Khammam: ఖమ్మం మాస్ లీడర్, మాజీ మంత్రి ఫ్యామిలీ పాలిటిక్స్‌కు దూరం.. పూర్వవైభవం తెచ్చేదెవరో..!
Ram Reddy Venkat Reddy: నాలుగుసార్లు పోటీ చేసి ఓటమిపాలైన నేత అనంతరం 5 పర్యాయాలు విజయం సాధించిన నేతగా రాంరెడ్డి వెంకటరెడ్డి ప్రసిద్ధి. కానీ నేడు ఆ కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉంటోంది.
ఉమ్మడి ఖమ్మం రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకుని మాస్ లీడర్‌గా ఎదిగిన నేత రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబం ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటోంది. కమ్యూనిస్టుల కంచుకోటపై అలుపెరగని పోరాటం చేసిన రాంరెడ్డి వెంకటరెడ్డి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఖమ్మం జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడిగా ఎదిగిన ఆయన ఒకసారి ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న రాంరెడ్డి కుటుంబం ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వెంకటరెడ్డి మరణం తర్వాత ఆయన భార్య సుచరిత పాలేరు ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఖమ్మం జిల్లా రాజకీయాల వైపు ఆ కుటుంబం ఎక్కువ దృష్టి పెట్టలేదు.
అలుపెరగని పోరాటం.. ఐదుసార్లు విజయం..
రాంరెడ్డి వెంకటరెడ్డికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాస్ లీడర్‌గా క్రేజ్ ఉంది. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వెంకటరెడ్డి సర్పంచ్ స్థాయి నుంచి రాజకీయాలలో ఎదిగారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో సీపీఐ పార్టీకి కంచుకోటగా ఉన్న సుజాతనగర్ నియోజకవర్గంలో వరుసగా నాలుగుసార్లు పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ ఆ తర్వాత వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఖమ్మం జిల్లాలో బలంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలను ఎదుర్కొని తనదైన శైలిలో ముందుకు సాగారు. 1996లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంకటరెడ్డి ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు.
2009లో నియోజకవర్గాల పునర్విభజనలో సుజాతనగర్ నియోజకవర్గం తీసివేయడంతో పాలేరు నుంచి పోటీ చేసి 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి మంత్రిగా పనిచేసిన రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబానికి ఖమ్మం జిల్లాలో నమ్మకమైన అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. గ్రామాల్లో వెంకటరెడ్డి కుటుంబానికి మంచి పాలోయింగ్ ఉండటంతో మాస్ లీడర్‌గా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లాలో బలమైన రాజకీయ నాయకుడిగా ఉన్న రాంరెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ లీడర్‌గా మారాడు.
ఉప ఎన్నికల్లో ఓటమితో..
వెంకటరెడ్డి మరణంతో 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో వెంకటరెడ్డి సతీమణి సుచరిత పోటీ చేశారు. ఈ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆమె ఓటమి పాలయ్యారు. వెంకటరెడ్డి సోదరుల్లో ఒకరైన రాంరెడ్డి దామోదర్‌రెడ్డి నల్గొండ జిల్లాలో బలమైన నాయకుడిగా ఉండటంతో వెంకటరెడ్డితోపాటు గోపాల్‌రెడ్డి, కృష్ణారెడ్డిలు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సుపరిచితులుగా ఉన్నారు. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీకి కీలకంగా ఉన్న ఈ కుటుంబం నుంచి వచ్చిన రాంరెడ్డి చరణ్‌రెడ్డి కొన్ని రోజుల పాటు యువజన కాంగ్రెస్‌లో కీలకంగా తిరిగినప్పటికీ 2018 తర్వాత ఖమ్మం జిల్లా రాజకీయాలకు రాంరెడ్డి కుటుంబం దూరంగా ఉంటోంది.
చరణ్‌రెడ్డి సైతం రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకుని ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబం నుంచి మళ్లీ ఎవరైనా క్రియాశీలకంగా పనిచేస్తారా..? లేదా..? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Also Read: Warangal: ఇంట్లోకి చొరబడి భర్తపై హత్యాయత్నం.. కత్తులతో ఉన్న దుండగులను ఎదుర్కొన్న భార్య
Also Read: KTR: కేంద్ర మంత్రి నిర్మలకు మంత్రి కేటీఆర్ లేఖ.. తెలంగాణకు రూ.7,778 కోట్లు కావాలని వినతి