
Rains In Telangana: రెండేళ్ల నుంచి మాత్రం వర్షాలు, వరదలు వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. అసలు ఏం జరుగుతుందో, ఎందుకు వరద పెరుగుతుందో తెలియక భద్రాచలం ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
Godavari At Bhadrachalam: రెండేళ్లుగా భద్రాచలం ప్రాంతాన్ని గోదావరి వరద నీరు ముంచేస్తోంది. వందేళ్ల చరిత్రను తిరగరాసేలా ఇక్కడ వరద ప్రభావం చుట్టుముడుతుంది. పాలకులు మాత్రం తమ తప్పు లేదనే విధంగా కాళేశ్వరంపై సాకు చెబుతుండా, పోలవరం మీకు కలవరం అనే మాటలు వినిపిస్తున్నాయి. నాయకులు ఏం చెప్పినా.. అసలు ఇంత వరద నీరుకు కారణం ఏంటనే విషయంపై ముంపునకు గురైన బాధితుల్లో మాత్రం కలవరం నెలకొంది. వరుసగా రెండేళ్లుగా వరద నీరు చుట్టిముట్టేయడం.. ఎక్కడ చినుకు పడినా అది వరదగా మారి తమను ముంచెస్తుంది అనే భయంలో జనం బిక్కుబిక్కుమానాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
మూడేళ్ల నుంచి ముంచేస్తున్న వరద..
భద్రాచలం వద్ద సాధారణంగా వర్షాలు సమృద్దిగా కురిసినప్పుడు 45 నుంచి 47 అడుగులకు వరద నీటిమట్టం పెరగడం సర్వసాదారణం. 50 అడుగులకు వరద నీరు పెరిగినప్పుడు మాత్రం స్థానికుల్లో ఆందోళన మొదలవుతుంది. 50 అడుగుల నుంచి 53 అడుగులకు చెరుకునే సమయానికి లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు పెరగడం ప్రారంభమవుతుంది. అంటే కేవలం మూడో ప్రమాద హెచ్చరికకు వరద నీరు చేరినప్పుడు మాత్రమే స్థానికులు ఇబ్బందులకు గురవుతునారు. ఎప్పుడో అతివృష్టిగా వర్షాలు కురిసినప్పుడు మాత్రమే ఈ పరిస్థితులు ఉండేవి.
భద్రాచలం వద్ద అత్యధికంగా ఇప్పటివరకు 1986లో 75.6 అడుగులకు వరద నీరు చేరుకుంది. ఆ తరువాత 1990లో అత్యధికంగా 70.8 అడుగులకు చేరుకుంది. ఈ రెండుసార్లు 70 అడుగులకు వరద నీరు వచ్చింది. అయితే గత మూడేళ్ల నుంచి వరుసగా 60 అడుగులకు పైనే వరద నీరు చేరుతుంది. దీంతో ఇప్పుడు భద్రాచలం పరిసర ప్రాంత ప్రజలు ఇప్పుడు గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఏకంగా 71.5 అడుగులకు చేరుకుంది. అది కూడా జూలై నెలలోనే ఒక్కసారిగా వరదలు రావడంతో ఇప్పుడు అసలు ఏంటి పరిస్థితనే విషయంపై భద్రాచలం పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏ క్షణంలో కుండపోత వర్షాలు కురిసి, తాము ఏమైపోతామో అనే భయాందోళన గత ఏడాది నుంచి వీరిలో కనిపిస్తోంది.
కాళేశ్వరమా.. పోలవరమా..
భద్రాచలంలో గత మూడేళ్లుగా వస్తున్న వరదలకు కారణం ఓ వైపు కాళేశ్వరమని, మరోవైపు పోలవరమని విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా పోలవరం వల్లే భద్రాచలంకు వరద ముంపు వస్తుందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శలు చేస్తున్నారు. రెండు భారీ ప్రాజెక్టుల నడుమలో భద్రాచలం ఉండటం వల్లే ఇటీవల వరదలు వస్తున్నాయని, భద్రాచలం వాసుల భవిష్యత్ అయోమయంగా మారుతుందనే విషయంపై ఇప్పుడు ఆందోళన నెలకొంది.
వర్షం వస్తే వణుకుతున్న భద్రాచలం..
గత వారం రోజుల క్రితమే వరద ముంపుతో అతలాకుతలమైన భద్రాచలం పట్టణం ఇప్పుడు ఎక్కడ వర్షం ఎగువ ప్రాంతాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో ఎక్కడ వర్షం పడినా ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. 71.5 అడుగులకు చేరుకున్న వరద నీరు 42 అడుగులకు చేరుకుంది. దీంతో ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకున్న భద్రాచలం పట్టణం ఇప్పుడు కేవలం ఒక్కరోజు కురిసిన వర్షాలకు 48 అడుగులకు చేరుకోవడంతో మన దగ్గర వర్షం పడినా, ఎగువ రాష్ట్రాల్లో వర్షం కురిసినా భద్రాచలం వాసులు వరదల భయంతో వణకాల్సి వస్తోంది.
Also Read: Heavy Floods: భారీ వరదలతో నిండుకుండల్లా మారిన జలాశయాలు, అప్రమత్తమైన అధికారులు!