(Source: ECI/ABP News/ABP Majha)
Bharat Jodo Yatra : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తాం- రాహుల్ గాంధీ
Bharat Jodo Yatra : గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబాల హక్తులపై రైతు స్వరాజ్య వేదిక పోరాడుతోంది. ఈ సంస్థ రాహుల్ గాంధీతో భేటీ అయి రైతుల సమస్యలపై చర్చించింది.
Bharat Jodo Yatra : తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 7 వరకు తెలంగాణలో రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల వ్యవసాయ కుటుంబాల హక్కులు, సంక్షేమం కోసం పని చేస్తున్న రైతు స్వరాజ్య వేదిక రాహుల్ గాంధీతో భేటీ అయింది. ఈ సమావేశంలో వ్యవసాయానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ లో రాహుల్ గాంధీకి రైతు స్వరాజ్య వేదిక వ్యవసాయ సంక్షోభంపై ఓ లేఖను అందించింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని రాహుల్ గాంధీ రైతులకు హామీ ఇచ్చారు. రైతు సంఘం నాయకులతో సమావేశమైన ఆయన దేశంలోని సమస్యలపై పోరాటానికి రైతులు మద్దతు ఇవ్వాలని కోరారు. కౌలు రైతుల సమస్యలు, పంటల బీమాపై రైతు సంఘంతో రాహుల్ చర్చించారు.
రైతు స్వరాజ్య వేదిక అందించిన లేఖలో ప్రధానాంశాలు
తెలంగాణ ఇప్పటికీ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. రాష్ట్రంలో 65 శాతం జనాభా ఇప్పటికీ గ్రామాలలో జీవిస్తూ ఉపాధిని పొందుతున్నారు. సగం గ్రామీణ జనాభాకు సెంటు భూమి కూడా లేదు. రాష్ట్రంలో సాగు భూమి జీవనోపాధి వనరుగా కాక, పూర్తిగా అమ్మకపు సరుకుగా మారిపోయింది. రింగు రోడ్లు, రీజనల్ రింగ్ రోడ్లు ఈ పరిణామాలను వేగవంతం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యవసాయ రంగ ముఖ చిత్రమే కళ తప్పింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకూ సమగ్ర వ్యవసాయ విధానమే లేదు. ప్రతి సీజన్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇష్ట మొచ్చినట్లుగా పంటల సాగు ప్రణాళికలు ప్రకటించి రైతులకు నష్టాలే మిగులుస్తుంది . పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాలు, కూరగాయ పంటల విస్తీర్ణం గణనీయంగా పడిపోయి, కేవలం వరి, పత్తి పంటల విస్తీర్ణం మాత్రమే పెరుగుతుంది. వ్యవసాయ కుటుంబాల జీవనోపాధి, సంక్షేమం కేంద్రంగా రాష్ట్ర సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించాలి. మన రాష్ట్ర మనుషుల, పశువుల ఆహార అవసరాలు, వ్యవసాయాధారిత పరిశ్రమల ముడి సరుకు అవసరాలు, నేలలు, వాతావరణానికి అనుగుణంగా రైతులతో చర్చించి, ఒప్పించి, ఆయా సీజన్లలో శాస్త్రీయ పంటల ప్రణాళిక అమలు చేయాలి.
పంటల సాగులో ఖర్చులు పెరిగిపోయి,రైతులకు నికరంగా మిగులుతున్న ఆదాయం చాలా తక్కువ. ఫలితంగా రైతు కుటుంబాల నికర ఆదాయాలు తగ్గిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నివేదికలే చెబుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఉద్యోగులకు పే కమిషన్ ఉన్నట్లుగా వ్యవసాయ కుటుంబాల కోసం ఆదాయ కమీషన్ ఏర్పాటు చేయాలి. ఈ కమిషన్ నిరంతరం క్షేత్ర స్థాయి పరిస్థితులను అధ్యయనం చేయడం, వ్యవసాయ రంగ నిపుణులతో, రైతు సంఘాలతో చర్చించడం ద్వారా ఎప్పటికప్పుడు సిఫారసులను ప్రభుత్వం ముందు ఉంచాలి. ఈ కమిషన్ సిఫారసులకు చట్టబద్ధత కల్పించాలి.
రాష్ట్రంలో భూ సంస్కరణలు అమలు చేయకపోవడం వల్ల, కౌలు రైతుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. దళితులకు , ఇతర గ్రామీణ పేదలకు సాగు భూమి హక్కుగా అందడం లేదు. వ్యవసాయంతో సంబంధం లేని వ్యవసాయేతరుల చేతుల్లోకి భూములు వెళ్లిపోతున్నాయి. రాష్ట్రంలో లక్షల ఎకరాల సాగు భూములు రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ గా, వేలాది ఎకరాలు వ్యవసాయేతర అవసరాలకు మళ్లిస్తున్నారు. రాష్ట్రంలో సమగ్ర భూసర్వే వేగంగా పూర్తిచేసి మిగులు భూములను తేల్చి, 1973లో కాంగ్రెస్ పార్టీ అమలులోకి తెచ్చిన భూ సంస్కరణల (గరిష్ట పరిమితి) చట్టం ప్రకారం భూమి లేని పేదలకు భూమి పంపిణీ కార్యక్రమాలను అమలు చేయాలి. 2013 లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ భూ గరిష్ట పరిమితికి సంబంధించి ముందుకు తెచ్చిన నూతన ప్రతిపాదనలను పరిగణనలో పెట్టుకోవాలి. భూమి వినియోగ విధానం రూపొందించి , వ్యవసాయ భూములు విచ్చలవిడిగా మళ్లించకుండా ఆంక్షలు విధించాలి .
భూ రెవెన్యూ పరిపాలనా రంగంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల భూమి పట్టా హక్కుదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కుంటున్నారు . క్షేత్ర స్థాయిలో ప్రతి సంవత్సరం సర్వే నంబర్ వారీగా వాస్తవ సాగు దారులను గుర్తించడం లేదు. ధరణి పోర్టల్ ను కొద్ది నెలలు అబయెన్స్ లే ఉంచి , తక్షణమే అన్ని సమస్యలను పరిష్కరించడానికి క్షేత్ర స్థాయిలో సమగ్ర భూ సర్వే ద్వారా , భూములను రీ సెటిల్ మెంట్ చేయాలి. గ్రామ స్థాయి రెవెన్యూ సదస్సులను నిర్వహించడం ద్వారా రైతుల భాగస్వామ్యంతో రెవెన్యూ రికార్డులను తాజాపరిచి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలి. భూ వివాదాల పరిష్కారానికి మండల స్థాయిలో శాశ్వత ట్రిబ్యూనల్స్ ఏర్పాటు చేయాలి. పాస్ పుస్తకాల చట్టం లో మార్పులు చేసి ప్రతి సంవత్సరం జమాబందీ చేసి వాస్తవ సాగుదారులను నమోదు చేయాలి.
రాష్ట్రంలో 30 శాతం కౌలు రైతులు ఉన్నారని ఇటీవల చేసిన మా క్షేత్ర స్థాయి అధ్యయనంలో తేలింది.రాష్ట్ర సాగు దారులలో కీలకంగా ఉన్న ఈ కౌలు రైతులను ప్రభుత్వం రైతులుగా గుర్తించడం లేదు. ఏ సహాయమూ కౌలు రైతులకు అందడం లేదు. రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటికే 8000 మంది వరకూ రైతు ఆత్మహత్యలు జరిగాయి. వీటిలో కేవలం 1600 రైతు ఆత్మహత్యలనే ప్రభుత్వం గుర్తించింది. నిజానికి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం జరుగుతున్న రైతు ఆత్మహత్యలలో 80 శాతం కౌలు రైతులవే. కౌలు రైతులపై ఉన్న నిర్లక్ష్య వైఖరి కారణంగా వీటిని గుర్తించడం కూడా మానేసింది. 2011 లో అప్పటి ప్రభుత్వం తెచ్చిన భూ అధీకృత సాగు దారుల చట్టం అమలు చేసి కౌలు రైతులకు ఋణ అర్హత గుర్తింపు (LEC) కార్డులు ఇవ్వాలి. కౌలు ధరలపై నియంత్రణ విధించాలి. రైతు బంధు,పంట రుణాలు, రైతు బీమా సహా కౌలు రైతులకు అన్ని రకాల సహాయ పథకాలూ అందించాలి.
దశాబ్ధాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీ రైతులకు పట్టాలు ఇవ్వడం లేదు. షెడ్యూల్డ్ ఏరియాలలో 1/70 చట్టాన్ని సరిగా అమలు చేయడం లేదు. ఆదివాసీలకు అటవీ హక్కులు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇష్ట మొచ్చినట్లుగా షెడ్యూల్డ్ ప్రాంతాలలో వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలో 2006 అటవీ హక్కుల చట్టం అమలు చేసి ఆదివాసీలకు వ్యక్తిగత, సాముదాయక పట్టా హక్కులు ఇవ్వాలి. 1/70 చట్టాన్ని సరిగా అమలు చేయాలి. అటవీ హక్కులు కల్పించే విషయంలో ‘పెసా” (PESA) రూల్స్ కు అనుగుణంగా గ్రామ సభలకు అధికారాలు ఇవ్వాలి. షెడ్యూల్ ప్రాంతాలకు బయట ఉండిపోయిన నల్లమల సహా ఇతర ఆదివాసీ ప్రాంతాలను, గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో చేర్చాలి.
వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామీణ మహిళలను రైతులుగా గుర్తించడం లేదు. సమాజంలో ఉన్న పురుషాధిపత్య భావజాలం దీని కొక ముఖ్య కారణమైతే ప్రభుత్వ నిర్లిప్త వైఖరి కూడా మరో కారణం. వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా రైతులను, ముఖ్యంగా ఒంటరి మహిళా రైతులను రైతులుగా గుర్తించి, వారి వ్యవసాయానికి సహాయం అందించాలి. కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా వ్యవసాయ రంగంలో జండర్ బడ్జెట్, మండల స్థాయిలో జండర్ కమిటీలను ఏర్పాటు చేసి అమలు చేయాలి. మహిళా రైతులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలి. రెవెన్యూ, వ్యవసాయ శాఖల సిబ్బందికి జండర్ సెన్సిటివిటీ కల్పించడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలి.
2018 నుండీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న "రైతు బంధు" పెట్టుబడి సహాయ పథకం (సంవత్సరానికి ఎకరానికి 10 వేల రూపాయలు) లక్షిత ప్రయోజనాన్ని సాధించడం లేదు. వాస్తవ సాగు దారులకు కాకుండా, కేవలం భూమి పై పట్టా హక్కు ప్రాతి పదికగా ఈ పథకం అమలు చేయడం వల్ల , సాగు చేయని రైతులకు, సాగు చేయని భూములకు కూడా డబ్బులు పంచుతూ వేల కోట్ల ప్రజా బడ్జెట్ ను దుర్వినియోగం చేస్తున్నారు. రైతు బంధు సహాయాన్ని వాస్తవ సాగు దారులకు, వాస్తవ సాగు భూములకు మాత్రమే అందించాలి . మాగాణి నేలలకు 5 ఎకరాలకు , మెట్ట భూములకు 7.5 ఎకరాలకు ఈ సహాయాన్ని పరిమితం చేయాలి.
రైతు బీమా పథకం కూడా కేవలం పట్టా హక్కులు కలిగిన రైతులకే వర్తింప చేయడం వల్ల పెద్దగా ఉపయోగ పడడం లేదు. బీమా వయో పరిమితిని 59 సంవత్సరాలకే కుదించడం వల్ల కూడా ఎక్కువ మందికి ఉపయోగపడడం లేదు. మొత్తం గ్రామీణ కుటుంబాలకు రైతు బీమా పథకాన్ని విస్తరించి, కుటుంబం యూనిట్ గా అమలు చేయాలి. వయో పరిమితిని కనీసం 75 సంవత్సరాలకు పెంచాలి.
2014 లోనూ , తిరిగి 2018 లోనూ ఇచ్చిన లక్ష రూపాయల లోపు పంట రుణాల మాఫీ హామీలు సరిగా అమలు చేయకపోవడం వల్ల, రైతులపై వడ్డీ భారం పడుతున్నది. కొత్తగా బ్యాంకుల నుండీ పంట రుణాలు అందడం లేదు . వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ రుణాలకు వడ్డీ రాయితీ బకాయిలను ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించడం లేదు. రైతు పెట్టుబడి అవసరాలకు అనుగుణంగా బ్యాంకులు పంట రుణాలే ఇవ్వడం లేదు. మొత్తం సంస్థాగత బ్యాంకింగ్ ఋణ వ్యవస్థే కూలిపోయింది. వాస్తవ సాగు దారులను గుర్తించకుండా చేసే ఋణ మాఫీ హామీలు వ్యవసాయ కుటుంబాల సంక్షోభాన్ని పరిష్కరించవు. ఒకే విడతలో ఋణ మాఫీ హామీని అమలు చేయాలి . వాస్తవ సాగు దారులకు మాత్రమే ఋణ మాఫీ చేయాలి. గత 4 ఏళ్లుగా చెల్లించాల్సిన వడ్డీ రాయితీ బకాయిలను వెంటనే చెల్లించాలి. కౌలు రైతులకు కూడా బ్యాంకులు పంట రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం కౌలు రైతుల పక్షాన కౌంటర్ గ్యారంటీ ఇవ్వాలి. రైతుల ఋణ విముక్తి కమీషన్ కు విశ్రాంత న్యాయమూర్తిని ఛైర్మన్ గా నియమించి, కమీషన్ స్వయం ప్రతి పత్తితో పని చేసేలా సహకరించాలి. ప్రైవేట్ రుణాలను బ్యాంకు రుణాలుగా మార్చేలా, ఆర్‌బిఐ ఇచ్చిన మార్గ దర్శకాలను అమలు చేసేలా అన్ని బ్యాంకులపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకు రావాలి.
రైతు స్వరాజ్య వేదిక డిమాండ్లు
1. రాష్ట్ర ప్రయోజనాలకు ,రాజ్యాంగ నియమాలకు భిన్నంగా కేంద్రం వ్యవహార శైలిని, విధానాలను మానుకోవాలి. వ్యవసాయ రంగం పై రాష్ట్రాల హక్కులను కాపాడాలి.
2. పర్యావరణ హితమైన వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి రాష్ట్ర స్థాయిలో బలోపేతం చేసే కార్యక్రమాలు చేపట్టడానికి అవసరమైన నిధులను కేంద్రం రాష్ట్రాలకు అందించాలి.
3. పీఎం కిసాన్ సాయాన్ని కేవలం భూమిపై పట్టాహక్కులు కలిగిన వారికి కాకుండా వాస్తవ సాగు దారులకు మాత్రమే అందించాలి. రైతులపై భారాన్ని మోపుతున్న వ్యవసాయరంగ ఉపకరణాలపై ,యంత్రాలపై జిఎస్‌టి ని రద్ధు చేయాలి. పంటల బీమా పథకాల బీమా ప్రీమియంలో 50 శాతం భరించాలి.
4. ఆయా రాష్ట్రాలు తమ ప్రత్యేక అవసరాలను బట్టి కనీస మద్ధతు ధరలకు అదనపు బోనస్ ఇచ్చుకునేలా అనుమతిస్తూ, కేంద్ర స్థాయిలో ప్రకటించే ఎంఎస్‌పి కి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ లో వెంటనే చట్టం చేయాలి. ప్రభుత్వ సేకరణలో ప్రైవేట్ సంస్థలకు అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
5. ప్రభుత్వ రంగంలో ఎఫ్‌సిఐ, నాఫెడ్, ఎరువుల పరిశ్రమలను కొనసాగించేలా విధానాలను ప్రకటించాలి. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థలను ప్రభుత్వ రంగం లో కొనసాగించేలా విద్యుత్ బిల్లులో సవరణలు చేయాలి.