Minister Jagadish Reddy: రాష్ట్రంలో అత్యధికంగా రూ.1200 కోట్లు నల్గొండ జిల్లాకే ఇచ్చాం- మంత్రి జగదీశ్ రెడ్డి
Minister Jagadish Reddy: రాష్ట్రంలో జిల్లాల అభివృద్ధి కోసం నల్గొండ జిల్లాకే ఎక్కువ డబ్బులు ఇచ్చినట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 1200 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు.
Minister Jagadish Reddy: రాష్ట్రంలో అత్యధికంగా రూ.1200 కోట్లు నల్గొండ జిల్లాకే ఇచ్చామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. మిషన్ భగీరథ కోసం కూడా రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ జిల్లాకు దాదాపు 6వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. సీఎం కేసీఆర్ దూర దృష్టి వల్ల వచ్చిన పల్లె ప్రగతి ట్రాక్టర్ల వల్ల గ్రామ పంచాయతీల ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. కొంతమంది కావాలనే కిస్తిలకు కూడా డబ్బులు అడుగుతున్నారని తెలిపారు. రైతు కళ్ళాలు , రైతు వేదికలు కట్టొద్దు అని కేంద్రం చెబుతుందని.. ఉపాధి హామీ పథకం కింద అత్యంత నాణ్యమైన పనులు చేసింది మన రాష్ట్ర ప్రభుత్వమే అని ఆయన చెప్పారు. మనకు కేంద్రం నుంచి 703 కోట్లు రావాల్సి ఉండగా 150 కోట్లు రైతు కళ్ళాలకు ఖర్చు చేశామని.. మిగతా నిధులు ఆపారని వెల్లడించారు. ప్రతి గ్రామానికి రోడ్ల వసతి ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. అన్ని ప్రాంతాలకు రోడ్లు ఇస్తామని మంత్రి జగదీష్ రెడ్డి వివరించారు.
మునుగోడులో జరుగుతున్న ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి మరియు సంక్షేమ సమీక్షా సమావేశం ఫోటోలు. pic.twitter.com/X755eqTA2h
— Jagadish Reddy G (@jagadishTRS) December 1, 2022
ఒక్కో నియోజక వర్గానికి 20 కోట్లు రూపాయలు..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర పురపాలక మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ల సమక్షంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ది మరియు సంక్షేమ సమీక్షా సమావేశం కొనసాగుతోంది. గతంలో జరిగిన పనులు, భవిష్యత్ లో చేయాల్సిన పనుల గురించి ఈ సమీక్షా సమావేశంలో చర్చించుకున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఒక్కో నియోజక వర్గానికి 20 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. 83 కోట్లు పీఆర్ రోడ్ల నిర్వహణ కింద ఖర్చు చేశామని తెలిపారు. 103 కోట్లు సీసీ రోడ్లకు ఖర్చు చేశామన్నారు. మిషన్ భగీరథ కు అత్యధిక నిధులు ఇచ్చి... ఇక్కడ ఫ్లోరైడ్ సమస్ లేకుండా చేశామని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లోనే ఇది చెప్పిందని గుర్తు చేశారు.
గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల వల్ల పెరిగిన ఆదాయం..
గతంలో కూడా జిల్లా, నియోజక వర్గం స్థాయిలో సమీక్షవు నిర్వహించి నిధులు ఇచ్చామని ఆయన వివరించారు. గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ట్రాక్టర్ మీద ఒక్కో గ్రామంలో 20 నుంచి 25 లక్షలు సర్పంచ్ లు సంపాదిస్తున్నారన్నారు. ట్రాక్టర్ల వల్ల గ్రామ పంచాయతీ ఆదాయం బాగా పెరిగిందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అన్ని అభివృద్ధి పనులు చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. మిషన్ కాకతీయలో మనం పూడికలు తీసుకున్నాం కాబట్టే ఉపాధి హామీ పథకంలో చెరువు పూడికలను బాగా తగ్గించగలిగామన్నారు. 20 శాతం కూడా చేయడం లేదన్నారు. ఆంధ్రలో 70 శాతం పూడికలు తీస్తూనే ఉన్నారని... కానీ అక్కడ తప్పు పట్టకుండా, 900 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారని చెప్పారు. మన దగ్గర మాత్రం డబ్బులు ఆపుతున్నారని ఆయన వివరించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీత, జడ్పీ చైర్మన్ లు బండ నరేందర్ రెడ్డి, దీపికా యుగంధర్, సందీప్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎం.ఎల్.సి నర్సిరెడ్డి, శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, రవీంద్ర కుమార్ నాయక్, ఎన్.భాస్కర్ రావు, గాదరి కిషోర్ కుమార్, శానంపుడి సైది రెడ్డి, పైళ్ళ శేఖర్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ హనుమంత రావు, రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకులు సత్య నారాయణ, ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్ లు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.