Rajanna Sircilla: అత్యాధునిక టెక్నాలజీతో రెడీ అవుతున్న రాజన్న సిరిసిల్ల నూతన పోలీస్ కార్యాలయం
Rajanna Sircilla: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాకు పోలీసు కార్యాలయ భవనాన్ని మంజూరు చేసింది. నూతన పోలీస్ బిల్డింగ్ నిర్మాణం త్వరలోనే పూర్తి కానుంది.
చిత్రంలో రాజ భవనంలా కనిపిస్తున్న ఈ బిల్డింగ్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్మితమైన నూతన పోలీస్ కార్యాలయం. అత్యాధునిక టెక్నాలజీతో కొత్త హంగులతో గాలి, వెలుతురు,సూర్యరశ్మి వచ్చేలా విశాలమైన గదులతో అందరినీ ఆకట్టుకునేలా జిల్లా పోలీసు కార్యాలయం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాకు పోలీసు కార్యాలయ భవనాన్ని మంజూరు చేసింది. పట్టణ శివారులోని కలెక్టరేట్ వెనుక ప్రభుత్వ స్థలాన్ని పోలీసు కార్యాలయ భవనానికి మంజూరు చేసింది.
పోలీస్ ఆఫీసు బిల్డింగ్ తోపాటు జిల్లా పోలీసు ఉన్నతాధికారుల నివాస గృహాలు ఒకే ప్రాంగణంలో నిర్మించాల్సి ఉంది. ల్యాండ్‌స్కేప్, పార్కింగ్, అంతర్గత రహదారుల నిర్మాణం మినహా ప్రధాన భవన నిర్మాణం అందులోని గదులు తుది మెరుగుల దశలో ఉన్నాయి. విద్యుత్తు, నీటి వసతి పనులు జరుగుతున్నాయి.కార్పొరేట్ భవనాన్ని తలపించేలా అన్ని వసతులతో నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలో నిర్మించే జిల్లా పోలీసు కార్యాలయం ని దాదాపు ఇదే మోడల్ లో కడుతున్నారు. సిరిసిల్లలో నిర్మించే భవనానికి మిగతా చోట్ల కంటే ఎక్కువగా స్థలం ఉండడంతో రాష్ట్రంలో ఇదే అతి పెద్ద కార్యాలయమని దీని నిర్మాణ బాధ్యతలు చూస్తున్న పోలీస్ హౌసింగ్ బోర్డు అధికారులు చెబుతున్నారు.
మూడు అంతస్తుల్లో అన్ని వసతులు ఏర్పాటు
రూ.19 కోట్ల వ్యయంతో 52 వేల చదరపు గజాల విస్తీర్ణంలో మూడు అంతస్తుల్లో నిర్మించారు. ఎలాంటి విపత్తులు ఎదురైనా తట్టుకునేలా ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఉన్న ఈ భవన సముదాయంలో వసతులు ఏర్పాటు చేస్తున్నారు. సిరిసిల్ల, సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్ నుంచి కార్యాలయ రహదారికి ఎకరం భూమి అవసరం. భూసేకరణకు సంబంధించి రెవెన్యూ శాఖ సమీపంలోని రైతులతో సంప్రదింపులు చేస్తోంది.ఇది ఫైనల్ అయితే ఔటర్ రింగ్ రోడ్ నుంచి కార్యాలయానికి రహదారి మార్గం సులభం అవుతుంది. ప్రస్తుతం కలెక్టరేట్ నుంచి వెళ్లాల్సి వస్తోంది.ల్యాండ్స్కేప్, గార్డెనింగ్, అంతర్గత రహదారులకు నాలుగేళ్ల కిందట 50 లక్షలు మంజూరయ్యాయి. ప్రస్తుతం పెరిగిన ధరలతో దానికి రూ. కోటికి పెంచారు.ఈ పనులు ప్రారంభించాల్సి ఉంది. ఎస్పీ క్యాంప్ కార్యాలయం ప్రారంభించలేదు.
త్వరలోనే స్మార్ట్ పోలీసింగ్
తొలుత రెండు కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఇటీవల దానిని రివైజ్ చేశారు. ఇతర జిల్లా ఉన్నతాధికారుల క్వార్టర్లు, ప్రహరీ,ప్రధాన రహదారుల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం 16 విభాగాలుంటాయి. ఎస్పీ, ఏఎస్పీ గదులతో పాటు వారి ఓఎస్డీలు, సీసీలు, పీఆర్వో లకు వేరువేరుగా గదులు ఉంటాయి. స్టోర్స్, ఇన్ వార్డ్, అవుట్ వార్డులతో పాటు పాస్పోర్టు విచారణ, ఐటీసీ విభాగాలు ఉన్నాయి. రిసెప్షన్ తో పాటు గ్రీవెన్స్ కోసం ప్రత్యేకంగా హాలు ఉంది. మొదటి అంతస్తులో పరిపాలన విభాగంలోని ఆయా సెక్షన్ల సూపరిండెంట్లు, వారికి ప్రత్యేకంగా రికార్డ్ గదులు, మినీ కాన్ఫరెన్స్ హాల్,న్యాయ సేవ విభాగం ఇలా అన్ని కలిసి మొత్తం 21 గదులున్నాయి. మొత్తానికి సకల సౌకర్యాలతో భవనం రెడీ కావడంతో జిల్లా పోలీసులకు స్మార్ట్ పోలీసింగ్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే నేరాల అదుపులో ముందున్న తెలంగాణ పోలీస్ నూతన కార్యాలయాలు రావడంతో రెట్టించిన ఉత్సాహంతో పని చేయనున్నారు.