Karthika Deepam Serial Issue : కార్తీకదీపం సీరియల్ ఎఫెక్ట్, క్లైమాక్స్ చూస్తున్నప్పుడు విసిగించాడని కస్టమర్ వేలు కొరికిన వ్యాపారి!
Karthika Deepam Serial Issue : కార్తీకదీపం సీరియల్ కు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది వీరాభిమానులు ఉన్నారు. ఇటీవల ఆ సీరియల్ ముగిసింది. ఎండ్ ఎపిసోడ్ ప్రసారం అయిన రోజు ములుగు జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది.
Karthika Deepam Serial Issue : ములుగు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. సీరియల్ చూస్తున్నప్పుడు విసిగిస్తున్నాడని ఓ వ్యాపారి కస్టమర్ చేతి వేలు కొరికాడు. దీంతో వ్యాపారి, కస్టమర్ మధ్య వాగ్వాదం జరిగింది. టీవీ సీరియల్స్ మోజులో దాడి చేసి కేసుల పాలయ్యాడు దుకాణదారుడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపుర్ మండలం పాలంపేటలో జరిగింది.
అసలేం జరిగింది?
కార్తీకదీపం సీరియల్ ముగింపు ఎపిసోడ్ ఉత్కంఠంగా సాగుతున్న క్రమంలో ఇద్దరి వ్యక్తుల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. టీవీ సీరియల్ చూడనీయకుండా కస్టమర్ విసిగిస్తున్నాడంటూ తన దుకాణానికి వచ్చిన వ్యక్తి వేలిని కొరికి గాయపరిచాడు వ్యాపారి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం (రామప్ప) పోలీస్ స్టేషన్ పరిధిలో పాలంపేట గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఎస్ఐ తాజొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామానికి చెందిన గట్టు మొగిలి కిరాణా దుకాణం నడిపిస్తున్నాడు. అందులోనే అక్రమంగా మద్యాన్ని కూడా విక్రయిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన తాళ్లపల్లి వెంకటయ్య దుకాణానికి వచ్చి మద్యం కొనుగోలు చేశాడు. తాగిన అనంతరం మరికొంత మద్యం కావాలని అడిగాడు. డబ్బులు ఇవ్వాలని షాపు యజమాని మొగిలి అడగగా, తన వద్ద డబ్బులు లేవని, తర్వాత ఇస్తానని వెంకటయ్య చెప్పాడు. అయినప్పటికీ వెంకటయ్య వినకపోవడంతో మొగిలి ఆగ్రహంతో అతడి కుడిచేతి చూపుడు వేలిని కొరికాడు. ఈ విషయమై మరుసటి రోజు తాళ్లపెల్లి వెంకటయ్య పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీస్ సిబ్బంది దుకాణ యజమాని మొగిలిని విచారించగా తాను ఆ సమయంలో కార్తీకదీపం సీరియల్ చూస్తున్నానని, డబ్బులు ఇవ్వకపోవడమేకాకుండా పదేపదే విసిగించడంతో తాను విసుగుచెంది అలా ప్రవర్తించాల్సి వచ్చిందని వ్యాపారి తెలిపారు. బాధితుడు వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదుతో మొగిలిపై ఐపీసీ 290, 324 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.
అద్దె ఇంటి కోసం వచ్చి చైన్ స్నాచింగ్
అద్దె ఇంటి కోసం తిరుగుతున్నట్లు నటించిన యువకుడు చైన్ చోరీ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని నిజాంపేటలో జరిగింది. అద్దె ఇంటి కోసం వెతుకున్నట్లుగా వచ్చి చైన్ స్నాచింగ్ చేసిన ఘటన నిజాంపేట్ లో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసుల సీసీ ఫుటేజీ సేకరించారు. నిందితుడ్ని త్వరలోనే అరెస్ట్ చేశామన్నారు. అయితే ఒంటరి మహిళలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా అనుమానంగా తిరుగుతుంటే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బాచుపల్లి పియస్ పరిధి నిజాంపేట్ లో శ్రీనివాస్ కాలనీకి చెందిన స్వర్ణలత(62) స్థానికంగా గుడికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఓ వ్యక్తి ఆమెకు ఎదురుపడి అద్దె ఇంటి విషయమై చర్చించాడు. దాంతో ఆ మహిళ ఇల్లు అద్దెకు లేదని చెప్పినా వినకుండా ఆమెను ఫాలో అవుతూ ఇంటివరకు వచ్చాడు నిందితుడు. ఆ పెద్దావిడ తాను నివాసం ఉంటున్న బాలాజీ రెసిడెన్సీలోని లిఫ్ట్ లోపలికి రాగానే వెంటనే నిందితుడు లిఫ్ట్ గ్రిల్ ఓపెన్ చేసి ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. బాధితురాలు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీలను పరిశీలిస్తున్నారు.
పోలీసులు ఏమన్నారంటే
స్వర్ణలత అనే 62 ఏళ్ల మహిళ సాయిబాబా గుడికి వెళ్లారు. పూజలు పూర్తయిన తరువాత ఇంటికి వెళ్తుంటే, గుడిలో పరిచయం చేసుకున్న నిందితుడు ఆమెను అద్దె ఇల్లు గురించి వాకబు చేశాడు. తమ అపార్ట్ మెంట్లో అద్దె ఇల్లు లేదని చెప్పినా అతడు వినిపించుకోలేదు. ఆమెను ఫాలో అవుతూ ఇంటికి వెళ్లాడు. ఆమె లిఫ్ట్ ఎక్కిన తరువాత నిందితుడు గ్రిల్స్ ఓపెన్ చేసి మహిళ మెడలోని బంగారు చైన్ ను బలవంతంగా లాక్కెళ్లాడని పోలీసులు తెలిపారు. రెండు మూడు ఇళ్లల్లోకి వెళ్లి, అనంతరం అక్కడి నుంచి నిందితుడు పరారయ్యారని పోలీసులు వెల్లడించారు. గుడికి వస్తే భక్తుడు అనుకున్నానని బాధితురాలు స్వర్ణలత తెలిపారు. తన స్నేహితురాలు వెళ్లిపోగా, తాను ఇంటికి వెళ్తుండగా అద్దె ఇల్లు ఉంటే చెప్పాలని తనను నిందితుడు అడిగినట్లు చెప్పారు. ఖాళీ ఇల్లులు లేవని చెప్పినా అతడు వినలేదని, తనను ఫాలో అయ్యాడని చెప్పారు. తీరా అపార్ట్ మెంట్ కు చేరుకున్నాక లిఫ్ట్ ఎక్కి ఒక్క డోర్ క్లోజ్ చేశాక, నిందితుడు డోర్ ఓపెన్ చేసి తన మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు చైన్ లాక్కెళ్లాడని చెప్పి ఆమె వాపోయారు.