KTR In Khammam : కులం, మతం పేరుతో రాజకీయ చిచ్చు - యువత ఆలోచించాలని కేటీఆర్ సలహా !
దేశంలో కుల, మతాల పేరుతో రాజకీయ చిచ్చు పెడుతున్నారని కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. యువత ఈ అంశంపై ఆలోచించాలన్నారు.
KTR In Khammam : 1987లో భారతదేశం ఆర్థిక పరిస్థితి, చైనా ఆర్థిక పరిస్థితి సేమ్. కానీ ఈ 35 ఏండ్ల తర్వాత చూస్తే.. చైనా 16 ట్రిలియన్ డాలర్లతో ముందుకు దూసుకుపోయింది. మనం మాత్రం 3 ట్రిలియన్ డాలర్లతో వెనుకబడిపోయాం అని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పేదల సంక్షేమం, దేశ పురోగతి, అభ్యున్నతి, ఎదిగిన దేశాలతోనే మా పోటీ అని చైనా ప్రకటించి, అభివృద్ధిపై దృష్టి సారించింది. ప్రపంచంలోనే నంబర్ వన్‌గా చైనా ఎదిగిందన్నారు. మనకేమో కుల పిచ్చి, మత పిచ్చి ఎక్కువైపోయింది. దీంతో అభివృద్ధి అడుగంటి పోయిందన్నారు.
మన దేశంలో ఏం జరుగుతుందో యువత ఆలోచించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ సూచించారు. ప్రపంచంలో జరుగుతున్న చర్చ గురించి అందరూ ఆలోచించాలి. శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లిలు దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఎందుకీ విపరీత ధోరణులు కనిపిస్తున్నాయని ప్రశ్నించారు. చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నది ఎవరో ఆలోచించాలని .. కరెంట్, నీళ్లు లేని గ్రామాల గురించి ఆలోచించాల్సి ఉందన్నారు. పిల్లల ఉద్యోగాల గురించి ఆలోచించాలి. కానీ కులం, మతం పేరిటి చిల్లర మల్లర రాజకీయాలు చేస్తూ, పచ్చగా ఉన్న దేశంలో చిచ్చుపెట్టి, ఆ చిచ్చులో చలి మంటలను కాచుకోని, నాలుగు ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
ఖమ్మం నగరంలో మంత్రి @KTRTRS పర్యటిస్తున్నారు. నగరంలోని లకారం చెరువు పై ₹ 11.75 కోట్లతో నిర్మించిన కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ & మ్యూజికల్ ఫౌంటెన్, ఎల్ఈడి లైటింగ్ ను మంత్రి @puvvada_ajay తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు pic.twitter.com/cDGLkefrnW
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 11, 2022
ఒకే ఒక్క రోజు రూ. 100 కోట్లతో నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ఖమ్మంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ తెలిపారు. గతంలో మురికి కూపంగా ఉన్న లకారం చెరువును అద్భుతంగా అభివృద్ధి చేశారు. లకారం చెరువు వద్ద తీగల వంతెనను ఏర్పాటు చేశాం. రోజుకు 2 వేల మంది అక్కడికి వచ్చి ఆహ్లాదంగా గడుపుతున్నారు. ఖమ్మం కార్పొరేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి మరో కార్పొరేషన్‌లో జరగడం లేదు. ఖమ్మం నగరాన్ని నెంబర్‌వన్‌గా మార్చాలన్నది మంత్రి అజయ్ లక్ష్యమని స్పష్టం చేశారు.
లకారం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెనను మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ. 11.75 కోట్లతో తీగల వంతెనను నిర్మించారు. మ్యూజికల్ ఫౌంటైన్, ఎల్ఈడీ లైటింగ్‌ను ప్రారంభించారు. రఘునాథపాలెంలో రూ. 2 కోట్లతో నిర్మించిన ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. పలుమార్లు వాయిదా తర్వాత కేటీఆర్ ఖమ్మంకు రావడంతో టీఆర్ఎస్ నేతలు భారీగా జన సమీకరమ చేశారు.