Kishan Reddy : కాంగ్రెస్ కూటమితో దేశ సమగ్రతకు ముప్పు - ప్రజలు తెలుసుకోవాలని కిషన్ రెడ్డి బహిరంగలేఖ !
Union Minister Kishan Reddy : కాంగ్రెస్ కూటమితో దేశ సమగ్రతకు ముప్పు ఏర్పడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకోవాలని బహిరంగలేఖ రాశారు.
Kishan Reddy On Congress : కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతృత్వంలోని కూటమితో దేశ సమగ్రతకు ముప్పువాటిల్లుతున్నదని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండి కూటమి’ అహంకారాన్ని ఆదిలోనే అడ్డుకోవాలి, సరైన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిస్తూ బహిరంగలేఖ రాశారు. సనాతన ధర్మానికి, హిందుత్వం, హిందీ మాట్లాడే ప్రజలకు కాంగ్రెస్ నేతృత్వంలోని పనికిరాని కూటమి రోజురోజుకూ ప్రమాదంగా మారుతోందనే విషయాన్ని దేశప్రజలు గమనించాలనికోరారు.
భారత సమైక్యతను దెబ్బతీస్తున్న కాంగ్రెస్ కూటమి
మొదట్నుంచీ అవకాశం దొరికినపుడల్లా భారతదేశ సమైక్యతను అస్తిరపరిచేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ప్రయత్నిస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఈ ప్రయత్నంతో దేశ సమగ్రతపట్ల తనకున్న విద్వేషాన్ని బయటపెట్టుకుంది. ఇటీవలే కాంగ్రెస్ కూటమిలోని DMK పార్టీకి చెందిన ఓ నాయకుడు.. యూపీ, బిహార్ నుంచి వచ్చే హిందీ మాట్లాడేవాళ్లు, తమిళనాడుకు టాయిలెట్లు కడిగేందుకు వస్తారని చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరం, ఆక్షేపణీయమన్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన కార్మికులు.. శ్రమనే నమ్ముకుని జీవనోపాధి కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళితే వారిని ఇంత నీచంగా అవమానించాల్సిన అవసరం ఉందా? శ్రమజీవులను అవమానించడం, కష్టపడి పనిచేసేవారికి అవహేళన చేయడం కాంగ్రెస్ పార్టీకి, వారితో అంటకాగుతున్న వారికి మొదట్నుంచీ అలవాటే. కుటుంబ రాజకీయాలే తప్ప సమాజం గురించి ఆలోచించడం తెలియని వారినుంచి ఇంతకన్నా గొప్పగా మరేం ఆశించగలమని ప్రశ్నిచారు.
గోమూత్రంపైనా అసభ్యకర వ్యాఖ్యలు
ఇటీవల పార్లమెంటులో చర్చ సందర్భంగా.. రాజకీయ స్వార్థంతో కడుపునిండా ద్వేషాన్ని నింపుకుని మాట్లాడారు. గోమూత్రాన్ని తాగే రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తుందన్న ఆ ఎంపీ అహంకార పూరితమైన మాటలను యావత్ సమాజం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతృత్వంలోని కూటమి పార్టీలు హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడాయి. డీఎంకే పార్టీ సనాతన ధర్మాన్ని కేన్సర్, డెంగ్యూ, మలేరియాతో పోల్చింది. కొంతమంది కుహనా లౌకికవాదులు అహంకారపూరితంగా నోటికొచ్చినట్లు మాట్లాడటమే మేధావితనమని, గొప్పతనమని అనుకుంటున్నారు. ప్రతిసారీ హిందుత్వం, పేద ప్రజలపై తమ అక్కసును వెల్లగక్కడం ద్వారా.. 2024 ఎన్నికలకు తమ ఎజెండాను స్పష్టం చేస్తోంది. అధికారంలోకి వస్తే హిందుత్వాన్ని, హిందువులను నిర్మూలించడమే తమ ఆలోచన అని స్పష్టం చేస్తోంది. ఇలా మాట్లాడితే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయేమోనని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించడం లేదని విమర్శఇంచారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ ఇంతే
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచీ కాంగ్రెస్ పార్టీ ఇదే ధోరణితో ముందుకెళ్తోంది. 1947 నవంబర్లో.. నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, పరమపవిత్రమైన సోమనాథ్ ఆలయాన్ని పునరుద్ధరిద్దామని చెప్పారు. దీనికి గాంధీ అంగీకరించినా.. నాటి ప్రధాని నెహ్రూ వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు.
1951 మే నెలలోనూ.. నాటి ప్రధానమంత్రి నెహ్రూ.. నాటి రాష్ట్రపతి శ్రీ రాజేంద్రప్రసాద్ గారికి లేఖ రాస్తూ.. సోమనాథ్ ఆలయ పున:ప్రాణప్రతిష్టలో (విదేశీ దురాక్రమణదారులు ధ్వంసం చేసిన ఆలయం) పాల్గొనవద్దని కోరారు. శ్రీ రాజేంద్రప్రసాద్ గారు వివిధ దేశాలనుంచి మట్టిని, వివిధ నదుల జలాలను సేకరించి ఈ కార్యక్రమాన్ని చాలా ఆడంబరంగా చేద్దామనుకుంటే.. విదేశాంగ కార్యదర్శి ద్వారా వివిధ దేశాల్లోని భారత అంబాసిడర్లకు లేఖలు రాసి.. రాష్ట్రపతి గారి మాటలను పట్టించుకోవద్దని ఆదేశించి హిందుత్వం పట్ల తన వ్యతిరేకతను చాటుకున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ, వారి కూటమిలోని పార్టీల అజెండా చాలా స్పష్టంగా కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆలోచన, ముందుకు సాగుతున్న తీరు భారతదేశ అంతర్గత భద్రతను ప్రశ్నించేదిగా ఉంది. మెజారిటీ ప్రజల విశ్వాసాన్ని, అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ప్రవర్తిస్తోంది. ఈ విషయాన్ని ప్రతి భారతీయుడూ గమనించి, ఖండించాలని అన్ని వర్గాల ప్రజలకు మనవిచేస్తున్నాను.