KTR US Tour: అమెరికాలో కేటీఆర్‌కు ఘన స్వాగతం, అందుకు నిధుల సాధనే లక్ష్యం - పర్యటన వివరాలివీ
KTR in America: తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు సాధించడంపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులోనే భాగంగా మంత్రి కేటీఆర్ (KTR) అమెరికా పర్యటనకు వెళ్లారు.
KTR America Tour: తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కే. తారకరామారావుకి ఈ రోజు (మార్చి 20) ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరానికి చేరుకున్న మంత్రికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు నాయకులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎన్నారైలు భారీగా ఘనస్వాగతం తెలిపారు. ఎయిర్ పోర్టులో మంత్రి కేటీఆర్‌కి పూల బొకేలు అందించి స్వాగతం తెలిపారు.
మంత్రి కే తారకరామారావు లాస్ ఏంజిల్స్ లో తనకు స్వాగతం పలికిన ఎన్నారైలతో తర్వాత కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలపైన ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. మన ఊరు - మన బడి కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని మంత్రి కేటీఆర్ చేశారు. అమెరికాలో పని చేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన బిడ్డలు తెలంగాణ ప్రభుత్వం తరపున రాయబారులుగా వ్యవహరించాలని కోరారు.
పెట్టుబడుల సాధనే లక్ష్యంగా
మన ఊరు - మన బడి పథకానికి ఎన్‌ఆర్‌ఐల నుంచి పెద్ద ఎత్తున విరాళాలను సాధించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతోంది. అమెరికాలో స్థిరపడ్డ తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలు తమ సొంతూరులోని ప్రభుత్వ పాఠశాలకు విరాళాలు ఇవ్వాలని గతంలోనే మంత్రి కేటీఆర్ పిలుపు ఇచ్చారు. వారు ఇచ్చే విరాళాన్ని బట్టి, పాఠశాలకు పేరు సైతం పెట్టే ఏర్పాట్లు చేశారు.
ఇక తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు సాధించడంపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులోనే భాగంగా మంత్రి కేటీఆర్ (KTR) అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడ ఎన్‌ఆర్‌ఐలు, పలు పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం కానున్నారు మంత్రి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు. మంత్రి పర్యటన ఈ నెల 26 వరకు కొనసాగనుంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్, శాన్‌డియాగో, సానో హోజే, బోస్టన్, న్యూయార్క్ నగరాల్లో పర్యటించి అనేక కంపెనీల అధిపతులతో భేటీ కానున్నారు. ఈ నెల 29 వరకు కొనసాగనున్న ఈ పర్యటనలో ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ అవుతారు.
అమెరికా అధికారిక పర్యటనకు తాను 5 ఏళ్ల తర్వాత వెళ్తున్నానని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ వారంలో పలు కంపెనీల ప్రతినిధులు, సీఈవోలతో భేటీలు షెడ్యూల్ అయ్యాయని, వీటిపట్ల చాలా ఎక్సైటింగ్ ఉన్నట్లుగా మంత్రి ట్వీట్ చేశారు.