Puvvada Ajay Kumar: ఆ ఎమ్మెల్యే బుల్లెట్‌లా ఉన్నాడు, పదికి పది సీట్లు మావే - మంత్రి పువ్వాడ
Puvvada Ajay Kumar: ‘పినపాక ఎమ్మెల్యే బుల్లెట్ మాదిరి ఉన్నాడు. పని చేసే ఎమ్మెల్యే దొరకడం పినపాక నియోజకవర్గం అదృష్టం’ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
Puvvada Ajay Kumar: ‘పినపాక ఎమ్మెల్యే బుల్లెట్ మాదిరి ఉన్నాడు. పని చేసే ఎమ్మెల్యే దొరకడం పినపాక నియోజకవర్గం అదృష్టం’ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శనివారం బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో మణుగూరులోని కిన్నెర కల్యాణ మండపంలో మంత్రి పువ్వాడ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘పినపాక ఎమ్మెల్యే ఎమ్మెల్యే రేగ కాంతారావు బుల్లెట్ మాదిరి ఉన్నాడు. పని చేసే ఎమ్మెల్యే దొరకడం పినపాక నియోజకవర్గ అదృష్టం. నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు.. సెక్రటేరియట్ లో చూస్తూనే ఉంటానను. తన సమయం మొత్తం కేవలం నియోజకవర్గ అభివృద్ది కోసం పని చేస్తాడు’ అని అన్నారు.
సీఎం కేటాయించిన నిధులను ఎమ్మెల్యే కాంతారావు నియోజకవర్గంలో సరైన మార్గంలో ఖర్చు పెడుతూ అభివృద్ధికి బాటలు వేస్తున్నారని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన SDF నిధుల నుంచి
నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం కోసం రూ.5 కోట్లు వెచ్చించడం మంచి విషయమన్నారు. పౌర సేవల కోసం, మణుగూరు అభివృద్ది కోసం రూ.25 కోట్లు కేటాయించడం వారికే సాధ్యమైందన్నారు. తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్‌తో సాధ్యమన్నారు.
గుండెల మీద చేయి వేసుకుని చెప్తాం
దండాలు పెట్టుకుంటూ, తల నిమురుకుంటూ, మెడ వంకర పెట్టి కౌగిలించుకుంటే అభివృద్ధి జరుగుతుందా అని ప్రశ్నించారు. నిధుల వేట కోసం రేగ కాంతారావు నిత్యం తిరుగుతున్నారని, అలాంటి మంచి ఎమ్మెల్యే ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టం అన్నారు. ఇలాంటి వాళ్లనే మరోసారి గెలిపించుకోవాలని అన్నారు. BRS ప్రభుత్వాన్ని మరోసారి ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. కరోనా సమయంలో ప్రతి పక్షాలు ఏం చేశాయని ప్రశ్నించారు. తాము గుండెల మీద చెయ్యి వేసుకొని పనిచేశామని చెప్తామన్నారు.
ప్రతిపక్షాలు ఎక్కడ నిద్రపోయాయి
కష్టకాలంలో BRS ప్రభుత్వం ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుందని, BRS కార్యకర్తలు ప్రాణాలకు తెగించి సేవ చేశారని అన్నారు. గోదావరి వరదలు వచ్చినప్పుడు ప్రజల ప్రాణాలు పోకుండా కంటికిరెప్పలా కాపాడుకున్నామని, గోదావరి అటువైపు తాను, ఇటు వైపు రేగ కాంతారావు వరదల్లో పని చేశామన్నారు. ప్రతిపక్షాలు ఆ సమయంలో ఎక్కడ నిద్రపోయారో చెప్పాలని నిలదీశారు. ప్రజలను ఏమాత్రం పట్టించుకోని వారిని మనం గెలిపించుకోవాలా అంటూ అడిగారు. పని చేసే వారినే ప్రజలు గెలిపించుకోవాలన్నారు.
16 వేల మంది పోడు భూముల పట్టాలు
గత ప్రభుత్వాలు చేయలేని విధంగా భద్రాద్రి జిల్లాలో 16 వేల మంది గిరిజన రైతులకు పోడు భూముల పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. చుట్టపు చూపుగా వచ్చి మాయమాటలు చెప్పే వారిని నమ్మవద్దని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా రైతాంగం కోసం, ప్రజల కోసం రూ.13వేల కోట్ల రూపాయలతో సీతారామ ప్రాజెక్ట్ ను తీసుకొచ్చారని, లక్షల ఎకరాలకు సాగునీరు, త్రాగునీరు అందించేందుకు పని చేస్తున్నట్లు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5సీట్లు, ఖమ్మం జిల్లాలోని 5 సీట్లు గెలిపించుకుని సీఎం కేసీఆర్ కానుకగా ఇవ్వాలని మంత్రి పిలుపునిచ్చారు.
మూడోసారీ కేసీఆరే సీఎం
మూడోసారీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అందాయని అన్నారు. అవే బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి పువ్వాడను శాలువాతో సత్కరించారు. అలాగే, మంత్రి సమక్షంలో పీవీకాలనీ మాజీ ఎంపీటీసీ కొమరం పాపారావు బీఆర్‌ఎస్‌లో చేరారు. తొలుత నవీన్‌బాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో రేగా ముందు భాగాన బైక్‌పై, మంత్రి పువ్వాడ కారులో ర్యాలీ వెనుక ఉన్నారు.