Khammam Politics: సత్తుపల్లి కాంగ్రెస్‌లో డబుల్ గేమ్ - టికెట్ కోసం మాజీ మంత్రి సంబానీ, కోటూరి మధ్య పోటీ
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఆ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. టిక్కెట్ వేటలో ఇద్దరు నేతల మధ్య పెరిగిన పోటీ కాస్తా రోడ్డున పడటంతో కార్యకర్తలు గందరగోళంలో పడ్డారు.
గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఆ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే టిక్కెట్ వేటలో ఇద్దరు నేతల మధ్య పెరిగిన పోటీ కాస్తా రోడ్డున పడటంతో కార్యకర్తలు గందరగోళంలో పడ్డారు. మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్, టీపీసీసీ అధికార ప్రతినిధి కొటూరి మానవతారాయ్‌లు నియోజకవర్గంలో పైచేయి సాధించేందుకు పోటీ పడుతున్నారు.
సత్తుపల్లి నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఈ ప్రాంతం నుంచే ప్రాతినిథ్యం వహించడంతో ఆది నుంచి కాంగ్రెస్ పార్టీకి కీలకమైన స్థానం ఇది. టీడీపీ ఆవిర్భావం అనంతరం ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీల మధ్యే ఇక్కడ పోటీ ఉండేది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మూడు సార్లు ఈ ప్రాంతం నుంచే ప్రాతినిథ్యం వహించారు. అయితే జలగం వెంగళరావు తనయులు జలగం ప్రసాదరావు, జలగం వెంకటరావులు సత్తుపల్లి నుంచే పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి.
వైసీపీతో కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం..
సత్తుపల్లి.. ఏపీకి సరిహద్దు ప్రాంతం కావడంతో ఇక్కడ ఆంధ్రా పార్టీ, నేతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న ఈ ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ క్యాడర్ ఎక్కువ మంది ఆ పార్టీలోకి వెళ్లారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో వైసీపీకి చెందిన వారు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ విజయం సాధించింది. అయితే కాంగ్రెస్ పార్టీ తరుఫున ఇక్కడ మూడు సార్లు పోటీ చేసిన మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ ఓటమిపాలయ్యారు. అయితే సత్తుపల్లి కేంద్రంగానే తన రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు.
ఇదే నియోజకవర్గం కల్లూరుకు చెందిన టీపీసీసీ అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్ కూడా సత్తుపల్లిపైనే ఫోకస్ చేయడంతో ఇప్పుడు రెండు వర్గాలుగా కాంగ్రెస్ పోరు నడుస్తోంది. ఈ ఇద్దరు నేతలు రైతు రచ్చబండ కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై చేసిన నిరసన దీక్షల సందర్భంగా రెండు శిబిరాలను ఏర్పాటు చేసి పోటాపోటీగా దీక్షలు చేపడుతున్నారు. ఒకప్పుడు పార్టీకి బలమైన ప్రాంతంగా ఉన్న సత్తుపల్లిలో పునర్ వైభవాన్ని తెప్పించే క్రమంలో నాయకుల మధ్య వర్గపోరు పెరగడం, ఈ విషయంపై రాష్ట్ర నాయకత్వం కూడా చొరవతీసుకోకపోవడంతో సత్తుపల్లిలో కాంగ్రెస్ పునర్‌వైభవానికి మార్గాలు కనిపించడం లేదు. భవిష్యత్‌లో నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గాలు ఏకతాటిపైకి వస్తేనే ఇది సాధ్యమయ్యే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: Congress Internal Fight : టీకాంగ్రెస్ లో చిచ్చురేపిన యశ్వంత్ సిన్హా పర్యటన, మళ్లీ రేవంత్ రెడ్డి వర్సెస్ జగ్గారెడ్డి