Kodangal: పట్టాభూమిని అటవీ భూమిగా రికార్డుల మార్పు - కొడంగల్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం
Kodangal Land Issue: వికారాబాద్ కలెక్టరేట్ వద్ద ఓ యువకుడు ఆత్మహత్యాయత్నంచేశాడు. తన భూమిని అటవీ ప్రాంతంగా రికార్డుల్లోకి ఎక్కించారని ఆరోపిస్తున్నారు.

Kodangal man attempted suicide Land Issue: బిజీగా ఉన్న వికారాబాద్ కలెక్టరేట్ వద్ద ఓ యువకుడి హఠాత్తుగా ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. కలెక్టరేట్ ఆర్చికి తాడు కట్టుకుని ఆయన ఉరివేసుకునే ప్రయత్నం చేశారు. భద్రతా సిబ్బంది వెంటనే గుర్తించి.. రక్షించారు. అధికారుల తీరు వల్లనే తాను చనిపోవాలనుకుంటున్నానని ా యువకుడు చెబుతున్నాడు.
తల్లికి వారసత్వంగా వచ్చిన పట్టాభూమిని అటవీ భూమిగా మార్చిన అధికారులు
తన చావుకు ప్రభుత్వ అధికారులే కారణమని ఆ యువకుడు అంటున్నాడు. ఆ యువకుడు పేరు శ్రీనివాస్. ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్‌కు చెందిన వారు. నిరుపేద, చిన్న రైతు కుటుంబానికి చెందిన ఆ యువకుడి తల్లికి చిట్లపల్లి గ్రామంలో 24 గుంటల భూమి ఉంది. రెవిన్యూ రికార్డుల్లోనూా ఇది పట్టాభూమిగా ఉంది. అయితే ఇటీవలి కాలంలో ఆయనకు అటవీ అధికారుల నుంచి చిక్కులు వస్తున్నాయి. చిట్లపల్లి గ్రామంలో తన తల్లి వడ్డె చంద్రమ్మ పేరు మీద ఉన్న 24 గుంటల భూమి రెవెన్యూ రికార్డుల్లో ఉన్నప్పటికీ, అటవీశాఖ అధికారులు అది అటవీ భూమిగా వాదిస్తూ వస్తున్నారు.
ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టడంతో రీసర్వే చేయించాలని అధికారుల చుట్టూ తిరిగిన శ్రీనివాస్
శ్రీనివాస్ ఇటీవల బతుకుదెరువు కోసం ముంబై వెళ్లారు. అక్కడ కూలి పనులు చేసుకుంటున్నారు. ఇటీవల గ్రామానికివచ్చే సరికి ఆయన భూమిలో అటవీశాఖ బోర్డు కనబడింది. బతుకుదెరువు కోసం ముంబై వెళ్లొచ్చేలోపు, అధికారులు తమ భూమి అటవీ శాఖకు చెందిందని బోర్డు పెట్టి, నిషేధిత జాబితాలో చేర్చారని శ్రీనివాస్ ఆవేదన చెందారు. అటవీ అధికారులు చేసిన తప్పిదాన్ని సవరించాలని.. తన భూమి సర్వే చేయాలని ఆయన అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అదిగో ఇదిగో అని అధికారులు తిప్పించుకుంటున్నారు. ఇప్పటి వరకూ పదకొండు సార్లు కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. అటవీ శాఖ అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు.
కలెక్టర్ చెప్పినా పనికాకపోవడంతో ఆత్మహత్యాయత్నం
ఓ సారి స్వయంగా కలెక్టర్ ను కలిసి తన వినతి అందించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ వెంటనే ఆదేశాలు ఇచ్చినా, స్థానిక అధికారులు లెక్క చేయడం లేదు. దీంతో తన సమస్యకు పరిష్కారం దొరకని ఆందోలన చెందిన శ్రీనివాస్ తన చావుకు కారణం కొడంగల్ ఎఫ్ఆర్‌వో, డీఎఫ్‌వోలే అని లేఖ రాసి, వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ గేటుకు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. చివరి క్షణంలో గుర్తించిన భద్రతా సిబ్బంది శ్రీనివాస్ ను కాపాడారు.
భూసమస్యల వల్ల ఎంతో మంది కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కానీ ప్రయోజనం ఉండటం లేదు. చివరికి తమ ఆస్తులు ఇలా లిటిగేషన్లలో పడిపోవడంతో ఆత్మహత్యాయత్నాలు చేస్తున్నారు.





















