Minister Jagadish Reddy : మంత్రి జగదీశ్ రెడ్డి పీఏ ఇంట్లో ఐటీ సోదాలు!
Minister Jagadish Reddy : తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి పీఏ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.
Minister Jagadish Reddy : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ దగ్గర పడేకొద్ది లక్షల్లో నగదు పట్టుబడుతోంది. ప్రధాన పార్టీల కీలక నేతల అనుచరుల వద్ద లక్షల్లో నగదు దొరుకుతోంది. సోమవారం రాత్రి తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. నల్లగొండలోని ప్రభాకర్ రెడ్డి ఇంటికి చేరుకున్న ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ తనిఖీలను ఐటీ అధికారులు అధికారంగా వెల్లడించలేదు. పట్టుబడిన నగదు ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది.
ఈసీ ఆంక్షలు
మునుగోడు ఉపఎన్నిక బాధ్యతను టీఆర్ఎస్ అధిష్ఠానం మంత్రి జగదీశ్ రెడ్డికి అప్పగించింది. ఉపఎన్నికలో విజయం సాధించేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి జోరుగా ప్రచారం చేశారు. అయితే ఈ ప్రచారంలో జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్ అయింది. రెండు రోజుల క్రితం ఎన్నికల నిబంధనలు అతిక్రమించారంటూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నోటీసులు ఇచ్చింది. మీడియాతో మాట్లాడవద్దని ఆంక్షలు విధించింది. ఈ విషయాన్ని మరువక ముందే మంత్రి పీఏ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేయడం గమనార్హం.
మంత్రి జగదీశ్ రెడ్డి ఏమన్నారంటే?
బీజేపీ మునుగోడులో భారీగా నగదు పంపిణీకి కుట్ర చేస్తుందని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. బ్యాంకులకు నగదు సరఫరా చేసే వాహనాలలో, అంబులెన్స్ ల ద్వారా డబ్బులు తరలిస్తున్న సమాచారం క్షేత్రస్థాయి నుంచి వస్తుందన్నారు. ఇప్పటికే ఈటెల రాజేందర్ వ్యక్తిగత సహాయ సిబ్బంది దాదాపు 90 లక్షల రూపాయల నగదుతో దొరికారన్నారు. ఈ అంశంలో చర్యలు తీసుకోవాలని అధికారులకు టీఆర్ఎస్ పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
భారీగా నగదు పట్టివేత
మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీగా హవాలా మనీ పట్టుబడుతోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచార జోరుతో హోరెత్తిస్తున్నాయి. మునుగోడు పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొందరు నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు పంచుతున్నట్లు సమాచారం. అందుకే మునుగోడు నియోజకవర్గానికి రాష్ట్రం నలుమూలల నుంచి నగదు సరఫరా అవుతోంది. దాన్ని అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున వాహన తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా చోట్ల భారీగా నగదు పట్టుబడుతోంది.
ఈటెల రాజేందర్ పీఏ డ్రైవర్
హైదరాబాద్ నగరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడు నంబర్ - 71లో భారీగా నగదు పట్టుబడింది. TS 27 D 7777 నెంబర్ తార్ జీపులో వెళ్తున్న ఓ వ్యక్తి.. అక్రమంగా తరలిస్తున్న 89 లక్షల 92 వేల రూపాయలను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. నగదుతో పాటు సదరు వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం జూచ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. కారులో ఉన్న వ్యక్తిని కడారి శ్రీనివాస్‌గా పోలీసులు గుర్తించారు. ఆయన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పీఏ జనార్దన్‌కు డ్రైవర్‌గా గుర్తించారు. నగదును జూబ్లీహిల్స్‌లోని త్రిపుర కన్‌స్ట్రక్షన్ కంపెనీ నుంచి మునుగోడు తరలిస్తున్న క్రమంలో పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కారు, నగదును స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.