TS Huzurabad : మాకూ ఓ ఉపఎన్నిక కావాలి..! తెలంగాణ నియోజకవర్గాల్లో పెరుగుతున్న డిమాండ్..! కేసీఆర్ ప్లాన్ రివర్స్..!?
పథకాలన్నీ హుజూరాబాద్ ప్రజలకే అమలు చేస్తూండటంతో తమకూ ఉపఎన్నిక కావాలని కోరుకుంటున్న ఇతర నియోజకవర్గాల ప్రజలు. రాజకీయ పార్టీలదీ అదే మాట.
మాకేం తక్కువ..? ఇదీ తెలంగాణలో హుజూరాబాద్ మినహా ఇతర నియోజకవర్గాల ప్రజలు అనుకుంటున్నమాట. ఈ పోలిక ఎందుకంటే.. ప్రభుత్వ ఆదరణ విషయంలో. తెలంగాణ ప్రజలు అంటే ప్రస్తుత ప్రభుత్వానికి.. హుజూరాబాద్ ప్రజలు మాత్రమే. ఏ పని చేసినా.. ఏ పథకం చేపట్టినా.. ఏ ప్రయోజనం కల్పించాలనుకున్నా.. మొత్తంగా.. హుజూరాబాద్ ప్రజలకు మాత్రమే అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో మిగతా నియోజకవర్గాల ప్రజలు కూడా.. తమకూ ఓ ఉపఎన్నిక వస్తే బాగుండు అనుకునే పరిస్థితి వచ్చింది.
హూజూరాబాద్ ప్రజలకు వరాల మూట..!
తెలంగాణలో హుజూరాబాద్ ప్రజలకు కురుస్తున్న వరాలు చూసి.. ఇతర నియోజకవర్గాల ప్రజల్లో ఆశలు ప్రారంభమయ్యాయి. తమ నియోజకవర్గానికి కూడా ఉపఎన్నిక వస్తే బాగుండు అని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని మీడియా.. సోషల్ మీడియాల్లో నిర్మోహమాటంగా చెప్పడానికి వెనుకాడటం లేదు. సోషల్ మీడియాలోనూ అదే చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీల నేతలూ ఇదే విమర్శలు చేస్తున్నారు. ఇతర నియోజకవర్గాలు తెలంగాణలో లేవా..? వారికి ప్రయోజనాలు కల్పించరా..? అని ప్రశ్నిస్తున్నారు. దళిత బంధును రాష్ట్రం మొత్తం అన్వయించాలంటూ మునుగోడు ఎమ్మెల్యే .. మంత్రి జగదీష్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. ఆయనను అరెస్ట్ చేసారు. దాంతో కాంగ్రెస్ నేతలందరూ... దళితలందరికీ సాయం చేయమని అడగడం తప్పా అని ప్రశ్నించడం ప్రారంభించారు.
రేషన్ కార్డులు.. కొత్త పెన్షన్లూ వారికే..!
ఒక్క దళిత బంధు మాత్రమే కాదు.. అనేక సంక్షే్మ పథకాలు ఇప్పుడు.. హుజూరాబాద్ ప్రజలకు అందుతున్నాయి. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేసి చాలా కాలం అయింది. అలాగే కొత్త సామాజిక పెన్షన్లు కూడా . ఈ రెండింటి కోసం ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే మళ్లీ పంపిణీ చేస్తామని నిర్ణయం ప్రకటించిన తెలంగాణ సర్కార్ వాటిని హుజూరాబాద్‌కే పరిమితం చేస్తోంది. అక్కడ అడిగిన వారికి రేషన్ కార్డులు.. పెన్షన్లు ఇస్తోంది. ఇతర చోట్ల మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న జనం...మాకో ఉపఎన్నిక వస్తే బాగుండని అనుకునే పరిస్థితి వచ్చింది.
జోరుగా సాగుతున్న అభివృద్ధి పనులు..!
అదే సమయంలో హుజూరాబాద్‌లో అభివృద్ధి పనులను చురుకుగా కొనసాగిస్తున్నారు. ముఖ్యమమైన సమస్యను గుర్తించి వాటి పరిష్కారానికి నిధులు మంజూరు చేశారు. కాంట్రాక్టర్లు తమ పనులు తాము ప్రారంభించారు. ఇక దళిత బంధు పథకం గురించి.. ఎంత చర్చ జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. అది కూడా ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గానికే పరిమితం కావడం.. ఇతర నియోజకవర్గాల వారిని నిరాశపరుస్తోంది. తమకు ఒక్కటీ అదనంగా అందడం లేదని.. అన్నీ హుజూరాబాద్ నియోజకవర్గానికే వెళ్తున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వారికి తమకీ ఉపఎన్నిక వస్తే బాగుండని బహిరంగంగా చెప్పడం ప్రారంభించారు.
తమ ఎమ్మెల్యేను రాజీనామా చేయమని ప్రజలు డిమాండ్ చేసే పరిస్థితి వస్తుందా..?
రాజకీయ పార్టీలు.. పాలనను పూర్తిగా రాజకీయ కోణంలో చూస్తూండటంతోనే ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అప్పటికప్పుడు రాజకీయంగా లబ్ది పొందితే చాలన్నట్లుగా నిధులు.. పథకాలు అమలు చేస్తున్నారు. దీంతో ప్రజలు కూడా.. ఎన్నికలు వచ్చినప్పుడే ఆశించాలన్నట్లుగా అలవాటు పడిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ముదిరితే ఉపఎన్నిక కోసం రాజీనామా చేయాలని ప్రజలు తమ ఎమ్మెల్యేలను డిమాండ్ చేసే పరిస్థితి రావొచ్చని అంచనా వేస్తున్నారు.