Telangana Secretariat Ambedkar Name : కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు - బీజేపీకి కొత్త టెన్షన్ తెచ్చి పెట్టిన కేసీఆర్ !
కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. కొత్త పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టాలని కేసీఆర్ కోరుతున్నారు.
Telangana Secretariat Ambedkar Name : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇలా అంబేద్కర్ పేరు పెట్టడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంబేద్కర్ దార్శనికతతోనే తెలంగాణ ఏర్పాటు అయిందన్నారు. పార్లమెంట్ కొత్త భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రధానికి లేఖ రాస్తానని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర కేంద్ర పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్ కు భారత సామాజిక దార్శనికుడు అంబేద్కర్ పేరును నామకరణం చేయడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని కేసీఆర్ అన్నారు అంబేద్కర్ మహానుభావుడు కలలుగన్న భారతదేశంలో భిన్నత్వంతో కూడిన ప్రత్యేక ప్రజాస్వామిక లక్షణం ఉన్నది. ఫెడరల్ స్పూర్తి ని అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని వర్గాలకు సమాన హక్కులు అవకాశాలు కల్పించబడుతాయనే అంబేద్కర్ స్పూర్తి మమ్మల్ని నడిపిస్తున్నదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. భారత దేశ ప్రజలు కుల, మత, లింగ, ప్రాంతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలు సమానంగా గౌరవించబడి, అందరికీ సమాన అవకాశాలు కల్పించబడడమే నిజమైన భారతీయత. ఆనాడే నిజ భారతం ఆవిష్కృతమౌతుంది. అందుకోసం మా కృషి కొనసాగుతది. అన్ని రంగాల్లో దార్శనికతతో ముందుకుపోతూ, అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం, అంబేద్కర్ మహాశయుని పేరును రాష్ట్ర సెక్రటేరియట్ కు పెట్టడం ద్వారా మరోసారి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామని కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
కొత్త సచివాలయాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
పాత సచివాలయ భవనాలను కూల్చి వేసి సమగ్రమైన కొత్త సచివాలయ భవనాన్ని తెలంగాణ సర్కార్ నిర్మిస్తోంది. చివరి స్టేజిలో నిర్మాణం ఉంది. పూర్తిగా కాకపోయినా కనీసం సీఎం చాంబర్‌ను అయినా వచ్చే దసరాకు ప్రారంభించాలని పనులు వేగంగా చేస్తున్నారు. పైభాగంలో కొన్నిపనులే జరగాల్సి ఉన్నందున, దసరా నాటికి కొత్త సచివాలయాన్ని ప్రారంభించుకోవచ్చని, పైభాగంలో పనులతో పెద్దగా ఇబ్బంది ఉండదని అధికార వర్గాలు చెబుతున్నాయి. కొత్త సచివాలయాన్ని ఏడంతస్తుల్లో, 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. సంగతి తెలిసిందే. దిగువ భాగంలో ప్రధాన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అంతర్గతంగా తుది పనులు నడుస్తున్నాయి. తలుపులు, కిటికీలు, వాటికి అద్దాలు బిగించే పని కూడా మొదలైంది. ఇవన్నీ అనుకున్న సమయానికి పూర్తి కానున్నాయి. అద్భుతంగా ఉండనున్న ఈ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టనున్నారు.
సెంట్రల్ విస్టాకు అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్లు
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీలో కొత్తగా సెంట్రల్ విస్టా పేరుతో కొత్త పార్లమెంట్ భవనం నిర్మిస్తోంది. ఈ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్ తెలంగాణలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో పలు పార్టీలతో పాటు గద్దర్ వంటి ప్రముఖులు కూడా అన్ని పార్టీల నేతలను కలిసి పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కోరారు. ఇదే డిమాండ్‌తో తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానాన్ని కూడా ఆమోదించింది. అయితే ఈ అంశంపై ఇంత వరకూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స్పందించలేదు. వారిపై ఒత్తిడి తెచ్చేందుకు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
విశ్వగురు ఉచితాలు వద్దంటుంటే, ఈ జోకర్ ఎంపీ ఉచిత హామీలు ఇస్తున్నారు - కేటీఆర్
కేసీఆర్ నిర్ణయంతో బీజేపీపై పెరగనున్న ఒత్తిడి
కొత్త సచివాలయానికి ఎవరి పేరు పెట్టాలన్న చర్చ ఇప్పటి వరకూ పెద్దగా జరగలేదు. అయితే అనూహ్యంగా పార్లమెంట్ కార్యాలయానికి పేరుపెట్టాలని వస్తున్న డిమాండ్‌ను బీజేపీ పట్టించుకోకపోవడంతో కేసీఆర్ అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు బీజేపీపై మరింత ఒత్తిడి పెరగనుంది. రాజ్యాంగ నిర్మాతను బీజేపీ గౌరవించాలంటే సెంట్రల్ విస్టాకు అంబేద్కర్ పేరు పెట్టాల్సిందేనని.. లేకపోతే అవమానించినట్లేనన్న వాదన టీఆర్ఎస్ వర్గాలు చేయడానికి అవకాశం ఉంది.
అత్యాధునిక టెక్నాలజీతో రెడీ అవుతున్న రాజన్న సిరిసిల్ల నూతన పోలీస్ కార్యాలయం