Minister Sabitha Indra Reddy: తెలంగాణలో ఆ స్టూడెంట్స్‌కి వచ్చే 24 నుంచి ఫ్రీ టిఫిన్ - మంత్రి సబిత సమీక్ష
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు విద్యార్థులకు ఉదయం పూట ఆహారం అందించేందుకు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రారంభిస్తోంది.
![Minister Sabitha Indra Reddy: తెలంగాణలో ఆ స్టూడెంట్స్‌కి వచ్చే 24 నుంచి ఫ్రీ టిఫిన్ - మంత్రి సబిత సమీక్ష Minister Sabitha Indra Reddy Review On Chief Minister Breakfast Scheme Minister Sabitha Indra Reddy: తెలంగాణలో ఆ స్టూడెంట్స్‌కి వచ్చే 24 నుంచి ఫ్రీ టిఫిన్ - మంత్రి సబిత సమీక్ష](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/26/27d1ce0a238a58d7cdefb1b383f33fc51695732976600798_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Minister Sabitha Indra Reddy: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం అందించేందుకు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ (Chief Minister Breakfast Scheme) ప్రారంభిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పథకం ఏర్పాట్లపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సచివాలయంలోని కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పథకం అమలు చేయడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరుకు చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు దసరా పండుగ నుంచి ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ కింద అల్పాహారం అందించనున్నట్లు చెప్పారు. మెనూ త్వరితగతిన నిర్ణయించాలని, అందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువుపట్ల ఏకాగ్రతను పెంచే దిశగా ప్రభుత్వం పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోందన్నారు. పథకం అమలులో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. పథకం అమలును పర్యవేక్షించే బాధ్యతను జిల్లా స్థాయిలో కలెక్టర్‌కు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. నాణ్యమైన విద్యతో పాటు మంచి పోషకాహారం అందించే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం విజయవంతం అయ్యేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. దేశంలో పాఠశాలల్లోనే అల్పాహారం అందిస్తున్న రెండోరాష్ట్రంగా తెలంగాణ నిలిచిపోతుందన్నారు.
ఈ పథకం ద్వారా 27,147 పాఠశాలల్లోని దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి సబిత పేర్కొన్నారు. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యాన్ని, విద్యార్థులకు గుడ్లు పంపిణీ చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై అధిక భారం పడుతున్నా తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని మంత్రి వివరించారు. సమావేశంలో సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య సంచాలకులు దేవసేన, విద్యాశాఖ అధికారులు, అక్షయపాత్ర ప్రతినిధులు పాల్గొన్నారు.
అక్టోబర్ 24 నుంచి అమలు
విద్యార్థులకు దసరా కానుకగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సంపూర్ణ అల్పాహారాన్ని అందించాలని ఇటీవలే నిర్ణయించారు. రాష్ట్రం వ్యాప్తంగా కార్యక్రమం అక్టోబర్ 24 నుంచి అమలు చేయనున్నారు. దీని కింద ప్రభుత్వ పాఠశాల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు. ఇందుకోసం ప్రతీ సంవత్సరం 400 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. ఈ పథకం అమలు సాధ్య సాధనలకై రాష్ట్ర ఉన్నతాధికారులు తమిళనాడులో పర్యటించారు. అక్కడ అమలు అవుతున్న అల్పాహార పథకం విధివిధానాలను పరిశీలించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదికను సమర్పించారు. తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల్లోనే ఈ పథకం అమలు చేస్తుండగా తెలంగాణ ప్రభుత్వం 1 నుంచి 10వ తరగతి వరకు ఒకేసారి అమలు చేయాలని నిర్ణయించింది.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ స్కూల్స్, మోడల్ స్కూల్స్‌లోని మొత్తం 23,05,801 మంది విద్యార్థులకు ‘ముఖ్యమంత్రి అల్పాహారం’ పథకం అమలు చేయనున్నారు. జిల్లాలో చాలామంది పేద పిల్లలు గ్రామీణ ప్రాంతాల నుంచి ఉదయం ఖాళీ కడుపుతో బడులకు వస్తున్నారు. నీరసం, రక్తహీనత, పోషకాహార లోపం సమస్యలు విద్యార్థులను బాధిస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం గుర్తించి ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ‘ముఖ్యమంత్రి అల్పాహారం’ పథకంపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)