Mallareddy Family Politics: మెల్లగా బీజేపీ వైపు చూస్తున్న మల్లారెడ్డి ఫ్యామిలీ - బండి సంజయ్‌కు ఫ్లెక్సీలు !
Mallareddy family: గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న మల్లారెడ్డి కుటుంబం బీజేపీ వైపు చూస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. బండి సంజయ్‌తో ఆ కుటుంబం పరిచయాలు పెంచుకుంటోంది.

Mallareddy family is looking towards the BJP: బండి సంజయ్ బోనాల వేడుకల కోసం పాతబస్తీ వస్తే.. అక్కడ బీజేపీ నేతలు మాత్రమే కాదు.. మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సోమవారం బండి సంజయ్‌కు విందు కూడా ఇచ్చారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి. కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్ కు .. బీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న కుటుంబానికి చెందిన ఔత్సాహిక రాజకీయ నేత ఫ్లెక్సీలు కట్టడం, విందులు ఇవ్వడం వ్యక్తిగతం అని అనుకోవడానికి లేదని అంటున్నారు.
రాజకీయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి
మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి రాజకీయాల్లోచురుగ్గా ఉంటున్నారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని కొన్ని సందర్భాల్లో ఆమె అన్న మాటలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ప్రీతిరెడ్డి నేరుగా రాజకీయాలు చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల మల్లారెడ్డితో పాటు మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. గతంలో ఉన్నంత దూకుడుగా లేరు. ఈ క్రమంలో ఆయన కుటుంబసభ్యులు పార్టీ మారే ఆలోచనల్లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఇటీవల జోరు తగ్గించిన మల్లారెడ్డి - బీఆర్ఎస్ లో స్లో
భారత రాష్ట్ర సమితిలో ప్రస్తుతం యాక్టివ్ గా ఉండటం కన్నా బీజేపీలో చేరితే ప్రయోజనం ఉంటుందని మల్లారెడ్డి అనుకుంటున్నారేమో తెలియదు కానీ.. ఆ పార్టీ నేతలతో పరిచయాలు పెంచుకునేందుకు మాత్రం ఆసక్తి చూపిస్తున్నారన్నది బహిరంగ రహస్యంగానే ఉంది. మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో మంచి పట్టు కూడా ఉంది. అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా బండి సంజయ్ కూడా వారిని పార్టీలోకి ఆహ్వానించేందుకు వెనుకాడరని అంటున్నారు.
గ్రేటర్ ఎన్నికల కోసమే వ్యూహమా ?
త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే.. భారత రాష్ట్ర సమితి ద్వారా సాధ్యం కాదని.. బీజేపీలో అయితే బెటరని మల్లారెడ్డి కుటుంబం ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రస్తుత తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు మల్కాజిగిరి చెందిన వారే. బండి సంజయ్ మద్దతు రామచంద్రరావుకు ఉందని భావిస్తున్నారు. తెలంగాణ బీజేపీలో ఇప్పుడు చక్రం తిప్పేది బండి సంజయ్ అనే ప్రచారం జరుగుతున్న తరుణంలో మల్లారెడ్డి కుటుంబం .. ఆయన ద్వారా బీజేపీలోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకుంటోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మల్లారెడ్డి చాలా ఒత్తిడికి గురయ్యారు. ఆయనపై చాలా కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని.. డీకే శివకుమార్ తో సమావేశమయ్యారని ప్రచారం జరిగింది. ఫోటోలు కూడా వెలుగులోకి వచ్యాయి. కానీ తర్వాత అన్నీ సద్దుమణిగాయి. రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఓ సారి ప్రకటన కూడా చేశారు.





















