Rajagopal Reddy: బీజేపీలో చేరే డేట్ ఫిక్స్, రాజగోపాల్ రెడ్డి వెల్లడి - రేవంత్‌పైన తీవ్ర విమర్శలు
ఈ నెల 21న అధికారంగా బీజేపీలో చేరుతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన ఢిల్లీలో బీజేపీ చీఫ్ నడ్డా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్‌లను కలిశారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీకిలో వెళ్తున్న అంశంపై రాజకీయంగా దుమారం చెలరేగుతున్న వేళ తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి 12 మంది ఎమ్మెల్యేలు వెళ్లారని, అప్పుడు దాని గురించి ఎవరూ రాద్ధాంతం చేయలేదని, ఎలాంటి చర్యా తీసుకోలేదని అన్నారు. ఇప్పుడు తాను బీజేపీలోకి వెళ్తుంటే రభస చేస్తున్నారని అన్నారు. ఢిల్లీలో శనివారం మధ్యాహ్నం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ప్రజాస్వామ్యంలో పార్టీలు మారే స్వేచ్ఛ అందరికీ ఉందని అన్నారు. కానీ, తాను ఒక గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం లేదని, ప్రజాస్వామ్యబద్ధంగా రాజీనామా చేస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో సీఎల్పీ నాయకుడికి ఎంతగానో సహకరించానని గుర్తు చేసుకున్నారు. ఈ మూడున్నరేళ్లుగా మునుగోడు సమస్యలపై అసెంబ్లీలో పోరాడానని అన్నారు. 2014 తర్వాత పార్టీలో ఎలాంటి పదవులు ఇవ్వకపోయినా సరే కష్టపడ్డానని చెప్పారు. అయినా తనకు ప్రాదాన్యం లేదని అన్నారు. అందుకే, ప్రధాని మోదీ వల్ల దేశాభివృద్ధి సాధ్యమని తాను బాగా నమ్ముతున్నానని అన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు.
21న బీజేపీలోకి..
తాను ఈ నెల 21న అధికారంగా బీజేపీలో చేరుతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన ఢిల్లీలో బీజేపీ చీఫ్ నడ్డా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్‌లను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, చౌటుప్పల్‌లో బహిరంగ సభ ఉండే అవకాశం ఉందని అన్నారు. ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాటం చేశానని చెప్పారు.
‘‘మునుగోడు ప్రజలు నాపై ఎన్నో ఆశలతో గెలిపించారు. నియోజకవర్గంలో తెరాస ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదు. మునుగోడు అభివృద్ధికి సొంత నిధులు ఖర్చు చేశా. నా తల్లి పేరుతో ఉన్న ఫౌండేషన్ నుంచి సేవా కార్యక్రమాలను చేస్తున్నా. నా రాజీనామాతోనైనా ముఖ్యమంత్రి కళ్లు తెరవాలి. మునుగోడులో సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి’’ అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
రేవంత్ రెడ్డి ఆ భాష ఏంటి?
తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తులను తీసుకొచ్చి మా నెత్తిన పెట్టారు. కాంగ్రెస్ లో ఉన్న మాకు ఏ మాత్రం ప్రాధాన్యం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి.. రేవంత్‌ను సీఎం చేయాలా? కాంగ్రెస్‌లో ఎందరో సీనియర్లు ఉన్నా ఆయనకి పీసీసీ ఎలా వచ్చింది? రేవంత్ రెడ్డి ఇలాంటి భాష మాట్లాడుతారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి. అలాంటి ఆయన గురించి అద్దంకి దయాకర్ చేసిన విమర్శలు దారుణంగా ఉన్నాయి. అవమానాలు తట్టుకుంటూ ఇన్నాళ్లూ కాంగ్రెస్‌ను కాపాడుకుంటూ వచ్చాం’’ అని రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు.