Kotha Prabhakar Reddy: కత్తిపోటుకు గురైన ఎంపీ ప్రభాకర్ రెడ్డిని పరామర్శించిన సీఎం కేసీఆర్
Kotha Prabhakar Reddy: కత్తిపోటుకు గురై సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు.
Kotha Prabhakar Reddy: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయనపై రాజు అనే వ్యక్తి కత్తితో దాడి దిగడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నానికి ప్రయత్నించడం సంచలనంగా మారింది. ఈ ఘటనలో ఎంపీకి పొట్టభాగంలో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను మెరుగైన వైద్య చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు.
ఈ క్రమంలో యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఎన్నికల ప్రచారం ముగించుకుని హెలికాప్టర్‌లో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు కేసీఆర్ చేరుకున్నారు. అనంతరం నేరుగా యశోదా ఆస్పత్రికి చేరుకుని ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు. వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై ఇప్పటికే కేసీఆర్ స్పందించారు. దాడిని తీవ్రంగా ఖండించిన కేసీఆర్.. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని వ్యాఖ్యానించారు. ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులు, అభిమానులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని సూచించారు.
'మా నేతలను భౌతికంగా అంతం చేసేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తోన్నారు. నిరాశలో ఉన్న కాంగ్రెస్ భౌతికదాడులకు దిగుతోంది. ఘటనపై ఈసీ అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి నా మీద జరిగినట్లుగానే భావిస్తా.. హింసా రాజకీయాలను ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలి. దాడులకు పాల్పడిన వారికి ప్రజలు బుద్ది చెప్పాలి. బీఆర్ఎస్ కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దు. మాకు తిక్కరేగితే రాష్ట్రంలో దుమ్ము రేగుతుంది. కత్తితో పొడవాలంటే మాకు చేతులు లేవా. కత్తులు దొరకవా.. దాడులు ఆపకపోతే మేం కూడా ఇదే పని ఎత్తుకుంటాం. కత్తులు పట్టుకుని బీఆర్ఎస్ అభ్యర్థులపై దాడులు చేస్తోన్నారు. ఎన్నికలు ఎదుర్కొనే దమ్ము లేని వారే కత్తులతో దాడికి దిగారు. బాగా పనిచేసే నాయకులపై దాడికి పాల్పడ్డారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటన విచారకరం' అని కేసీఆర్ అన్నారు.
అటు ఈ ఘటనపై రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కూడా స్పందించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ హింసను ఎప్పుడూ నమ్ముకోదని, కత్తి దాడి ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కత్తి దాడి ఘటనపై విచారణ జరిపి వాస్తవాలు వెల్లడించాలని కోరారు. ఇక మంత్రి హరీష్ రావు స్పందిస్తూ.. ఈ దాడి ఘటన విచారకరమని, రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడని తెలిపారు. కత్తి లోపలికి ఎక్కువగా దిగకపోవడం అదృష్టంగా భావించాలని, వైద్యులు సర్జరీ చేస్తున్నారని చెప్పారు. ఎంతవరకు ప్రమాదం ఉందో త్వరలోనే వైద్యులు చెబుతారని, రాజకీయంగా ఎదుర్కొవాలే తప్ప దాడులకు దిగడం సరికాదని అన్నారు. రాజకీయాల్లో హత్యలు, ప్రత్యక్ష దాడులు సరికాదని సూచించారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని, కానీ హత్యా రాజకీయాలు సరికాదని తెలిపారు. నిందితుడు రాజు ఏ పార్టీకి చెందిన వ్యక్తి అనేది తెలియదని, పోలీసుల సమగ్ర దర్యాప్తు తర్వాత వాస్తవాలు చెప్తారని అన్నారు.