Heavy Floods: భారీ వరదలతో నిండుకుండల్లా మారిన జలాశయాలు, అప్రమత్తమైన అధికారులు!
Heavy Floods: గత కొంత కాలంగా కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్ జిల్లా మొత్తం తడిసి ముద్దైంది. జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. వరదలు ఇప్పటికీ వస్తుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
Heavy Floods: గత పది, పదిహేను రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చిగురుటాకులా వణుకుతోంది. భారీ వరదల కారణంగా జిల్లాలోని చెరువులు, వాగులు వంకలన్నీ పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికీ వరుణుడు వర్షాన్ని ఆపడం లేదు. ప్రజలు ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు కూడా భయపడుతున్నారు. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. వరద ఉద్ధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. అప్రమత్తమైన అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు..
నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. ఇన్ ఫ్లో 36, 400 క్కుసెక్కులు. వరద ఇలాగే కొనసాగితే ఒకటి రెండు రోజుల్లో ప్రాజెక్టు పూర్తిగా నిండితుంది. అయితే నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు. ప్రస్తుతం నీటిమట్టం 1403.25 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి కెపాసిటీ 17.8 టీఎంసీలు కాగా.. ప్రస్తుత కెపాసిటీ 15.323 టీఎంసీలు. అయితే భారీ వరదల కారణంగా ప్రాజెక్టు నిండుతుండటంతో ఎప్పుడైనా సరే గేట్లు ఎత్తు నీటిని దిగువకు వదిలే అవకాశం ఉంది. కాబట్టి మంజీర నది పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు, పశువుల కాపర్లు నది వైపు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా నీటి పారుదల శాఖ అధికారులు పోలీసులు శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. అంతే కాకుండా శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద కొనసాగుతూనే ఉంది.
కరీంనగర్ లోని మానేరు డ్యాం గేట్లు ఎత్తిన అధికారులు..
కరీంనగర్ పట్టణానికి సమీపంలో గల లోయర్ మానేరు డ్యామ్ కు వరద ఉద్ధృతి పెరగడంతో 4 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కర్ణన్ చేతుల మీదుగా ఈ గేట్లను తెరిచారు. 9, 10, 11, 12 గేట్ల ద్వారా దాదాపు 8వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం 30వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం..
నిజామాబాద్ జిల్లాలో అర్థరాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా క్షణం కూడా తీరిక లేకుండా వరుణుడు ముసురేస్తూనే ఉన్నాడు. ఓ వైపు పొలం పనుల్లో అన్నదాలు బిజీగా ఉన్నారు. వర్షంలో తడుస్తూనే వరి నాట్లు వేస్కుంటున్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు పంటలన్నీ నీట మునిగాయి. పలు చోట్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30 వేల ఎకరాల సోయా పంట నాశనం అయినట్లు అధికారులు చెబుతున్నారు.