నల్లగొండలో చేరికల్ని అడ్డుకుంటున్న కోమటిరెడ్డి - కొత్త నేతలొద్దని వాదన !
నల్లగొండ నుంచి ఎవర్నీ పార్టీలో చేర్చుకోవద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైకమాండ్‌కు తేల్చి చెబుతున్నారు. ఇప్పుడున్న అభ్యర్థులతోనే అన్ని సీట్లు గెలుస్తామంటున్నారు.
Telangana Congress : కాంగ్రెస్ పార్టీలో చేరికలు పెరుగుతున్నాయి. ఆసక్తి చూపిన నేతలందర్నీ చేర్చుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ అవుతుందనుకున్న నేతల్ని తానే సంప్రదించి కాంగ్రెస్ పార్టీలో చేర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే నల్లగొండ జిల్లా నుంచి పార్టీలో చేరాలనుకుంటున్న నేతల విషయంలో మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డం పడుతున్నారు. ఇంకెవర్నీ పార్టీలో చేర్చుకోవద్దని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఓవర్లోడ్ అయింది.. కాంగ్రెస్ పార్టీలో నేతలు కొత్తగా చేరాల్సిన అవసరం లేదని కోమటిరెడ్డి వాదిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కొత్తగా నాయకులు చేరాల్సిన అవసరం లేదని, ఉమ్మడి జిల్లాలో 12 స్థానాలకు గాను 12 ఎమ్మెల్యే అభ్యర్దులు ఇప్పటికే రెడీగా ఉన్నారని అన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ కోమటిరెడ్డి వ్యతిరేకిస్తూండటంతో ఆగిపోయింది.
గతంలోనూ చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకోవడాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించారు. తనకు తెలియకుండా నల్లగొండ జిల్లాలో చేరికలు ఉంటున్నాయని... తన ప్రాధాన్యం తగ్గించే కుట్ర చేస్తున్నారని ఆయన గతంలో ఆరోపించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఆ జిల్లాల ముఖ్య నేతలతో చర్చించిన తర్వాతే చేరికలు ఉంటాయని హామీ ఇచ్చారు. తాజాగా.. కోమటిరెడ్డి ఇంట్లో చేరికల అంశంపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. కాంగ్రెస్ కీలక నేతల సమావేశంలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ 2.0పై ప్రధానంగా చర్చించారు.
పార్టీలోకి భారీగా చేరికలు ఉండేలా టీపీసీసీ ప్లాన్ చేస్తోంది. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో పలువురు నాయకులు పార్టీలో చేరనున్నారు. గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి తదితరులు ఢిల్లీలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. బీఆర్‌ఎస్ అసంతృప్త నేతలతో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ తదితర నేతలతో చర్చలు జరుగుతుండగా.. త్వరలో వీరంతా కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.
అయితే నల్లగొండ జిల్లా చేరికల విషయంపై మాత్రం కోమటిరెడ్డి అంత ఆసక్తిగా లేరు. తనను కాదని ఎవర్నీ చేర్చుకోవద్దని ఆయన అంటున్నారు. ఈ అంశంపై ఇతర సీనియర్ నేతలు ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని చెబుతున్నారు.