Minister Seethakka: 'స్మగ్లర్ హీరో అంటే అదేం సినిమా?' - పుష్ప 2 సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
Telangana News: పుష్ప వంటి సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయని మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. మానవతా దృక్పథమున్న సినిమాలు రావాలని.. కేంద్రం అలాంటి సినిమాలకు ప్రోత్సాహం అందించాలన్నారు.
Minister Seethakka Sensational Comments: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఎం నుంచి మంత్రుల వరకూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, మంత్రి సీతక్క (Minister Seethakka) సైతం జాతీయ అవార్డ్స్, పుష్ప 2 సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హక్కులపై ప్రేరణ కల్పించిన జై భీమ్ వంటి సినిమాలకు జాతీయ అవార్డులు రాలేదు కానీ.. స్మగ్లర్ల పాత్రలో చట్టబద్ధంగా ఉన్న పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా స్మగ్లింగ్‌కు పాల్పడే సినిమాలకు కేంద్రం అవార్డ్స్ ఇస్తుందని ఎద్దేవా చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కోసమే కానీ.. పోలీసులు, ప్రజలకు అవగాహన కల్పించే లాయర్లు జీరో ఎలా అవుతారనేది ప్రజలు గమనించాలన్నారు.
'స్మగ్లర్ హీరోనా.?'
'స్మగ్లర్ హీరో అంటే అదేం సినిమా.?, స్మగ్లింగ్ కట్టడి చేసే పోలీస్ విలన్ ఎలా అవుతాడు.?. సందేశాత్మక సినిమాలు తీస్తే ప్రజలు స్వాగతిస్తారు. 2 మర్డర్లు చేసిన నేరస్థుడు మహారాష్ట్రలో పుష్ప 2 సినిమా చూస్తూ దొరికాడు. ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తి పెంచేలా ఉన్నాయి. హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు సమాజాన్ని ఉన్నతంగా చూపించే విధంగా ప్రయత్నం చేయాలి. సమాజాన్ని సన్మార్గంలో నడిపించే విధంగా సినిమాలు వస్తే ప్రజలు, సమాజ గౌరవాన్ని కాపాడిన వారవుతారు. మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాలి. కేంద్ర ప్రభుత్వం అలాంటి సినిమాలకు ప్రోత్సాహం అందించాలి.' అని సీతక్క తెలిపారు.
'రాజకీయాలు ఆపాలి'
మరోవైపు, సంధ్య థియేటర్ ఘటనపై రాజకీయాలు ఆపాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతలు దాడి చేయడం సరికాదని.. అలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సినీ పరిశ్రమను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. అటు, తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని.. కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. కాగా, ఆదివారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఇంటి గోడలు ఎక్కి రాళ్లు రువ్వారు. ఆవరణలోని పువ్వుల కుండీలు ధ్వంసం చేశారు. పోలీసులు ఆరుగురు జేఏసీ నేతలను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రూ.10 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. అటు, ఈ ఘటనను సీఎం రేవంత్ రెడ్డి సైతం ఖండించారు.
బన్నీకి మరోసారి నోటీసులు
అటు, బన్నీకి మరోసారి చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులు సోమవారం సాయంత్రం ఆయనకు చేరాయి. ఈ నెల 4న సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసులో ఆయనను ప్రశ్నించనున్నారు. ఈ ఘటనకు సంబంధించి 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా.. అల్లు అర్జున్ 11వ నిందితుడిగా ఉన్నారు. ఈ నెల 13న బన్నీని అరెస్ట్ చేయగా.. హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే తొక్కిసలాట ఘటనపై మరింత లోతుగా విచారించేందుకు ఆయనకు పోలీసులు మళ్లీ నోటీసులు జారీ చేశారు.
Also Read: Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !