Medigadda News: మేడిగడ్డపై నిపుణుల సూచనల మేరకే చర్యలు, ప్రజలను మోసం చేయలేం: మంత్రి శ్రీధర్ బాబు
Telangana Congress: మేడిగడ్డ ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను మంత్రి శ్రీధర్ బాబు తిప్పికొట్టారు. ప్రాజెక్ట్ పిల్లర్లు దెబ్బతినడం కేటీఆర్ కు చిన్న విషయంలా కనిపిస్తోందా అని ప్రశ్నించారు.
Sridhar Babu: సలహాదారులు, పక్కనున్న వాళ్లు చెప్పినట్లు కట్టే కాళేశ్వరం(Kaleswaram) ప్రాజెక్ట్ నట్టేట ముంచారని... ఇంజినీర్ల మాటలు వినకుండా తనకన్నా పెద్ద ఇంజినీరు లేడంటూ కేసీఆర్ (KCR) ఎవ్వరినీ లెక్కచేయకపోవడం వల్లే మేడిగడ్డ(Medigadda) ప్రాజెక్ట్ కుంగిపోయిందని మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు మళ్లీ అదే పంథా వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హడావుడిగా మళ్లీ మమా అనిపించి నీరు నిలిపితే.. ఈసారి మొత్తం ప్రాజెక్ట్ కొట్టుకుపోతుందన్నారు.
భ్రమల్లో నుంచి బయటకు రావాలి..
మేడిగడ్డ ప్రాజెక్ట్ దెబ్బతిన్నట్లు తెలంగాణ(Telangana) సమాజం మొత్తం కళ్లారా చూస్తున్నా... బీఆర్ఎస్(BRS) నేతలు ఇంకా అదే బుకాయింపు ధోరణి వీడటం లేదని మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu)ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన పిల్లర్లు దెబ్బతిని...ప్రాజెక్ట్ కుంగిపోయినా అదేం పెద్ద విషయం కాదన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్ట్ లో నీరు నిలపడం సేప్టీ కాదని మేం చెప్పడం లేదన్న ఆయన..ఈ విషయం జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులే నిర్థరించారన్నారు. కానీ ఇంకా ప్రజలను మోసం చేద్దామన్న పద్ధతిలోనే బీఆర్ఎస్ నేతలు వెళ్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం తన మానస పుత్రిక..నేనే బొడ్డుకోసి పేరు పెట్టానని చెప్పుకునే కేసీఆర్....ఈ అవినీతి అక్రమాలకు బాధ్యత వహించరా అని శ్రీధర్ బాబు నిలదీశారు. తప్పు చేసిన కేసీఆర్ ప్రజలకు చెప్పాల్సింది పోయి ఇంకా తండ్రీ, కొడుకులు దబాయిస్తున్నారని శ్రీధర్ బాబు మండిపడ్డారు.
నిపుణుల సూచన మేరకే ముందుకు
ఎన్నికల కోసం ఎవరో ఏదో చెబుతుంటారని అలాంటి మాటలు మేం పట్టించుకోమని శ్రీధర్ బాబు అన్నారు. ఇప్పటికే లక్ష కోట్లు పెట్టిన ప్రాజెక్ట నుంచి చుక్క నీరు ఇవ్వలేకపోయమని...ఇప్పుడు హడావుడిగా పైపై మెరుగులు అద్ది డ్యాంలో నీరు నిలిపితే....వరదలకు పూర్తిగా కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ఇప్పటికి జరిగిన నష్టం చాలని..నిపుణుల సూచన ప్రకారమే ముందుకు వెళ్తామన్నారు. కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చి మూడు నెలలు పూర్తి కాకముందే.. ఆరు గ్యారంటీల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, సబ్సిడీ గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్‌ను అమల్లోకి తీసుకొచ్చామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. హామీల అమలు భారాస నేతలకు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.
పెద్దపల్లి జిల్లా మంథనిలో ‘గృహ జ్యోతి’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ చెప్పినట్లు వందరోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేసి చూపడంతో...తండ్రీ, కొడుకులు తమ మనుగడ కష్టమేనని తెలిసి మేడగడ్డ పర్యటన పేరిట కొత్త నాటకానికి తెరలేపారన్నారు. ప్రాజెక్ట్ కుంగినప్పుడు...ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కానీ మంత్రి కేటీఆర్(KTR) గానీ ఎందుకు ప్రాజెక్ట్ సందర్శించలేదని నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లాపడిన బీఆర్ఎస్...కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పరువు నిలుపుకునేందుకు రోజుకొక నాటకాలు ఆడుతోందన్నారు. కానీ కేసీఆర్ మాటలు నమ్మేస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని చెప్పారు. పదేళ్లపాటు అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసిందని శ్రీధర్ బాబు అన్నారు. లక్షకోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వరం నుంచి తెలంగాణ ఏం లాభపడిందో కేసీఆర్ చెప్పాలన్నారు. కేవలం వాళ్ల కుటుంబం తప్ప... ప్రాజెక్ట్ వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.