Who is Next Telangana CM : బీఆర్ఎస్ గెలిస్తే సీఎం ఎవరు ? - కేటీఆర్ సమాధానం ఇదే
కేసీఆర్ జీవించి ఉన్నంత వరకూ సీఎంగా ఉంటారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఓ టీవీ చానల్ ఇంటర్యూలో ఆయన పలు కీలక అంశాలపై క్లారిటీ ఇచ్చారు.
Who is Next Telangana CM : తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. డిసెంబర్ మూడో తేదీన విజేత ఎవరో తేలుతుంది. అయితే గెలుపు ఎవరిది అని మాత్రమే కాకుండా ఏ పార్టీ గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అన్నదానిపైనా విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. రేసులో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వంటి వారు ఉండవచ్చు. మరి బీార్ఎస్ గెలిస్తే.. ఇందులో మరో సందేహం ఉండదు కేసీఆరే సీఎం అనుకుంటారు. కానీ చాలా కాలంగా కేటీఆర్ సీఎం అనే నినాదం వినిపిస్తోంది. అందుకే ఈ సారి బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ సీఎం కావొచ్చన్న అంచనాలు ఉన్నాయి. దీనిపై కేటీఆర్ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూల్లో సూటిగా స్పందించారు.
కేసీఆర్ జీవించి ఉన్నంత వరకూ ఆయనే సీఎం
ఎన్నికల సన్నాహాల్లో భాగంగా మీడియా సంస్థలకు ఇంటర్యూలు ఇస్తున్న కేటీఆర్ ఓ టీవీచానల్ లో జరిగిన చర్చా కార్యాక్రమంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అన్న అంశంపై స్పందించారు. వచ్చే ఎన్నికల తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపడతారాన్నది అపోహేనని స్పష్టం చేశారు. కేసీఆర్ కోరుకున్నంత కాలం.. జీవించినంత కాలం ఆయనే సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు. తెలంగాణకు కేసీఆర్ అవసరం ఉందన్నారు. తాను ముఖ్యమంత్రి అవుతానన్న ప్రశ్నే రాదన్నారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే ?
కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించిన తర్వాత ఆయన పూర్తిగా జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.అందుకే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చారు. కొన్ని రాష్ట్రాల్లో పర్యటించారు. మహారాష్ట్ర నుంచి విస్తృతంగా పార్టీ నేతల్ని చేర్చుకున్నారు. అయితే తెలంగాణ ఎన్నికలు దగ్గర పడటంతో మళ్లీ పూర్తిగా తెలంగాణపైనే దృష్టి కేంద్రీకరించారు. మహారాష్ట్రలో కూడా పర్యటనలు తగ్గించుకున్నారు. కానీ జాతీయ రాజకీయాలపై కేసీఆర్ కు ఓ ఆలోచన ఉందని కేటీఆర్ చెబుతున్నారు. ఎన్నికల తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు.
బీఆర్ఎస్ గెలిస్తే ఖచ్చితంగా కేసీఆరే సీఎం !
కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల తర్వాత ఆయనే సీఎం కావొచ్చని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో పలుమార్లు కేటీఆర్ సీఎం అవుతారని.. కేసీఆర్ బాధ్యతలు ఇవ్వబోతున్నారని ఆ పార్టీ నేతలు బహిరంగ ప్రకటనలు చేశారు. మోదీ చెప్పిన దాని ప్రకారం.. గతంలో ప్రయత్నించారని కానీ ప్రధాని మోదీ వ్యతిరేకంగా స్పందించడంతో ఆగిపోయారని అంటున్నారు. అయితే కేటీఆర్ ను సీఎం చేయడానికి ప్రధాని ఆమోదం ఎందుకన్నది ఓ సందేహం. కారణం ఏదైనా వచ్చే ఎన్నికల తర్వాత కూడా బీఆర్ఎస్ గెలిస్తే హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ ప్రమాణం చేస్తారని కేటీఆర్ గట్టిగా చెబుతున్నారు.