Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన
Mancherial mla: మద్యం మానేసిన వాళ్లకే స్థానిక సంస్థల టికెట్లు ఇస్తామని మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు ప్రకటించారు.
Gandhi Jayanthi: గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే లీడర్లు ముందు మందు మానేయాల్సిందేనంటూ కార్యకర్తలకు హితవు పలికారు. మద్యపానం మానేసి వాళ్లకే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇప్పిస్తామంటూ చెప్పుకొచ్చారు.
మంచిర్యాలలోని దండెపల్లిలో గాంధీజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ వచ్చారు. ఆయన గాంధీజయంతి పూర్తి అయిన తర్వాత కార్యకర్తలను నిల్చోబెట్టి ఈ కామెంట్స్ చేశారు. అంతే కాకుండా వారందరితో మద్యం తాగడం లేదని చెబుతూ ప్రమాణం కూడా చేయించారు.
ఈ కార్యక్రమంలో కార్యకర్తలతో ఇలా ప్రమాణం చేయించారు"కాంగ్రెస్ కార్యకర్తలమైన మేం.. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మద్యం, ఇతర మాదక ద్రవ్యాలు తీసుకోబోమని నేను నమ్మిన దేవునిపై ప్రమాణం చేస్తున్నాం. గాంధీ జయంతి సందర్భంగా ఈ మేరకు నిర్ణయం తీసుకొని రాష్ట్రానికే కాదు దేశానికే ఆదర్శనంగా నిలబడతాం. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాకారం చేయడానికి మద్యానికి దూరంగా ఉంటాను. కుటుంబానికి, సమాజానికి ఆదర్శంగా జీవనం సాగిస్తామని పెద్దలు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావ్ ఆశయాలకు అనుగుణంగా నడుచుంటాం. ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములై నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఈ మద్యం మహమ్మారి నుంచి దూరం చేస్తామని ప్రమాణం చేస్తున్నాం. వర్గ విబేధాలు, కులమత తేడాలు, కక్షలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జీవనం సాగిస్తామని నేను నమ్మిన దేవుణిపై ప్రమాణం చేస్తున్నాను" అంటూ కార్యకర్తలతో ప్రమాణం చేయించారు.
తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు రానున్నాయి. పదేళ్లుగా ఈ పదవులకు దూరంగా ఉంటూ వచ్చిన కాంగ్రెస్ నేతలు ఈసారి భారీ సంఖ్యలో పోటీకి సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో కూడా తమ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఏం చేసైనా పోటీకి పడాల్సిందేనంటూ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో కూడా చాలా మంది పోటీకి రెడీ అవుతున్న టైంలో ప్రేమ్ సాగర్ రావు ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనంగా మారుతోంది.
Also Reads: డ్రగ్స్ అలవాటు చేసి హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు - కేటీఆర్‌పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు