Narsapur BRS Ticket : సునీతా లక్ష్మారెడ్డికే నర్సాపూర్ బీఆర్ఎస్ బీఫాం - సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఎంపీ టిక్కెట్ ఆఫర్ !
నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి చేతుల మీదుగానే ఆమెకు బీఫాం అందించారు.
Narsapur BRS Ticket : పెండింగ్ లో ఉన్న నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్‌పై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికే టిక్కెట్ ఖరారు చేశారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ ఆమెకు బీఫాం కూడా ఇచ్చారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి నిరాశ ఎదురయినట్లు అయింది. ఇప్పటికి రెండు సార్లు మదన్ రెడ్డి నర్సాపూర్ నుంచి విజయం సాధించారు. ఆయనకు సీఎం కేసీఆర్ మెదక్ ఎంపీ టిక్కెట్ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. సునీతా లక్ష్మారెడ్డికి బీఫాం ఇచ్చే సమయంలో మదన్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన చేతుల మీదుగానే బీఫాం అందించారు. దీంతో నర్సాపూర్ లో అసంతృప్తి లేకుండా అందరూ కలిసి సునీతా లక్ష్మారెడ్డి విజయానికి ప్రయత్నిస్తారని బీఆర్ఎస్ వర్గాలు సంతృప్తి వ్యక్తం చే్సతున్నాయి.
ప్రస్థుతం నర్సాపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మదన్ రెడ్డి కి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. పార్టీలో అంతర్గత సర్దుబాటు చేస్తూ, అధినేత సిఎం కేసీఆర్ ఆధ్వర్యంలో భేటీ అయిన బిఆర్ఎస్ పార్టీ కోర్ కమిటీ సభ్యులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మదన్ రెడ్డి తనతో పార్టీలో మొదటినుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకుడని కేసీఆర్ అన్నారు. 35 ఏండ్ల నుంచి సన్నిహితంగా కొనసాగుతున్న నేతగా తనకు అత్యంత ఆప్తుడని.. కుడి భుజం లాంటి వాడన్నారు. పార్టీ ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజ స్కందాలమీద వేసుకుని సునీత లక్ష్మారెడ్డి ని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా వుందన్నారు.
ప్రస్థుతం కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ గా కొనసాగుతున్న పార్లమెంటరీ స్థానం నుండి మదన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. మెదక్ జిల్లాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా కేవలం నర్సాపూర్ లోనే కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మదన్ రెడ్డి పాపులర్ లీడర్ అని కేసీఆర్ అన్నారు. వివాద రహితుడు సౌమ్యుడు మదన్ రెడ్డి సేవలను పార్టీ మరింత గొప్పగా వినియోగించుకోవాల్సి ఉన్నారు. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ఐక్యంగా ముందుకు పోవడం ద్వారా మదన్ రెడ్డి గారు పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశారని కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడి వారం రోజులు గడుస్తున్నా నర్సాపూర్అసెంబ్లీ టికెట్లపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తనకు టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని మదన్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో సమావేశాలు పెట్టి చెబుతున్నారు. దీంతో ఆయనను బుజ్జగించడానికి సమయం తీసుకున్నారు. చివరికి ఎంపీ టిక్కెట్ ఆఫర్ చేశారు. మెదక్ ఎంపీ సీటులో ఎలాంటి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ గెలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ బలంగా ఉంది. అందుకే ఎంపీగా వెళ్లడానికి మదన్ రెడ్డి అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.. దుబ్బాక నుంచి అసెంబ్లీ బరిలో ఉన్నారు.