KTR : అమ్మమ్మ ఊరి పిల్లలకు కేటీఆర్ బడి గిఫ్ట్ - సొంత డబ్బుతో కొత్త బిల్డింగ్ !
School : చిన్నప్పుడు ఆటలాడిన అమ్మమ్మ, తాతయ్యల ఊళ్లో మంచి స్కూల్ కూడా లేదని తెలుసుకున్న కేటీఆర్ సొంత నిధులతో కట్టించారు. వాటిని స్వయంగా ఓపెన్ చేశారు.
School buildings built with KTR own funds : భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక ఆర్‌అండ్‌ఆర్ కాలనీ కొత్త స్కూల్ భవనాన్ని ప్రారంభించారు. ఇది ప్రభుత్వ స్కూల్ భవనమే అయినా దీనికో ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. ఈ స్కూల్ బిల్డింగ్ ను కేటీఆర్ తన సొంత నిధులతో కట్టించారు. కొదురుపాక కేటీఆర్ అమ్మమ్మ ఊరు. అందుకే అమ్మమ్మ, తాతయ్యల జ్ఞాపకార్థం అక్కడి భావిపౌరులకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలతో స్కూల్ నిర్మించాలని నిర్ణయించుకున్నారు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన నిర్మాణం పూర్తి కావడంతో కేటీఆర్ ప్రారంభించారు.
కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఓ సారి కొదురుపాక గ్రామంలో పర్యటించినసమయంలో అమ్మమ్మ, తాతయ్యలతో తన జ్ఞాపకాలను పంచుకున్నారు. చిన్న తనంలో ఆ ఊళ్లో గడిపిన రోజులను జ్ఞాపకం తెచ్చుకున్నారు. ఆ సమయంలో స్కూల్ దుస్థితిని టీచర్లు, పిల్లలు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రిగా అప్పటికప్పుడు ప్రభుత్వ నిధులతో స్కూల్ నిర్మాణానికి ఆదేశాలుజారీ చేయవచ్చు. కానీ కేటీఆర్ తన అమ్మమ్మ, తాతయ్యల జ్ఞాపకార్థం ఆ భవనాన్ని తానే నిర్మించాలని అన్నారు. ప్రభుత్వం ద్వారా చేయించడం కన్నా సొంత ఖర్చుతో అమ్మమ్మ, తాతయ్యల జ్ఞాపకంగా బడిని నిర్మించి ఇవ్వాలని డిసైడయ్యి.. అక్కడే ప్రకటన చేశారు.
2022 జనవరి 10న నిర్మాణం ప్రారంభమయింది. మధ్యలో కొంత కాలం ఆగిపోయినా.. రెండేళ్లలో మొత్తం రెండు ఫ్లోర్లలో 18 తగరతి గదులను కట్టారు. అలాగే వంట గదితోపాటు డైనింగ్‌హాల్, కంప్యూటర్ గదులు, ప్రహరీ నిర్మించారు. జోగినపల్లి లక్ష్మీ - కేశవరావు జ్ఞాపకార్థం అని భవనాలపై రాయించారు.
తన అమ్మమ్మ - తాతయ్య జోగినపల్లి లక్ష్మీ - కేశవరావు జ్ఞాపకార్థం.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS రాజన్న సిరిసిల్ల జిల్లా, కొదురు పాకలో తన సొంత నిధులతో కార్పొరేట్‌కు దీటుగా ఆధునాతన సౌకర్యాలతో అద్భుతంగా నిర్మించిన పాఠశాలను నేడు ప్రారంభించారు.
— BRS Party (@BRSparty) September 26, 2024
పాఠశాలను రెండు ఫ్లోర్లలో 18… pic.twitter.com/uxQMYAYbnY
స్కూల్ బిల్డింగ్ సమకూరడంతో కేటీఆర్‌కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ కొదురుపాక ప్రజలకు మరో హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా గుడిని నిర్మించి, కొదురుపాక ప్రజలకు అంకితం చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ తల్లి.. తన నానమ్మ ఊరు అప్పర్ మానేరులో మునిగిపోయిందని.. లోయర్ మానేరులో ఇంకో అమ్మమ్మ ఊరు మునిగిపోయిందని.. కొదురుపాకలో ఇంకా జ్ఞాపకాలు ఉండటం సంతోషమన్నారు. బడి పూర్తి కావడంతో మా తాత ఆత్మ సంతోషిస్తదని ఊరికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.