Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం, ఏపీ, తెలంగాణలో వర్షాలు
Cyclone Remal: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. తుఫాన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు రాకముందే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గత పది రోజులుగా ఏపీ, తెలంగాణల్లో ఏదో ఒక చోట వానలు పడుతూనే ఉన్నాయి. గత మూడు నెలల నుంచి భానుడి భగ భగలతో అల్లాడుతున్న ప్రజలకు వర్షాలు కొంత ఉపశమనం ఇచ్చాయి. తాజాగా మరో సారి తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, శుక్రవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇది క్రమంగా బలపడి మే 25 నాటికి తుఫానుగా మారుతుందని, ఉత్తర దిశగా ప్రయాణిస్తూ మే 26 నాటికి తీవ్ర తుఫానుగా ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీకి తొలగిన ముప్పు
బంగాళాఖాతంలో వాయుగుండం కాస్తా తుఫాన్‌గా మారినా ఏపీకి వచ్చే ముప్పు ఏమీ లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తుఫాన్ రోజు తెలుగు రాష్ట్రాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, అలాగే మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అల్పపీడనం కారణంగా కోస్తా తీరంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలోని పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలతోపాటు కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవచ్చని అంచాన వేసింది. రాయలసీమ జిల్లాల్లో వాతావరణం చల్లగా ఉంటుందని తెలిపింది.
అనకాపల్లి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది. తుపాన్ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది. అలాగే వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలతో పాటు, తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రుతపవనాలు తీరాన్ని తాకకముందే బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తొలి తుఫాను ఇదే కావడం విశేషం.
రెమల్‌గా నామకరణం
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ పశ్చిమ్ బెంగాల్, బంగ్లాదేశ్ దిశగా ప్రయాణిస్తున్నట్లు ఐఎండీ తెలిపింది. ఈ తుఫానుకు ‘రెమల్’గా నామకరణం చేశారు. బెంగాల్, బంగ్లా మధ్య రెమల్ తుఫాను ఆదివారం సాయంత్రం తీరం దాటుతుందని, దీని ప్రభావంతో ఒడిశా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ శాస్త్రవేత్త మోనికా శర్మ చెప్పారు. తుఫాన్ ప్రభావం మే 27 ఉదయం వరకు దాదాపు 24 గంటల పాటు ఉంటుందని, మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
వేగంగా విస్తరిస్తున్న రుతుపవనాలు
తుఫాన్ కారణంగా 26, 27 తేదీల్లో, ఉత్తర ఒడిశా, పశ్చిమ్ బెంగాల్, త్రిపుర, మిజోరం, దక్షిణ మణిపూర్‌లోని కొన్ని తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. నైరుతి రుతు పవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలో వేగంగా విస్తరిస్తున్నట్లు ఐఎండీ తెలిపింది. అండమాన్, నికోబార్, కొమరిన్ దీవుల వరకూ రుతు పవనాలు విస్తరించాయని, మే 31 లోపు కేరళ తీరానికి రుతుపవనాలు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
బెంగాల్ ఎన్నికలపై ప్రభావం
బెంగాల్ ఎన్నికలపై రెమల్ తుఫాన్ ప్రభావం చూపనుంది. ఆరో విడత కింద శనివారం పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే తుఫాన్ నేపథ్యంలో ఎన్నికల అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎన్నికలు జరగాల్సిన తమ్లుక్, కంఠి, ఘటల్, ఝర్‌గ్రామ్, మేదినిపూర్, పురూలియా, బంకురా, బిష్ణుపూర్‌లలో పోలింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఎన్నికల కమిషన్ అధికారులకు సూచించింది. ఇందులో భాగంగా బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అరిజ్ అఫ్తాబ్ ఆయా జిల్లాల పోలీసు సూపరింటెండెంట్‌లు, రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా పోలింగ్‌కు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత కోస్తా జిల్లాలకు అదనపు సిబ్బందిని పంపాలని సూచించారు.