Munugode Bypoll: కేంద్రం ఆ పనిచేస్తే మునుగోడు బరి నుంచి మేం తప్పుకుంటాం: జగదీశ్ రెడ్డి
చండూరులో టీఆర్ఎస్ సభ విజయవంతమైందని, కేసీఆర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం కేంద్రానికి లేదన్నారు తెలంగాణ విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి.
Munugode Bypoll 2022: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలు కేవలం తనను మాత్రమే ఆపగలిగారని, టీఆర్ఎస్ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదని తెలంగాణ విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. తనను 48 గంటల పాటు మునుగోడుకు వెళ్లకుండా ఆపారు కానీ తమ విజయాన్ని అడ్డుకోవడం బీజేపీకి సాధ్యం కాదన్నారు. ఎన్నికల సంఘం విధించిన నిషేధం ముగిసిన వెంటనే జగదీశ్ రెడ్డి తెలంగాణభ వన్‌లో మీడియాతో మాట్లాడారు. మునుగోడుకు రూ.18 వేల కోట్ల ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుటుందంటే సవాల్‌కు తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని చెప్పారు.
కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం కేంద్రానికి లేదు..
ఎన్నికల్లో కమలనాథులు అక్రమాలు శ్రుతి మించాయని, ఆ పార్టీ రాజ్యాంగ బద్ధ సంస్థలు ఈడీ, సీబీఐ లాంటి వాటిని వాడుకుంటూ అడ్డదారుల్లో గెలవాలని ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. మునుగోడు నియోజకవర్గంలో బీజేపీకి ఆదరణ లేదని, మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం ఖాయం అన్నారు. చండూరులో టీఆర్ఎస్ సభ విజయవంతమైందని, కేసీఆర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం కేంద్రానికి లేదన్నారు. మునుగోడు అభివృద్ధిలో బీజేపీ పాత్ర ఉందని ఒక్క మాటైనా ఆ పార్టీ చెప్పలేకపోతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను విమర్శించడానికి బీజేపీ నేతలు పోటీ పడుతున్నారని.. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ టీమ్ గా పనిచేస్తుందని ఆరోపించారు. బీజేపీకి, కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే 15 రోజుల్లో కృష్ణాజలాల వాటా తేల్చుతామని చెప్పాలన్నారు. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిని నడిపించే నేత ఒక్కరూ లేరని,ఆ పార్టీని చూస్తే జాలేస్తోందన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి.
బీజేపీ మునుగోడులో భారీగా నగదు పంపిణీకి కుట్ర చేస్తుందని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. బ్యాంకులకు నగదు సరఫరా చేసే వాహనాలలో, అంబులెన్స్ ల ద్వారా డబ్బులు తరలిస్తున్న సమాచారం క్షేత్రస్థాయి నుంచి వస్తుందన్నారు. ఇప్పటికే బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యక్తిగత సహాయ సిబ్బంది దాదాపు 90 లక్షల రూపాయల నగదుతో దొరికారన్నారు. ఈ అంశంలో చర్యలు తీసుకోవాలని అధికారులకు టీఆర్ఎస్ పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
నిబంధనలు ఉల్లంఘించారని ఈసీ ఆంక్షలు
మునుగోడు ఉపఎన్నిక బాధ్యతను టీఆర్ఎస్ అధిష్ఠానం మంత్రి జగదీశ్ రెడ్డికి అప్పగించడం తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి జోరుగా ప్రచారం చేశారు. అయితే ఈ ప్రచారంలో జగదీశ్ రెడ్డి ఓటర్లను భయాందోళనకు గురిచేసే వ్యాఖ్యలపై ఈసీ సీరియస్ అయింది. ఎన్నికల నిబంధనలు అతిక్రమించారంటూ కేంద్ర ఎన్నికల సంఘం మంత్రికి నోటీసులు ఇచ్చింది. మీడియాతో మాట్లాడవద్దని, ప్రచారంలో పాల్గొనవద్దని ఆంక్షలు విధించింది. రెండు రోజులపాటు ఆంక్షలు విధించగా, సోమవారం రాత్రితో నిషేధం ముగిసింది. కానీ మంత్రి జగదీశ్ రెడ్డిపై ఆంక్షలు ఉన్న సమయంలో ఆయన పీఏ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేయడం గమనార్హం.