Rosaiah Passes Away: తరలిపోయిన ఉమ్మడి రాష్ట్ర దిగ్గజ నేత.. మాజీ సీఎం రోశయ్య కన్నుమూత !
మాజీ సీఎం రోశయ్య కన్నుమూశారు. లోబీపీ కారణంగా అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించేలోపే మార్గ మధ్యంలో చనిపోయినట్లుగా డాక్టర్లు తేల్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రోశయ్య కన్నుమూశారు. ఉదయం లోబీపీ రావడంతో ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన తుది శ్వాస విడిచినట్లుగా గుర్తిచారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా ఆయన చాలా కాలంగా ఇంటికే పరిమితమయ్యారు. చాలా తక్కువ సందర్బాల్లో మాత్రమే బయటకు వస్తున్నారు. వృద్ధాప్యం కారణంగా వచ్చిన ఆరోగ్య పరమైన సమస్యలతో ఆయన ఇటీవల ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత రోశయ్యను హైకమాండ్ సీఎంగా ఎంపిక చేసింది. ఆ తర్వాత పార్టీలో ఏర్పడిన పరిణామాలతో తాను పదవిలో కొనసాగలేనని ఆయన వైదొలిగారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిసీఎం అయ్యారు. సీఎంగా పదవి నుంచి వైదొలిగిన తరవాత రోశయ్య తమిళనాడు గవర్నర్‌గా నియమితులయ్యారు. 2011 ఆగస్టు 31 నుంచి 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు. పదవి కాలం పూర్తయిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
Also Read : మాటల మాంత్రికుడు రోశయ్య .. ఆ పంచ్‌లకు ఎవరి దగ్గరా ఆన్సర్ ఉండదు !
కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించారు. రోశయ్య ఎన్.జి.రంగా శిష్యునిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. గుంటూరు హిందూ కళాశాలలో చదువుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు, 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు, 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేశారు. 1985లో తెనాలి నుంచి 2004లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
Also Read : పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి.. రోశయ్య మృతిపై కేసీఆర్, వైఎస్ జగన్ సంతాపం
2004, 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వములో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రోశయ్య ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను 15 సార్లు ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. 1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి ఓ సారి లోక్‌సభకు ఎన్నికయ్యారు.