Telangana: మెడికల్ కాలేజీలపై తెలంగాణ కీలక నిర్ణయం, కాంపిటీటివ్ అథారిటీ కోటా రాష్ట్ర విద్యార్థులకేనంటూ ఉత్తర్వులు జారీ
Telangana: వైద్య కళాశాలలో సీట్ల విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంపిటీటివ్ అథారిటీ కోటా సీట్లను తెలంగాణ విద్యార్థులకే కేటాయించింది.
Telangana News: వైద్య కళాశాలలో సీట్ల విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2014 జూన్ తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటీటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లను రాష్ట్ర విద్యార్థులకే కేటాయించాలన్న నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ మెడికల్, డెంటల్ కాలేజీలు అడ్మిషన్ నార్మ్స్- 2017 ను సవరించి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసి, నోటిఫికేషన్ ఇచ్చారు. ఆర్టికన్ 371-డి నిబంధనలకు లోబడి ప్రవేశ నిబంధనలను సవరించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం రిజ్వీ తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన 36 వైద్య కళాశాలల్లోని కాంపిటీటివ్ అథారిటీ సీట్లు 100 శాతం రాష్ట్ర విద్యార్థులకే కేటాయిస్తారని వెల్లడించారు. మెడికల్ కాలేజీల్లోని మొత్తం సీట్లలో 85 శాతం కాంపిటీటివ్ అథారిటీ కోటా కాగా, మిగతా 15 శాతం మాత్రం అన్ రిజర్వ్‌డ్ కోటా కిందకు వస్తాయి. పునర్విభజన చట్టం నేపథ్యంలో ఈ 85 శాతం కాంపిటీటివ్ అథారిటీ కోటా సీట్లలో 15 శాతం సీట్లకు తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులూ పోటీ పడుతున్నారు. తాజాగా రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయంతో.. 2014 జూన్ 2 తర్వాత రాష్ట్రంలో ఏర్పాటైన 36 మెడికల్ కాలేజీల్లోని 100 శాతం కాంపిటీటివ్ కోటా సీట్లు అన్నింటిని తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తారు.
తాజా నిర్ణయంతో 520 సీట్లు అదనం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 520 ఎంబీబీఎస్ సీట్లు లభించనున్నాయి. 2014 జూన్ ముందు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మొత్తం 20 మెడికల్ కాలేజీలు ఉండేవి. ఇందులో మొత్తం 2,850 ఎంబీబీఎస్ సీట్లు ఉండేవి. అందులో కాంపిటీటివ్ అథారిటీ కోటా కింద 1,895 సీట్లు ఉండగా.. అందులో 15 శాతం (280 సీట్లు)కు తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీపడేవారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత మెడికల్ కాలేజీల సంఖ్య 56కు పెరిగింది. అలాగే ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 8,440కు చేరుకుంది. పాత విధానం ప్రకారం ఈ మెడికల్ కాలేజీల్లోని కాంపిటీటివ్ అథారిటీ కోటా సీట్లలోని 15 శాతం సీట్లకు తెలంగాణ విద్యార్థులతో పాటు ఏపీ విద్యార్థులు పోటీ పడే వారు. దీని వల్ల తెలంగాణ విద్యార్థులు నష్టపోతున్నట్లు గుర్తించిన తెలంగాణ రాష్ట్ర సర్కారు.. ఉమ్మడి కోటాను పాత 20 మెడికల్ కాలేజీలకే పరిమితం చేస్తూ నిబంధనలు సవరించింది. దీంతో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పడిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటీటివ్ అథారిటీ కోటా సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. గతంలో 1300 సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కే అవకాశం ఉండగా, తాజా నిర్ణయంతో మరో 520 సీట్లు అదనంగా లభించినట్లయింది.
Also Read: Autism Woman: ప్రసవ సమయంలో ఆటిజం మహిళకు శునకం సాయం- ఆశ్చర్యపోయిన వైద్యులు
తెలంగాణ విద్యార్థుల కల సాకారమైంది: హరీశ్ రావు
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ విద్యార్థులు స్థానికంగా ఉంటూనే డాక్టర్ కల సాకారం చేసుకునే గొప్ప అవకాశం దక్కిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ విద్యార్థులకు మేలు జరుగుతుందని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ గణనీయమైన వృద్ధి సాధించిందని చెప్పారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial