KA Paul: కేఏ పాల్ గొర్రెల కాపరి అవతారం, మీరంటే దొరలు అంటూ ఎద్దేవా - వీడియో వైరల్
ఆదివారం (అక్టోబరు 30) కేఏ పాల్ మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం సీరియస్‌గా జరుగుతున్న వేళ, మరోవైపు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ శైలి ప్రత్యేకతను చాటుతోంది. వినూత్న రీతిలో ఆయన జనాల్లోకి వెళ్తున్నారు. వివిధ రకాల పనులు చేస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. మరోసారి మరోస్థాయి ముందుకు వేశారు. ఈసారి ఏకంగా గొర్రెల కాపరి వేషం కట్టారు. మేకలు, గొర్రెలను కాస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేసీఆర్ పాలనలో గొర్రెల కాపరులు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిగ్రీలు చేసిన యువతకు గొర్రెలు కాయాల్సిన పరిస్థితి వచ్చిందని, ఈ పరిస్థితికి కారణం ఎవరి ప్రశ్నించారు. ఆదివారం (అక్టోబరు 30) నాంపల్లి మండలంలో ప్రచారం చేశారు.
అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ పాలనలో కష్టాలు పడుతున్నారని అన్నారు. వారిలో గొర్రెల కాపరులకు సైతం కష్టాలు తప్పడం లేదని కేఏ పాల్ ఆరోపించారు. డిగ్రీ, పీజీలు చదివినా యువతకు ఉద్యోగాలు లేకపోవడంతో చాలా మంది గొర్రెలు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఉప ఎన్నికలో తనకు ఓటేస్తే గ్రామానికి 20 మందికి చొప్పున ఉద్యోగం ఇప్పిస్తానంటూ కేఏ పాల్ హామీ ఇచ్చారు. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు.
‘‘మీరు చేసిన వంద వాగ్ధానాల్లో ఒకటి కూడా నిలబెట్టుకోలేదు. ఇప్పుడు ఈ గొర్రెల కాపరులను అడిగాను. యాదవులు, గొల్ల వాళ్లు ఎంత నరకం అనుభవిస్తున్నారో మీ చేతుల్లో ఈ 8 సంవత్సరాల నుంచి. గొర్రెలు ఇస్తామన్నారు.. ఇచ్చారా? ఇచ్చినవి ఎక్కడైనా బతికి ఉన్నాయా? అయినా చదువుకున్న వాళ్లకి ఉద్యోగాలు ఇవ్వకుండా డిగ్రీ చేసిన వాళ్లు కూడా గొర్రెలు కాసుకోవడం ఏంటి? ఎంత కష్టం? మీ కొడుకులు, మీ కూతుర్లేమో వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించి ప్రపంచాన్ని తిరుగుతున్నారు. ఎందుకంటే మీరు దొరలు. మేం గొల్ల వాళ్లం, బీసీలం. ఈ నాటకం మరి చెల్లదు. ఎందుకు మీ మాట నిలబెట్టుకోలేదు. ఎందుకు మీ వాగ్ధానాలు నెరవేర్చుకోలేదు వెంటనే మీరు చెప్పాలి. మీ హామీలు మర్చిపోయి 10 వేలు 20 వేలు ఇచ్చి మీరు ఎలా ఓట్లు అడుగుతున్నారు? ప్రభుత్వంపై సిగ్గుచేటు’’ అని కేఏ పాల్ అన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రతిరోజు సామాన్యులలో ఒకరిలా రకరకాల వేషధారణలలో కనిపిస్తూ వినూత్నంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక రోజు అందరి మధ్యా డ్యాన్సులు చేస్తూ, మరో రోజు సైకిల్ తొక్కారు. మరో రోజు ఓ సెలూన్ షాపులో క్షవరం చేయించుకున్నారు. చేలో పత్తి ఏరుతూ కనిపించారు. స్కూల్ పిల్లలకు గాలిలో ముద్దులు పెట్టారు. అలా ఇవాళ గొర్రెల కాపరి వేష ధారణలో కేఏ పాల్ కనిపించారు.
నా గెలుపు గ్యారంటీ - కేఏ పాల్
మునుగోడులో 30 నుంచి 50 వేల ఓట్ల ఆధిక్యంతో తాను గెలుస్తున్నానని కేఏ పాల్ శనివారం తెలిపారు. చౌటుప్పల్ పురపాలిక లింగోజీగూడెంలో నిన్న ఆయన మాట్లాడారు. బీజేపీ ఓడిపోతుందని తెలిసి తన ప్రియ శిష్యుడు జేపీ నడ్డా మునుగోడు సభను రద్దు చేసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతిరెడ్డి కూడా తనకు మద్దతునివ్వాలని కోరారు. లింగోజీగూడెంలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు విలేకరుల సమావేశం ఉందని కేఏ పాల్ సమాచారం ఇచ్చారు. మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లేసరిగా రెస్టారెంట్‌లో కేఏ పాల్ బెంచీపై పడుకుని నిద్రపోయారు. గంట తర్వాత నిద్ర లేచి విలేకరులతో మాట్లాడారు.