TRS News: వాళ్లు చవటలు, దద్దమ్మలు.. సొల్లు పురాణం బంద్ చేయండి.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో గులాబీ నేతలు ఫైర్
శాసనసభ ఆవరణలోని టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
భువనగిరి పట్టణంలో జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్‌పై చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్‌లో గులాబీ పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు మంత్రి శాసనసభ ఆవరణలోని టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి నిధులు కూడా తెలంగాణకు ఇవ్వలేదని విమర్శించారు. కేంద్రానికి తెలంగాణ కట్టే పన్నుల్లో సగం కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకు మీరేం చేశారని ఎర్రబెల్లి కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. మీరేదో చేసినట్లు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రిగా ఉండి అబద్ధాలు మాట్లాడుతుంటే తామేం మాట్లాడాలని అన్నారు.
విభజన చట్టంలో భాగంగా పేర్కొన్న హామీలు ఏమయ్యాయని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఏడేళ్లవుతున్నా వాటికి అతీ గతీ లేదని అన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ హామీ ఏమైందని నిలదీశారు. విభజన చట్టంలో ఉన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వంటి హామీలు కూడా నెరవేర్చలేదని.. పైగా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి ఉన్నా ఒక్క జాతీయ ప్రాజెక్టు కూడా తేలేదని అసహనం వ్యక్తం చేశారు.
Also Read: Traffic Challan Telangana: పెండింగ్ చలానా ఉంటే పోలీసులు మన బండి సీజ్ చేయొచ్చా? హైకోర్టు క్లారిటీ
కేంద్ర మంత్రి అయినందుకు సంతోషించినం
కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయినందుకు సంతోషించినమని ఎర్రబెల్లి అన్నారు. తెలంగాణకు నిధులు తెస్తాడని అనుకున్నమని చెప్పారు. బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడినట్లే కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడని విమర్శించారు. మిషన్ భగీరథను కేంద్రం ఆదర్శంగా తీసుకుందని, నీతి ఆయోగ్ చెప్పినా భగీరథకు నిధులు ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. ఇక్కడి సంక్షేమ పథకాలను కేంద్రం ఆదర్శంగా తీసుకుంటుందని చెప్పారు.
బీజేపీ అంటే అమ్మకం అని.. టీఆర్ఎస్ అంటే నమ్మకం అని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. ‘‘ఈటల సెక్రటేరియట్ ఆఫీసును పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారు. ఆయనకు మెడికల్ కాలేజీ మా చలవే. ఇంకా ఈటల పనులు చాలా ఉన్నాయి. అన్నిటినీ బయట పెడతాం. ఈటల తెలంగాణ కోసం రక్తాన్ని ధార పోయలేదు. కేసీఆర్ వల్లే ఈటల గొప్పోడు అయ్యాడు. ఇక ఆయన పని అయిపోయింది. భారీ మెజారిటీ తేడాతో ఈటల ఓడిపోవడం ఖాయం. బీజేపీ తెలంగాణ ఎంపీలు చవటలు, దద్దమ్మలు. తెలంగాణకు వాళ్ళు ఇప్పటికైనా ఏం చేస్తారో చెప్పాలి. సొల్లు పురాణం బంద్ చేయుండి’’ అని బాల్క సుమన్ విమర్శించారు.
Also Read: Huzurabad News: హుజూరాబాద్‌లో ఏం నడుస్తుంది? ఇంఛార్జిలతో కేసీఆర్ రివ్యూ, కీలక సూచనలిచ్చిన సీఎం