Tirupati Laddu Row:బయటకి రావద్దని జగన్‌కి రాజాసింగ్ సలహా- తిరుమలేశుడికి లేఖ రాసిన మాధవీ లత
Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ ఇష్యూను తెలంగాణ బీజేపీ నేతలు అందిపుచ్చుకున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్, మాధవీలత కీలక వ్యాఖ్యలు చేశారు.
Rajasingh and Madhavilatha Comments On Laddu Row: తిరుమల లడ్డూ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో అసదుద్దీన్‌పై పోటీ చేసిన మాధవీలత అయితే తిరుమలేశుడికి లేఖ రాశారు. క్షమాపణ కోరుతూ రాసిన ఆ లేఖను హుండీలో వేయనున్నారు.
తిరుమల వేంకటేశ్వర స్వామి అంటే తెలుగు రాష్ట్రాల్లోనో దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలోనే హిందువులు పవిత్రంగా భావిస్తారన్నారు రాజాసింగ్. అలాంటి పవిత్రమైన గుడిలో ఇచ్చే ప్రసాదాన్ని అపవిత్రం చేసి అందులో జంతువుల కొవ్వును కలపడం దారుణమన్నారు. ఈ విషయం తెలుసుకున్న హిందువులంతా చాలా బాధ పడుతున్నారని అన్నారు. ఇలాంటి వాళ్లు కూడా దేశంలో ఉంటారా అనే అనుమానం కలుగుతుందని విమర్శించారు.
ఇలాంటి అపవిత్రమైన పని చేసిన వాళ్లు తిరుమల దేవాలయానికి వెళ్లి వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటారటా అంటూ సెటైర్లు వేశారు. ఎక్కడా జగన్ పేరు ప్రస్తావించకుండానే తీవ్ర విమర్శలు చేశారు. ఆయనకు ఓ సలహా కూడా ఇచ్చారు. ఆయన బయటకు రాకపోవడమే మంచిదని... ఇలాంటి పని చేశారని తెలిసిన వాళ్లంతా చంపేందుకు కూడా వెనుకాడరని అన్నారు. అందుకే బయట తిరగకపోవడం బెటర్ అన్నారు.
హిందూమతం, తిరుమలేశుడిపై నమ్మకం లేనివాళ్లు ఎందుకు దర్శించుకుంటారని రాజాసింగ్ ప్రశ్నించారు. అలాంటి వాళ్లు దర్శనాల పేరుతో షో చేయడం ఎందుకని నిలదీశారు. ఇలాంటి చర్యలపై యావత్ తెలుగు ప్రజలంతా తిట్టుకుంటున్నారని అన్నారు.
పవన్ చెప్పినట్టుగా ఓ చట్టం బోర్డు తీసుకురావాలని అన్నారు రాజాసింగ్. తాము ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ప్రభుత్వాల ముందు ఉంచుతున్నట్టు గుర్తు చేశారు. కచ్చితంగా ఆ మంచి రోజు వస్తుందని అన్నారు. వక్ఫ్ బోర్డు మాదిరిగానే హిందువుల కోసం బోర్డు ఉండాలని డిమాండ్ చేశారు.
ఏపీలోనే కాకుండా దేశంలోని హిందువులకు ఓ విజ్ఞప్తి చేశారు రాజాసింగ్. ఎవరైనా గుళ్లు గోపురాలను అపవిత్రం చేసేందుకు యత్నిస్తే వారికి నచ్చజెప్పాలన్నారు. దేవుడు భూములు కబ్జా చేస్తే అంతా కలిసి కాపాడేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఇంకో కీలక అంశాన్ని కూడా రాజా సింగ్ ప్రస్తావించారు. తిరుమల, శ్రీశైలం లాంటి గుడుల్లో చాలా మంది అన్యమతస్తులు ఉద్యోగాలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిని ఉద్యోగాల నుంచి తీసేయాలని సూచించారు. దీని కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చంద్రబాబుకు రాజా సింగ్ సూచించారు.
శ్రీవారి లడ్డూ కల్తీపై శ్రీనివాసుడికి లేఖ రాసిన మాధవీలత
తిరుమల లడ్డూలో జంతుకొవ్వులతో కూడిన నూనె కలిసిందనే ఆరోపణలపై తొలిసారిగా స్పందించారు మాధవీలత. పాప ప్రాయశ్చిత్తం కోసం శ్రీనివాసుడికి లేఖ రాశారు. తాము రాసిన లేఖలతోపాటు భక్తులు కూడా అందించిన లేఖలను శ్రీనివాసుడి హుండీలో వేస్తామన్నారు. వందే భారత్ ట్రైన్‌లో ఓ బృందంతో బయల్దేరి వెళ్లిన ఆమె కాలినడకన గుడికి వెళ్లి అక్కడ పాపపరిహార, ప్రాయశ్చిత్త పూజలు చేశారు.
Also Read: తిరుమల లడ్డూ వివాదంలో మరో కీలక పరిణామం- ఏఆర్ సంస్థపై కేసులు