TRS Leaders Goa Tour: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన టీఆర్‌ఎస్ ఖమ్మం లీడర్ల గోవా టూర్
ఖమ్మం టీఆర్‌ఎస్ గోవా టూర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను గోవా, బెంగుళూరు తీసుకెళ్లారు.
ఖమ్మంజిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులను క్యాంపులకు తరలించింది అధికార పార్టీ టీఆర్‌ఎస్. కొందరిని గోవా, మరికొందర్ని బెంగళూరు పంపించారు జిల్లా నాయకులు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అక్కడ లీడర్లు చేస్తున్న ఎంజాయ్ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. తమలో ఉన్న ప్రతిభను గోవా టూర్ సందర్భంగా వెలికి తీస్తున్నారని సటైర్లు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బెంగుళూరు వెళ్లిన ప్రజాప్రతినిధులు ఒమిక్రాన్ భయంతో వణికిపోతుంటే... గోవా వెళ్లిన లీడర్లు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్‌లు, డ్యాన్స్‌లతో మస్త్ మజా చేస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీకి అధికారికంగానే పూర్తి బలం ఉంది. జిల్లాలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 769 ఓట్లు ఉండగా అందులో టీఆర్‌ఎస్ పార్టీకి అధికారికంగా 497 ఓట్లు ఉన్నాయి. టీడీపీకి చెందిన 19, స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన 75 మంది టీఆర్‌ఎస్ పార్టీలోనే చేరారు. దీంతో టీఆర్‌ఎస్‌పార్టీకి సరాసరిగా 600 వరకు ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. అయినప్పటికీ పార్టీలో ఉన్న వర్గపోరు, కౌన్సిలర్లు, ఎంపీటీసీల‌్లో అంతర్గతంగా ఉన్న వర్గపోరు, అసంతృప్తి నేపథ్యంలో ఓటర్లు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడకుండా ఉండేందుకు వారిని, గోవా, బెంగుళూరు క్యాంప్‌లకు తరలించారు.
గోవాలో గోలగోల..
కొంత మంది ఎంపీటీసీలు, కౌన్సిలర్లను గోవా టూర్‌కు తీసుకెళ్లారు. గోవాకు వెళ్లిన వారు ఇప్పుడు అక్కడ చేస్తున్న ఎంజాయ్‌మెంట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కొత్తగూడెం కౌన్సిలర్లు బీచ్‌ల‌్లో సరదాగా ఫొటోలు దిగి షేర్ చేయడంతోపాటు పాలేరుకు చెందిన ప్రజాప్రతినిధులు చేసిన డ్యాన్స్‌లు లోకల్ గ్రూప్‌లలో షేర్ అయ్యాయి. ఇప్పుడు దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడం వదిలేసి శిక్షణా తరగతుల పేరుతో గోవాకు వెళ్లిన ప్రజాప్రతినిధులు ఇలా ఎంజాయ్ చేయడం ఏమిటంటూ ట్రోల్ చేస్తున్నారు ప్రత్యర్థులు.
బెంగుళూర్ వెళ్లిన వారికి ఒమిక్రాన్ భయం..
గోవాకు తీసుకెళ్లిన ప్రజాప్రతినిధులు ఎంజాయ్ చేస్తుండగా మరోవైపు బెంగుళూరుకు తీసుకెళ్లిన ప్రజాప్రతినిధుల పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్దంగా ఉంది. బెంగుళూరులో ఒమిక్రాన్ జాడలు కనిపించాయని సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుండటంతో వాటిని చూసిన ప్రజాప్రతినిధులు బెంబేలెత్తుతున్నట్లు సమాచారం. ఇంటి వద్ద లేకుండా బెంగళూరు రావడం ఏమిటని వారిలోవారు మదనపడుతున్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమా అని టీఆర్‌ఎస్ పార్టీ క్యాంప్ రాజకీయం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విమర్శలకు దారి తీస్తోంది.
Also Read: తరలిపోయిన ఉమ్మడి రాష్ట్ర దిగ్గజ నేత.. మాజీ సీఎం రోశయ్య కన్నుమూత !